Stress | పరీక్షల ఒత్తిడిని చిత్తు చేయండిలా.. ఈ ఆరు సూత్రాలతో విజేత మీరే!
పరీక్షల సమయంలో ఒత్తిడి, ఆందోళనల్ని ఎదుర్కొని మంచి మార్కులతో రాణించేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని చిట్కాలివే..
By Education News Team
Published :06 Jan 2024 07:30 IST
https://results.eenadu.net/news.aspx?newsid=05012025
Tips to Beat Exam Stress | ఇంటర్నెట్ డెస్క్: పరీక్షలు (Exams) వస్తే చాలు.. విద్యార్థులు పుస్తకాలతో కుస్తీలు పడుతుంటారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన, మానసిక ఒత్తిడి(Stress)కి గురై అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటారు. ఈ నేపథ్యంలో పరీక్షల ఒత్తిడి తట్టుకొని మంచి మార్కులతో రాణించేందుకు నిపుణులు సూచిస్తోన్న కొన్ని మెలకువలు ఇవే..
స్టడీ ప్లాన్..
కొందరు విద్యార్థులు విద్యా సంవత్సరం ప్రారంభంలో చదవాల్సిన అంశాలను వాయిదా వేస్తూ వస్తుంటారు. చివరకు పరీక్షల సమయంలో హడావుడి పడుతూ తీవ్ర ఒత్తిడికి లోనవుతుంటారు. అలా కాకుండా ఎప్పటికప్పుడు పాఠాలు చదవడం పూర్తి చేస్తే ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. రివిజన్‌కూ సమయం దొరుకుతుంది. అందువల్ల, ముందుగానే తగిన ప్రణాళికతో చదవడం అలవాటు చేసుకుంటే పరీక్షల్లో మంచి మార్కులతో రాణించొచ్చు.
నిద్రలో రాజీవద్దు
ఆరోగ్యంగా ఉండేందుకు కచ్చితంగా సరిపడా నిద్రపోవాలి. కనీసం రోజుకు 7 నుంచి 8 గంటలపాటు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ ఒకే సమయంలో నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నిద్రకు ఉపక్రమించే అరగంట ముందు నుంచి ఫోన్లు, ల్యాప్‌టాప్ లాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను దూరంగా ఉంచుకోవాలి. తగినంత నాణ్యమైన నిద్రతో మీ జ్ఞాపకశక్తి మెరుగవడంతో పాటు రోజంతా చురుగ్గా ఉంటారు.
స్టడీ.. బ్రేక్.. స్టడీ
పుస్తకాల ముందు గంటలు తరబడి కూర్చుంటే ఉపయోగం ఉండదు. మెదడును ఎప్పటికప్పుడు రీఫ్రెష్ చేసుకోండి. చదివే సమయంలో ప్రతి 20-30 నిమిషాలకు ఓసారి ఓ చిన్న విరామం(బ్రేక్) తీసుకోవడం ద్వారా మీ మైండ్ ఫ్రెష్‌గా ఉండటంతో పాటు బర్నవుట్ నియంత్రించవచ్చు.
పాజిటివ్‌గా ఉంటేనే..
సానుకూల దృక్పథంతో ఒత్తిడిని నియంత్రించవచ్చు. మీరు చేసే ప్రయత్నాలు, మీ సామర్థ్యంపై ఫోకస్ పెట్టండి. తద్వారా మానసిక ఆందోళనను అధిగమించొచ్చు. ఒత్తిడి ఎక్కువగా ఉంటే అవసరమైతే మీ టీచర్లు, కౌన్సెలర్లు, మీరు బాగా విశ్వసించే వ్యక్తుల సహకారం తీసుకోండి. ఒత్తిడితో ఎవరికి వారే కుంగిపోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. వ్యక్తిగత సమస్యలను కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సహకారంతో పరిష్కరించుకోవాలి. సమస్య ఎలాంటిదైనా దాన్ని బయటకు వ్యక్తం చేయగలిగే నైపుణ్యం అలవర్చుకోండి.
వ్యాయామంతో నూతనోత్సాహం
నిత్యం నూతనోత్సాహంతో ఉండేందుకు రోజూ 30 నిమిషాల పాటు వ్యాయామం చేయండి. తద్వారా ఒత్తిడిని నియంత్రించవచ్చు. వ్యాయామంతో విడుదలయ్యే ఎండార్ఫిన్ల వల్ల రోజంతా ఉత్సాహంగా ఉండగలుగుతారు. ముక్కుతో దీర్ఘంగా శ్వాస తీసుకుని, కాసేపు దాన్ని నిలిపి ఉంచి నోటితో మెల్లగా గాలిని వదలినా ఒత్తిడి తగ్గుతుందంటారు. నడక, కొన్ని రకాల స్ట్రెచింగ్ వ్యాయామాలు, యోగా, ధ్యానం వల్ల శారీరంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండొచ్చు.
అలాంటి ఫుడ్స్‌కు దూరంగా!
పౌష్టికాహారం తీసుకోండి. చక్కెర వినియోగించిన స్నాక్స్, ప్రాసెస్ చేసిన ఆహారపదార్థాలకు దూరంగా ఉండండి. అన్ని పోషకాలు సమృద్ధిగా లభించే సమతుల్యమైన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వండి. పోషకాహారం తీసుకోవడం ద్వారా కొంతమేరకు ఒత్తిడిని నియంత్రించవచ్చు. గుడ్లు, గుమ్మడిగింజలు, డార్క్‌చాక్లెట్లు, పెరుగు, ఒమెగా-3 ఫ్యాటీయాసిడ్లు ఉండే చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడిని తగ్గించుకోవచ్చంటున్నారు నిపుణులు.