NEET UG 2025 | అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయాల్సిందే.. నీట్‌ (యూజీ) పరీక్ష సరళిలో కీలక మార్పులివే..!

NEET UG 2025 | అన్ని ప్రశ్నలకూ సమాధానం రాయాల్సిందే.. నీట్‌ (యూజీ) పరీక్ష సరళిలో కీలక మార్పులివే..!

దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG) పరీక్ష ప్రశ్నపత్రంలో కీలక మార్పులు చేశారు.

Eenadu icon
By Education News Team Published : 26 Jan 2025 18:02 IST

NEET UG 2025 | దేశవ్యాప్తంగా వైద్య విద్యా కళాశాలల్లో అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ యూజీ (NEET UG) పరీక్షకు ప్రిపేర్‌ అవుతున్న అభ్యర్థులకు కీలక అప్‌డేట్‌! రిజిస్ట్రేషన్ల కోసం అపార్‌ ఐడీ(APAAR ID) తప్పనిసరి కాదని ఇటీవల స్పష్టం చేసిన ఎన్టీఏ (NTA).. తాజాగా నీట్‌ పరీక్ష విధానంలో మార్పులు చేసినట్లు వెల్లడించింది. ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్ష ప్రశ్నపత్రం సరళి, పరీక్ష వ్యవధిలో మార్పులు చేస్తున్నట్లు ఎన్టీఏ (NTA) తెలిపింది. కొవిడ్‌ కన్నా ముందు ఉన్న ఫార్మాట్‌లోనే నీట్‌  పరీక్ష నిర్వహించాలని నిర్ణయించినట్లు ఈ మేరకు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఇకపై నీట్‌ యూజీ పరీక్షలో ‘సెక్షన్‌ బి’ ఉండదని, కొవిడ్‌ సమయంలో విద్యార్థులకు ఇచ్చిన ఆప్షనల్‌ ప్రశ్నలు, అదనపు సమయాన్ని సైతం తొలగిస్తున్నట్లు తేల్చి చెప్పింది. 

ప్రశ్నపత్రం సరళి ఇలా..

  • నీట్‌ యూజీ 2025 ప్రశ్నపత్రంలో మొత్తం 180 తప్పనిసరి ప్రశ్నలే ఉంటాయి. 
  • ఫిజిక్స్‌, కెమెస్ట్రీ నుంచి 45చొప్పున మార్కులు ఉండగా.. బయాలజీ నుంచి 90 మార్కులు ఉంటాయి. 
  • ఈ ప్రశ్నల్ని కేవలం 180 నిమిషాలు (3గంటల వ్యవధి) పూర్తి చేయాల్సి ఉంటుంది.
  • కొవిడ్‌ మహమ్మారి సమయంలో తాత్కాలికంగా ప్రవేశపెట్టిన  ఆప్షనల్‌ ప్రశ్నల నిబంధన ఇకపై అందుబాటులో ఉండదు. 

గతేడాది ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపడంతో ఈసారి ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నీట్‌ యూజీ పరీక్ష పెన్ను, పేపర్‌ మోడ్‌ (ఓఎంఆర్‌ ఆధారితంగా)లో ఒకేరోజు ఒకే షిఫ్ట్‌లో నిర్వహిస్తారు. నీట్‌కు ప్రిపేరవుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్‌ కోసం ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌ను రెగ్యులర్‌గా చెక్‌ చేసుకోవాలని ఎన్టీఏ తెలిపింది. నీట్‌ యూజీకి సంబంధించి ఏదైనా సమాచారం కోసం 011-40759000 నవంబర్‌ లేదా neetug2025@nta.ac.inకు ఈ-మెయిల్‌ చేయొచ్చని సూచించింది.