8-8-8 Rule | వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు 8-8-8 రూల్‌.. మీరూ ట్రై చేస్తారా?

8-8-8 Rule: వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు 8-8-8 రూల్‌.. మీరూ ట్రై చేస్తారా?

రోజులో అందరికీ ఉండేది ఇరవై నాలుగు గంటలే. ఆ సమయాన్ని ఎలా వినియోగించుకున్నామన్నదే ముఖ్యం.

Published : 18 June 2024 22:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రోజులు గంటల్లా కరిగిపోతున్నాయ్‌.. విలువైన సమయం వృథా కాకుండా..  టైం మేనేజ్‌మెంట్‌ ఎంతో అవసరం. ఈ సాంకేతిక యుగంలో వర్క్‌ కల్చర్‌లో వస్తున్న మార్పుల నేపథ్యంలో  ఉన్న కొద్దిపాటి సమయంలోనే వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమతుల్యం చేసుకోవడం పెద్ద సవాలే. ఏకకాలంలో అనేక పనులు చేయాల్సి రావడంతో ఒత్తిడిని జయించి శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే ఈ 8-8-8 రూల్‌ గురించి తెలుసుకుందాం..

ఏమిటీ 8-8-8 రూల్‌?

విలువైన సమయాన్ని ఎంత సమర్థంగా ఉపయోగించుకోవచ్చో తెలిపే టైం మేనేజ్‌మెంట్‌ పద్ధతి ఇది. వృత్తి, వ్యక్తిగతమైన జీవితాలను సమతుల్యం చేసుకొనేందుకు ఇదో మంచి ఆయుధం లాంటిదని చెప్పొచ్చు. దీని ప్రకారం.. ఒక రోజులో ఉండే 24 గంటల్ని ఎనిమిది గంటల చొప్పున విభజించుకోవాలి. 8 గంటలను ఉద్యోగానికి వినియోగిస్తే.. మరో 8గంటలను మీ అలవాట్లు, కుటుంబ సభ్యులు, మిత్రులతో ఆనందంగా గడపేందుకు; మిగతా ఎనిమిది గంటల్ని నాణ్యమైన నిద్ర కోసం కేటాయించడం ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు మీ లక్ష్యాలను సులువుగా చేరుకొనేందుకు ఇదో సాధనంగా ఉపయోగపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. 

లాభాలేంటి?

ఈ 8-8-8  రూల్‌  అందరికీ ఒకేలా నప్పకపోవచ్చు. ఎవరి అవసరాలను బట్టి వారు తమకున్న సమయాన్ని చిన్న చిన్నభాగాలుగా విభజించుకొని చక్కని ప్రణాళిక వేసుకొని క్రశిక్షణగా ఆచరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మీ జీవన శైలిని ఆరోగ్యంగా, సంతృప్తికరంగా మలచుకొనేందుకు ఇదో చక్కని సాధనంగా ఉపయోగపడుతుంది. మీ పనుల్ని భాగాలుగా విడగొట్టడం ద్వారా చేసే పనిపట్ల ఫోకస్ పెరుగుతుంది. ఈ రూల్‌ని దైనందిన జీవితంలో ఒక అలవాటుగా మార్చుకుంటే.. ముఖ్యమైన పనులేవీ నిర్లక్ష్యం కాకుండా ఉంటాయి. అలాగే, దీర్ఘకాలంలో మరిన్ని సత్ఫలితాలూ సాధించవచ్చు.  కుటుంబం/మీ అభిరుచులకు కేటాయించే సమయాన్ని పెంచుకోవచ్చు. సంగీతం, పుస్తక పఠనం వంటి అలవాట్లతో మీ ఊహాశక్తి పెరగడంతో పాటు కొత్త ఆలోచనలతో నిత్యనూతనంగా జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు.  మీ సమయాన్ని బ్రేక్‌ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు విశ్రాంతి లభించడంతో ఫ్రెష్‌గా ఉంటారు. పనిలోనూ సృజనాత్మకతో కూడిన పరిష్కారాలు కనుగొనడం ద్వారా కెరీర్‌లో రాణించవచ్చు. తగినంత నిద్రతో శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళన, నిరాశ వంటివి తగ్గి శరీరంలో సహజ ప్రక్రియలు మెరుగవుతాయని పలు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. 

అడ్డంకులూ ఉన్నాయ్‌.. కానీ!

ఈ రూల్‌ని జీవితంలో అమలుచేయడం అంత తేలిక కాదు. ప్రతిరోజునీ కచ్చితంగా 8గంటల చొప్పున షెడ్యూల్‌ని రూపొందించుకొని దినచర్యను అమలు చేయాలంటే అనేక రకాల అడ్డంకులు ఎదురవుతుంటాయి. వాతావరణంలో మార్పులు, ఏవైనా శబ్దాలు ఒక్కోసారి నాణ్యమైన నిద్రకు భంగం కలిగించవచ్చు. దీనికితోడు సహచరులు, కుటుంబ సభ్యులు, ఆఫీస్‌లో బాస్ నుంచి ఏదోఒక రూపంలో ఎదురయ్యే ఒత్తిళ్లతో ఈ సమతుల్యత కొనసాగించడం కష్టమవుతుంది. కాకపోతే, సరైన ప్రణాళిక వేసుకొని అంకితభావంతో ఈ రూల్‌ పాటించేందుకు  కృషి చేస్తే.. జీవితంలోని అనేక రంగాల్లో గొప్ప విజయాలు సాధించవచ్చు.