Work Life balance | ఇంటికి - ఆఫీసుకు మధ్య నలిగిపోతున్నారా? ఇలా ట్రై చేసి చూడండి!
ఓ వైపు ఇంటి వ్యవహారాలు, ఇంకోవైపు ఆఫీస్ పనులు.. వీటిని సమన్వయం చేసుకోవడం మహిళలకు పెను సవాల్. ఈ నేపథ్యంలో వర్క్-లైఫ్‌ని బ్యాలెన్స్ చేసుకొనేలా కొన్ని చక్కటి మార్గాలివే..
Published :25 August 2024 20:20 IST
https://results.eenadu.net/news.aspx?newsid=25082024
Work- Life balance| ఇంటర్నెట్ డెస్క్: అటు కుటుంబ బాధ్యతలు.. ఇటు ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు.. ఈ రెంటినీ సమన్వయం చేసుకోవడం మహిళలకు పెను సవాల్‌గా మారింది. సరళమైన పని విధానాలు కొరవడటంతో ఇంటి పని, ఆఫీసు పని మధ్య వారు నలిగిపోతున్నారని.. తిరిగి ఉద్యోగంలోకి ప్రవేశించాలనే ఆలోచనకు ఈ అంశమే ప్రధాన అడ్డంకి అని నౌక్రీ.కామ్ నివేదిక తాజాగా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మహిళల వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలను బ్యాలెన్స్ చేసుకొనేలా ఉన్న కొన్ని మార్గాలను పరిశీలిస్తే..
పక్కా ప్లాన్‌తో పదండి
జీవితమంటేనే కష్ట సుఖాల మేళవింపు. జీవితంలో సమస్యలను ధైర్యంగా ఎదురొడ్డితేనే విజయ తీరాలకు చేరుకోగలం. అంతేగానీ, బాధలు వచ్చాయని నిట్టూరుస్తూ కూర్చుంటే కెరీర్‌లో రాణించలేం. అందువల్ల, ఏ సమస్య వచ్చినా.. ధైర్యంగా పరిష్కరించుకోగలిగే నేర్పు, ఓర్పు అలవరచుకోండి. ఇంటి పనైనా, ఆఫీస్ వర్కయినా సమయానికి పూర్తి కావాలంటే ముందుగా ప్రాథమ్యాలను నిర్ణయించుకోవడం అవసరం. ఇందుకోసం ఆ రోజు చేయాల్సిన పనులేంటి? వాటిలో అత్యంత ప్రాధాన్యమున్నవేంటి? ఇలా ఓ జాబితా తయారుచేసుకోవాలి. ఇలాంటి పక్కా ప్రణాళిక ఆఫీస్ పనులకే కాదు.. ఇంటి పనులకూ వర్తింపజేసుకోండి.
ఎంత బిజీ అయినా.. కాసేపు విరామం అవసరం
నిరంతరాయంగా పని చేస్తుంటే తీవ్ర ఒత్తిడి ఎదురవుతుంది. తద్వారా ఆపై అటు ఆఫీస్ పని, ఇటు ఇంటి పనిపై దృష్టి పెట్టలేరు. ఫలితంగా దాని ప్రభావం చివరికి వర్క్-లైఫ్ బ్యాలన్స్ పైనే పడుతుంది. అందువల్ల ఏ పనైనా, ఎంత బిజీగా ఉన్నా నిర్ణీత వ్యవధుల్లో కొద్దిసేపు విరామం తీసుకోవడం మంచిది. దానివల్ల మనసు తిరిగి ఉత్తేజితమవుతుంది. అలాగని కాఫీ/టీలు తెగ తాగేయడం వల్ల ఆరోగ్యానికే నష్టం. కాబట్టి ఈ క్రమంలో పని ప్రదేశాన్ని వదిలి కాసేపు నడవడం, మీకు నచ్చిన వారితో ఫోన్లో మాట్లాడడం, ఉన్న చోటే మెడిటేషన్ చేయడం, ఆహ్లాదకరంగా ఉండే మొక్కలు లేదా బొమ్మల్ని చూడడం వంటివి ట్రై చేయొచ్చు. ఎంతైనా.. మనసుకు ఒత్తిడిగా అనిపించినప్పుడు నచ్చిన పని చేస్తే ఆ ఆనందమే వేరు. ఇలా ఎప్పటికప్పుడు మనసును ప్రశాంతపరచుకుంటే చాలు.. ఏ పనైనా చకచకా పూర్తి చేసేసుకోవచ్చు.
వర్క్-లైఫ్ బ్యాలెన్స్‌కు 8-8-8 రూల్.. మీరూ ట్రై చేస్తారా?
కలిసి పంచుకోకపోతే ఎలా?
‘సంపాదిస్తోంది కాకుండా ఇంటి పనులన్నీ నేనే చేయాలా?’ అంటూ పని ఒత్తిడితో అప్పుడప్పుడూ విసుక్కోవడం చాలామందికి అలవాటే! నిజానికి అన్ని పనులు మనమే చేసుకోవాలంటే రోజులో ఉన్న 24 గంటలు సరిపోదు. అలాగని విశ్రాంతి లేకుండా పనిచేయడం ఎవ్వరి వల్లా కాదు. కాబట్టి ఇంటిని-పనిని బ్యాలన్స్ చేసుకోవాలంటే ఇంటి పనుల్లో ఇల్లాలితో పాటు కుటుంబ సభ్యులు కూడా భాగం కావాలి. కూరగాయలు కట్ చేయడం, వంట చేయడం వంటివి పనులను భార్యాభర్తలిద్దరూ కలిసి పంచుకున్నా; బట్టలు ఆరేయడం, వాటిని మడతపెట్టడం, ఇల్లు ఊడవడం.. వంటి చిన్న చిన్న పనుల్లో పిల్లల్నీ భాగస్వాముల్ని చేయండి. ఇలా చేయడం వల్ల పని భారం తగ్గడంతో పాటు పిల్లలకూ పని అలవాటవుతుంది కదా. తద్వారా మీరు అలసిపోకుండా వృత్తిలోనూ మెరుగ్గా రాణించే అవకాశం ఉంటుంది
ఆరోగ్యంతో ‘బ్యాలన్స్’!
ఇటు ఇంటి పని చేయాలంటే శరీరం సహకరించాలి.. అటు ఆఫీస్ పనులు పూర్తి చేయాలంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. ఈ రెండూ సాధ్యం కావాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. ఇందుకోసం తీసుకునే ఆహారం, చేసే వర్కవుట్స్ ఎంతో కీలకం. చాలామంది మహిళలు బిజీ బిజీ అంటూ తమ కోసం కాస్త సమయమైనా కేటాయించుకోలేరు.. ఆహారం విషయంలోనూ శ్రద్ధ వహించరు. వేళకు భోజనం చేయరు. తద్వారా అనారోగ్యానికి గురవుతుంటారు.
ఒత్తిడిని చిత్తు చేసే ‘ఆర్ ఆర్ ఆర్’ మంత్ర!
- వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలున్నా.. వాటిని ఆఫీసుకి మోసుకురావొద్దు. ఆఫీసులో ప్రశాంతమైన మనసుతో అడుగు పెట్టడం అలవాటు చేసుకుంటే కెరీర్‌కు అదో సక్సెస్ మంత్రం కాగలదు. వ్యక్తిగత సమస్యలు ఎదురైనప్పుడు కోపం సహజమే.. కానీ దీన్ని నియంత్రించుకోకపోతే కెరీర్‌కు ముప్పే. మీ కోపాన్ని సహోద్యోగులపై చూపిస్తే ఆ ప్రభావం మీ ఉద్యోగంపైనే పడుతుందని మరిచిపోవద్దు.
- ఏదైనా పని మొదలుపెట్టేటప్పుడు వెన్నుతట్టి ప్రోత్సహించేవారి కన్నా.. నిరుత్సాహానికి గురి చేసేవారే మనకు ఎక్కువగా తారసపడుతుంటారు. అందువల్ల మీ వ్యక్తిగత విషయాలను మీ మనస్సుకు దగ్గరగా ఉండే సహోద్యోగులతో తప్ప వేరేవాళ్లందరికీ షేర్ చేయకపోవడమే ఉత్తమం. మీ విషయాలు తెలిసి ఎవరైనా హేళన చేసినా వారితో గొడవపడకుండా ఉండటమే మేలు. తద్వారా మీ వ్యక్తిత్వం మరింతగా పెరగడంతో పాటు కొన్నాళ్లకు వారే మీ దారికి వచ్చే అవకాశం ఉంటుంది.
- ఒక్కోసారి బాస్ మీకు ఇచ్చిన వర్క్ నచ్చకపోయినా, లేదా సరైన సమయంలో పూర్తికాకపోయినా ఒత్తిడికి గురికావడం సహజమే. దీనికి అప్పుడప్పుడు వ్యక్తిగత సమస్యలూ తోడవుతుంటాయి. అలాంటప్పుడు చిరాకు, అసహనం వంటివి కలిగితే పనిపై శ్రద్ధ పెట్టలేం. అందువల్ల ఓర్పుగా ఉండటం అలవాటు చేసుకోవాలి.
- ఎప్పటికప్పుడు ఎదురయ్యే సమస్యలకు వెంటనే మనకు పరిష్కారాలు తట్టవు. అలాంటప్పుడు మీకు సన్నిహితంగా ఉండే స్నేహితులు, కలీగ్స్‌ను సలహా అడగండి. మీ సమస్య పరిష్కారానికి వాళ్లిచ్చే సలహాలూ ట్రై చేయండి.
- మీరు పని చేసే చోట తోటి వారితో కలుపుగోలుగా ఉండడం అలవాటు చేసుకోండి. ఆఫీసులో ఉన్నంతసేపు సహోద్యోగులతో కలిసిపోయి కాసేపు ఆనందంగా నవ్వుతూ ఎంజాయ్ చేసే వాతావరణాన్ని ఏర్పరచుకోండి. దీంతో సమస్యలన్నీ మరిచిపోయి సులభంగా పనిపై దృష్టి సారించొచ్చు.
- సమస్యల ఒత్తిడి తగ్గాలన్నా, పనిమీద ఏకాగ్రత పెరగాలన్నా.. ఈ రెండింటికీ క్రమం తప్పకుండా యోగా, వ్యాయామం చేయడమే పరిష్కారం. ఇది మనసుకు ఉత్తేజాన్నిస్తుంది.