CBSE Exams Preparation | సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో సత్తా చాటేలా.. విద్యార్థులూ ఇలా ప్రయత్నించండి!

CBSE Exams Preparation | సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షల్లో సత్తా చాటేలా.. విద్యార్థులూ ఇలా ప్రయత్నించండి!

సీబీఎస్‌ఈ బోర్డు పది, 12 తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు మంచి మార్కులతో రాణించేలా ప్రిపరేషన్‌కు నిపుణుల ఇవే..

Published :28 Nov 2024 06:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్‌ (CBSE Exams Schedule) ఇటీవలే విడుదలైంది. ఫిబ్రవరి 15 నుంచి ఈ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు ఇంకా రెండున్నర నెలలకు పైగా సమయం ఉండటంతో ఇప్పట్నుంచే తగిన ప్రణాళికతో సన్నద్ధత మొదలుపెడితే టాపర్‌గా నిలవడం కష్టమేమీ కాదు. ఈ పరీక్షల్లో రాణించాలంటే ప్రతి విద్యార్థీ ప్రయత్నించాల్సిన కొన్ని ప్రిపరేషన్‌ టిప్స్‌ ఇవిగో!

సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల డేట్‌ షీట్స్‌ ఇవిగో!

  • ఏ పరీక్ష రాయాలన్నా.. ముందుగా సిలబస్‌, ప్యాటర్న్‌ తెలుసుకోవడం ఎంతో కీలకం. సిలబస్‌ ఏంటో తెలిస్తే దానికనుగుణంగా స్టడీ ప్లాన్‌ను రూపొందించుకోవచ్చు. పరీక్షలకు సన్నద్దమయ్యే ప్రతి ఒక్కరూ ఎగ్జామ్‌ ప్యాటర్న్‌, సిలబస్‌ను స్పష్టంగా అర్థం చేసుకొని, సన్నద్ధత మొదలు పెడితే మంచి ఫలితాలు సాధించొచ్చు. గతంలో ఏయే చాప్టర్లకు ఎంత వెయిటేజీ ఇచ్చారో.. దాని ఆధారంగా చాప్టర్లకు ప్రియారిటీ ఇవ్వడం ద్వారా మంచి మార్కులు తెచ్చుకోవచ్చు.
  • ప్రతి సబ్జెక్టుకు నిర్దిష్టమైన సమయాలను కేటాయించేలా వాస్తవికతతో కూడిన స్టడీ షెడ్యూల్‌ను రూపొందించుకోండి.  ఒత్తిడిని నివారించి.. ఉత్పాదకతను మెరుగుపరుచుకొనేలా మీ స్టడీ షెడ్యూల్‌లో మధ్య మధ్యలో కాస్త విరామం ఉండేలా చూసుకోండి. 
  • ప్రిపరేషన్‌లో కొన్ని సబ్జెక్టులు/చాప్టర్లను వదిలేసి మార్కుల కోసం కొన్నింటిపైనే దృష్టిపెట్టడం చేయొద్దు. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణితో ప్రమాదంలో పడతారు. ప్రతి సబ్జెక్టూ/చాప్టర్లను పరీక్షలో అత్యంత కీలకమే. ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా అది మీ మార్కులపై ప్రభావం చూపుతుందని గుర్తుంచుకోండి. 
  • ఏ సబ్జెక్టయినా సరే.. అందులోని ప్రాథమిక అంశాలపై పట్టు పెంచుకోవడంపై దృష్టి పెట్టండి. మరింత లోతైన అవగాహన కోసం ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలను ఒక మంచి వనరుగా ఉపయోగించుకోండి. బట్టి పట్టి చదవడం వల్ల దీర్ఘకాలిక ప్రయోజనం ఉండదు. 
  • పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయండి. కనీసం ఐదు నుంచి పదేళ్ల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీసు చేయడం ద్వారా గతంలో ఏయే పాఠ్యాంశాల నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వచ్చాయో అర్థమవుతుంది. తద్వారా ప్రాధాన్యతలు నిర్ణయించుకొని ప్రాక్టీసు కొనసాగిస్తే పరీక్ష రాయడంలో వేగం పెరగడంతో పాటు కచ్చితత్వం మెరుగుపడుతుంది.
  • మాక్ టెస్టులను ఎప్పటికప్పుడు రాయడం అలవాటు చేసుకోండి.  పరీక్ష సమయంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అంచనా వేసేందుకు మాక్‌ టెస్టు సీరీస్‌లో నమోదు చేసుకోండి.  తద్వారా మీ అధ్యయన తీరును విశ్లేషించుకొని.. ఎక్కడ వెనకబడి ఉన్నారో ఆ అంశాలను రివిజ్‌ చేసుకొనే ప్రయత్నం చేయండి. 
  • విద్యార్థులకు నిద్ర చాలా చాలా అవసరం. సరిపడా గాఢనిద్ర లేకపోతే  జ్ఞాపకశక్తి, అకడెమిక్‌ పెర్ఫామెన్స్‌పైనే కాదు.. మొత్తంగా వారి ఆరోగ్యంపైనే ప్రభావం ఉంటుంది. పరీక్షల సమయంలో నిద్రను నిర్లక్ష్యం చేయొద్దు.  రోజూ తగినంతగా నిద్రపోవడం వల్ల ఫోకస్‌ పెరగడంతో పాటు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి మెరుగవుతుంది. నేర్చుకొనే ప్రక్రియలో ఎంతో కీలకమైన నిద్రను ఈ పరీక్షల సీజన్‌లో నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్త వహించండి.