గేట్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. 2007 నుంచి ప్రశ్నపత్రాలు ఇవిగో!

గేట్ దరఖాస్తుల గడువు పొడిగింపు.. 2007 నుంచి ప్రశ్నపత్రాలు ఇవిగో!

గేట్‌ 2025 పరీక్షకు దరఖాస్తుల గడువును ఐఐటీ రూర్కీ పొడిగించింది. ఆసక్తి కలిగిన వారు అక్టోబర్‌ 3వరకు ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు.

Published :25 Sep 2024 15:19 IST

GATE 2025 Applications | రూర్కీ: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్‌, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌ (GATE 2025) పరీక్షకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఆగస్టు 24న మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్‌ 26తో ముగియగా.. దాన్ని అక్టోబర్‌ 3వరకు పొడిగించినట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అక్టోబర్‌ 3వ తేదీ వరకు ఆలస్య రుసుం లేకుండా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించింది. ఆలస్య రుసుంతో అక్టోబర్‌ 7వరకు అప్లై చేసుకొనేందుకు ఐఐటీ రూర్కీ అవకాశం కల్పించింది. దరఖాస్తు కోసం మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే.. ₹900, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.1800 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 2న అడ్మిట్‌ కార్డులను విడుదల చేయనున్నారు. తాజాగా అభ్యర్థుల కోసం 2007 నుంచి 2024వరకు పలు సబ్జెక్టుల పాత ప్రశ్నపత్రాలను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.  

పాత ప్రశ్నపత్రాల కోసం క్లిక్‌ చేయండి

వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగనుంది. మొత్తం 30 సబ్జెక్ట్‌లకు నిర్వహించే ఈ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష (CBT) మూడు గంటల పాటు జరగనుంది. తప్పు సమాధానానికి నెగెటివ్‌ మార్కులు ఉంటాయి. మార్చి 19న ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్‌ కార్డులను అందుబాటులో ఉంచుతారు. అసాధారణ పరిస్థితులు ఏమైనా ఎదురైతే.. ఈ తేదీలు మారే అవకాశం ఉన్నట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది. GATE 2025 Exams సమాచార బ్రోచర్‌ కోసం క్లిక్‌ చేయండి

స్టడీ స్కిల్స్‌ని పెంచే 7 అలవాట్లు ఇవే.. మీరూ ట్రై చేసి చూడండి!

గేట్‌ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్‌ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ (బీఏ, బీకాం, బీఎస్‌సీ)  పోటీ పడవచ్చు. ఐఐటీలు గేట్‌ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి.