AISSEE 2025 | మీ పిల్లల్ని సైనిక్ స్కూళ్లలో చేరుస్తారా? ఇదిగో సువర్ణావకాశం!
చిన్ననాటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం.
By Education News Team
Published :25 Dec 2024 18:22 IST
https://results.eenadu.net/news.aspx?newsid=25122024
Sainik Schools Entrance Exam| ఇంటర్నెట్ డెస్క్: చిన్ననాటి నుంచే దేశ రక్షణ రంగంలో పనిచేయాలని కలలుగనే విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. త్రివిధ దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల విద్య నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సైనిక పాఠశాలల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. వచ్చే విద్యా సంవత్సరం(2025-26)లో ఆరు, తొమ్మిది తరగతుల్లో ప్రవేశాలకు ఆలిండియా సైనిక్ స్కూల్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (AISSEE 2025) కోసం ఎన్‌టీఏ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.
నోటిఫికేషన్‌లో ముఖ్యాంశాలివే..
- ఆసక్తి కలిగిన విద్యార్థులు 2025 జనవరి 13న సాయంత్రం 5గంటల వరకు ఆన్‌లైన్‌లో https://exams.nta.ac.in/AISSEE/ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కూళ్లన్నీ సీబీఎస్‌ఈ అనుబంధ ఇంగ్లిష్ మీడియం రెసిడెన్షియల్ పాఠశాలలే. నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఇండియన్ నేవీ అకాడమీ, ఇతర శిక్షణా అకాడమీలకు ఇక్కడ క్యాడెట్లను సిద్ధం చేస్తారు.
- పెన్ను, పేపర్ (OMR షీట్) విధానంలోనే ఈ పరీక్ష ఉంటుంది. మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి.
- దేశ వ్యాప్తంగా 190 పట్టణాలు /నగరాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
- అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్, ప్రవేశ పరీక్ష నిర్వహించే తేదీలను తర్వాత ప్రకటిస్తారు.
- ఆరోతరగతికి దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు మార్చి 31, 2025 నాటికి 10 నుంచి 12 ఏళ్ల మధ్య ఉండాలి. బాలికలకు ప్రవేశాలు అందుబాటులో ఉన్నాయి. సీట్ల లభ్యత, వయస్సు ప్రమాణాలు ఇద్దరికీ ఒకేలా ఉంటాయి. అలాగే, తొమ్మిదో తరగతిలో ప్రవేశాలకు అభ్యర్థుల వయస్సు 13 నుంచి 15 ఏళ్లు మధ్య ఉండాలి. ఎనిమిదో తరగతి పాసై ఉండాలి.
- దరఖాస్తు రుసుం: జనరల్/రక్షణ రంగంలో పనిచేస్తున్నవారి పిల్లలు, ఓబీసీలు (నాన్ క్రిమీలేయర్), ఎక్స్ సర్వీస్‌మెన్ పిల్లలకు రూ.800; ఎస్సీ/ఎస్టీలకు రూ.650ల చొప్పున నిర్ణయించారు.
- దరఖాస్తు రుసుం చెల్లింపునకు తుది గడువు జనవరి 14 రాత్రి 11.50గంటల వరకు ఉంది.
- పరీక్ష సమయం: ఆరో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంల నుంచి సాయంత్రం 4.40గంటలవరకు) 150నిమిషాలు; తొమ్మిదో తరగతి విద్యార్థులకు (మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటలవరకు) 180 నిమిషాల చొప్పున ఉంటుంది.
-
ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా..: లాంగ్వేజ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 150 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ నాలెడ్జ్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 125 ప్రశ్నలకు 300 మార్కులకు పరీక్ష ఉంటుంది.
-
ఆరోతరగతికి సబ్జెక్టుల వారీగా మార్కులు ఇలా..: మ్యాథమెటిక్స్ 50 ప్రశ్నలకు 200 మార్కులు; ఇంటెలిజెన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; ఇంగ్లిష్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; జనరల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు; సోషల్ సైన్స్ 25 ప్రశ్నలకు 50 మార్కులు చొప్పున మొత్తంగా 150 ప్రశ్నలకు 400 మార్కులకు పరీక్ష ఉంటుంది.
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలివే.. అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం; తెలంగాణలో హైదరాబాద్, కరీంనగర్
- తెలుగు రాష్ట్రాల్లో సైనిక పాఠశాలలు ఎక్కడెక్కడ ఉన్నాయి? పరీక్షా విధానం, సిలబస్, రిజర్వేషన్ తదితర సమగ్ర సమాచారం ఈ బుక్‌లెట్‌లో పొందొచ్చు.