Mistakes in Exams Preparation| పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారా? ఈ 6 పొరపాట్లు అస్సలు చేయొద్దు!

Mistakes in Exams Preparation| పరీక్షలకు ప్రిపేర్‌ అవుతున్నారా? ఈ 6 పొరపాట్లు అస్సలు చేయొద్దు!

పోటీ పరీక్షలైనా, వార్షిక పరీక్షలైనా.. రాణించాలంటే తగిన ప్రణాళిక అవసరం. ముందు నుంచే ఒక షెడ్యూల్‌ ప్రకారం చదివితే ర్యాంకులు సాధించడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌లో ఈ ఆరు పొరపాట్లకు దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Published :21 Sep 2024 17:05 IST

Exams Preparation| ఇంటర్నెట్‌ డెస్క్‌: రాబోయేదంతా పరీక్షల సీజనే. ఇప్పటికే జేఈఈ మెయిన్‌, సీబీఎస్‌ఈ (CBSE) 10, 12వ తరగతి పరీక్షలకు షెడ్యూల్స్‌ వచ్చేశాయి. అందువల్ల ఇప్పటినుంచే సరైన ప్రణాళిక (Study Plan) వేసుకుంటే తప్ప మంచి స్కోరుతో రాణించడం కష్టం. తగిన ప్రణాళికను రూపొందించుకుంటే మెరుగైన ఫలితాలు సాధించవచ్చంటున్నారు నిపుణులు. ప్రిపరేషన్‌ (Preparation) సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్లను సరిదిద్దుకుంటే విజయం సులభమేనని చెబుతున్నారు. ఇంతకీ ప్రిపరేషన్‌ టైంలో చేయకూడని పొరపాట్లేంటో చూద్దామా! (Mistakes in Preparation)

వాయిదా పద్ధతి..

ఆలస్యం అమృతం విషం అంటారు పెద్దలు. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అందుకు వెంటనే కార్యాచరణ ఆరంభించాలి. కానీ, రేపట్నుంచి మొదలుపెడదాం.. ఏమవుతుందిలే? అనే నిర్లక్ష్య ధోరణితో చాలా మంది వాయిదా పద్దతులు అనుసరిస్తుంటారు. ఇది ఎక్కువమంది సాధారణంగా చేసే పొరపాటు. అందువల్ల, మీరు ఇప్పటినుంచే తగిన టైం టేబుల్‌ సిద్ధం చేసుకొండి. వాస్తవిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రిపేర్‌ అవ్వండి. మీ స్టడీ ప్లాన్‌కు కట్టుబడి ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోండి.

సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షల డేట్‌ షీట్స్‌ ఇవిగో!

రివిజన్‌, ప్రాక్టీస్‌ చేయకపోవడం 

ప్రిపరేషన్‌లో రివిజన్‌, ప్రాక్టీస్‌ ఎంతో కీలకమైన ప్రక్రియలు. గతంలో చదివిన పాఠ్యాంశాలను తిరిగి మననం చేసుకోవడం ద్వారా అవి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఆ సబ్జెక్టులపై తిరుగులేని ఆధిపత్యం ఏర్పడుతుంది. అందువల్ల, చదివిన సబ్జెక్టుల్ని పునశ్చరణ చేసుకోవడం, ప్రాక్టీస్‌ చేయడం మరిచిపోవద్దు. 

స్టడీ మెటీరియల్స్‌పైనే ఆధారపడటం..

చాలా మంది విద్యార్థులు పరీక్షలకు కొద్ది రోజుల ముందే ప్రిపరేషన్‌ మొదలు పెడుతుంటారు. అందుకోసం పూర్తిగా స్టడీ మెటీరియల్స్‌పైనే ఆధారపడి చదువుతుంటారు. ఇది చాలా తప్పు పద్ధతి. మనం చదివే పుస్తకమేదైనా మనలో ఒక ప్రత్యేకమైన దృక్పథాన్ని ఏర్పరచడమే కాకుండా జ్ఞానాన్ని పెంచుతుంది. ఆయా విషయాలపై సమగ్ర అవగాహన కల్పిస్తుంది. పాఠ్యపుస్తకాలను చదవడంతో పాటు ఆన్‌లైన్‌లో వున్న వనరులను అన్వేషించి అధ్యయనం చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. 

పుస్తకం పట్టుకోగానే నిద్ర ముంచుకొస్తోందా? 10 చిట్కాలు ఇవిగో!

బట్టీ పట్టి చదవడం

చదివే అంశాలను అవగాహన చేసుకోకుండా కంఠస్థం చేయడం సాధారణంగా చాలా మంది చేసే తప్పిదం.  సమాచారాన్ని బట్టీ పట్టడం స్వల్ప కాలంలో మీకు సహాయపడొచ్చు.. కానీ, ఏ విషయంపైనా లోతైన అవగాహనకు ఇది ఏమాత్రం ఉపయోగపడదు. అంతర్లీన భావనలను అర్థం చేసుకోవడంపై దృష్టిసారించండి. అలాంటప్పుడే మెరుగైన ఫలితాలు సాధిస్తారు. 

కొన్ని చాప్టర్లపై నిర్లక్ష్యం.. 

విద్యార్థులు తమ ప్రిపరేషన్‌లో కొన్ని సబ్జెక్టులు/చాప్టర్లను వదిలేసి మార్కుల కోసం కొన్నింటిపైనే దృష్టిపెడతారు. ఈ రకమైన నిర్లక్ష్య ధోరణితో చేటు తప్పదు. ప్రతి సబ్జెక్టూ పరీక్షలో అత్యంత కీలకమే. ఒక్క అంశాన్ని నిర్లక్ష్యం చేసినా అది మీ పూర్తి స్కోరుపై ప్రభావం చూపుతుందని మరిచిపోవద్దు. 

ఆరోగ్యాన్ని లెక్కచేయకపోవడం..

ప్రిపరేషన్‌ సమయంలో కొందరు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. శారీరక, మానసిక దృఢత్వమే పరీక్షలో మీ పెర్ఫామెన్స్‌పై ప్రభావం చూపిస్తుంది. నిద్రలేమి, సరైన ఆహారం తీసుకోకపోవడం, తగిన వ్యాయామం చేయకపోవడం వంటివి మీ ఏకాగ్రత, జ్ఞాపకశక్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి.