Time Management: చదవడానికి టైం చాలట్లేదా? ఇలా ట్రైచేసి చూడండి!
విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని పద్ధతులు ఇవిగో!
Published : 27 June 2024 07:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=27062024
టాప్ ర్యాంకరైనా.. అత్తెసరు మార్కులతో పాసైన సగటు విద్యార్థైనా.. ఎవరికైనా రోజులో ఉండేది 24గంటలే. అందరికీ సమానంగా ఉండే ఈ సమయంలో కొందరు పరీక్షల్లో విజయాలు సాధిస్తే.. మరికొందరు మాత్రం టైం సరిపోలేదని వాపోతుంటారు. ఎంతో విలువైన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని చదువుల్లో రాణించాలంటే కొన్ని పద్ధతులు పాటించాలంటున్నారు నిపుణులు. అవేంటో తెలుసుకుందామా..!
మీ టాస్క్‌లేంటో రాసుకోండి..
రోజులో మనం చేయాల్సిన పనులు అనేకం ఉంటాయి. వాటన్నింటినీ పూర్తి చేయడానికి పరిమితమైన సమయమే ఉంటుంది. అందువల్ల మీరు ముందు చేయాల్సిన, ముఖ్యమైన పనుల్ని ఒకచోట రాసుకోవడం అలవాటు చేసుకోండి. వాటిని ఫలానా సమయంలోగా పూర్తిచేయాలనే గడువు పెట్టుకోండి. ఇలా మీరనుకున్న ప్లాన్ ప్రకారమే పనులన్నీ చక్కబెట్టేలా ప్రయత్నించడం ద్వారా ఒత్తిడికి గురికారు.
చాప్టర్ల వారీగా విభజన..
పెద్ద పుస్తకాలు చదివేందుకు చాలామంది భయపడిపోతుంటారు. ఎక్కువ పేజీలు ఉన్న పుస్తకాల్ని చదవాల్సి వచ్చినప్పుడు ఒకేసారి కాకుండా దాన్ని చాప్టర్లవారీగా విభజించుకోవాలి. రోజుకో అధ్యాయం చొప్పున అర్థంచేసుకుంటూ చదివితే మంచి ఫలితం ఉంటుంది.
ఉదయాన్నే లేస్తే.. ఉపయోగాలెన్నో..
అలారం పెట్టుకుని ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి. మొదట్లో కాస్త ఇబ్బంది అనిపించినా.. మెల్లగా అలవాటైపోతుంది. ఇలా చేయడం వల్ల ఎవరికి వారు తమకోసం కాస్త సమయాన్ని కేటాయించుకునే ఛాన్స్ ఉంటుంది. ఉదయాన్నే వ్యాయామం చేస్తే రోజంతా చురుగ్గా ఉంటారు. ప్రశాంత వాతావరణంలో ఆటంకాలు లేకుండా చదువుకోవడానికీ ఛాన్స్ ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా సరిగా గుర్తుండని కొన్ని పాఠ్యాంశాల్ని ఈ సమయంలో చదివితే సులువుగా గుర్తుంటాయి.
ఆ ఆటంకాలకు దూరం దూరంగా
చదువుతున్న క్రమంలో ఎదురయ్యే వివిధ ఆటంకాలను అధిగమిస్తూ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నించాలి. యూట్యూబ్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలపై గడిపి మీ విలువైన సమయం వృథా చేసుకోవద్దు. చదువుకునే ప్రదేశంలో సెల్‌ఫోన్ లేకుండా జాగ్రత్త పడాలి. ఒక్కోసారి మీ కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సంభాషణలూ ఏకాగ్రతను దెబ్బతీయొచ్చు. అందువల్ల వారి మాటలేవీ వినిపించకుండా నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోవాలి.
చెక్‌లిస్ట్ ప్రిపేర్ చేయండి..
క్లాస్‌కు వెళ్లడం, పాఠ్యాంశాలను చదివే ఒత్తిడిలో మీరు చేయాల్సిన ఇతర ముఖ్యమైన పనుల్ని మరిచిపోయే ఛాన్స్ ఉండొచ్చు. అందుకే ఒక చెక్‌లిస్ట్ రాసి పెట్టుకుంటే మంచిది. పూర్తయిన పనుల్ని ఎప్పటికప్పుడు టిక్ చేసుకోవడం ద్వారా భారం దిగినట్టుగా అనిపిస్తుంది. ఈ పని చేయాలి, ఆ పని చేయాలని మనసులోనే పదేపదే అనుకోవడం వల్ల అనవసర ఆందోళనకు గురవుతారు. అదే ఒక చెక్‌లిస్టు ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటే అనుకున్న పనులు సాఫీగా చేసుకోవచ్చు.
అన్ని పనులూ ఒకేసారి వద్దు..
టైంని ఆదా చేయాలనే ఉద్దేశంతో అన్ని పనుల్నీ ఒకేసారి పెట్టుకోవద్దు. దీనివల్ల ఒత్తిడికి గురవుతారు. ఒక పని పూర్తయిన తర్వాత మరో పని మొదలుపెట్టొచ్చు. ఏకధాటిగా చదవకుండా మధ్యలో విరామం తీసుకోవడమూ అవసరమే. గంటసేపు చదివిన తర్వాత పావుగంటపాటు అటూఇటూ తిరగడం లేదా కాస్త విశ్రాంతి తీసుకోవడం లాంటివి చేస్తే విసుగు రాదు.
విశ్రాంతి చాలా అవసరం..
బాగా అలసిపోయినట్టుగా అనిపించినప్పుడు శరీరానికి విశ్రాంతి అవసరం. నిద్రవల్ల సమయం వృథా అవుతుందని భావించొద్దు. తగినంత విశ్రాంతి తీసుకోవడం వల్ల మర్నాడు రెట్టింపు ఉత్సాహంతో పని చేయగలుగుతారు.