Stress Management Tips ఒత్తిడిని చిత్తు చేసే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మంత్ర!

Stress Management Tips ఒత్తిడిని చిత్తు చేసే ‘ఆర్‌ ఆర్‌ ఆర్‌’ మంత్ర!

నిర్దేశిత డెడ్‌లైన్‌లో పని పూర్తి చేసే క్రమంలో కొందరు విపరీతమైన ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటివారికి ట్రిపుల్‌ ఆర్‌ మంత్రం బాగా ఉపయోగపడుతుందని సూచిస్తున్నారు నిపుణులు.

Published :13 July 2024 07:00 IST

పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులైనా.. పనిలో నిమగ్నమయ్యే ఉద్యోగులైనా విధి నిర్వహణలో చేయాల్సిన పనులు చాలానే ఉంటాయి కదా! వీలు చూసుకుని మెల్లగా ఒకదాని తర్వాత మరోటి చూద్దాంలే అంటే కుదరదు. నిర్ణీత  సమయం లోపలే అన్నింటినీ పూర్తిచేయాల్సి వుంటుంది. దీంతో కొందరు ఒత్తిడికి గురై శారీరకంగా, మానసికంగా అలసిపోతుంటారు. దీన్నే బర్న్‌ అవుట్‌ అంటారు. దీన్నుంచి బయటపడాలంటే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ మంత్రాన్ని పాటిస్తే మేలని సూచిస్తున్నారు ఆరోగ్య రంగ నిపుణులు.

వివిధ స్థాయిల్లో ఎదురయ్యే ఒత్తిడిని నియంత్రించడానికి ఈ ‘ట్రిపుల్‌ ఆర్‌’ మంత్రం ఉపయోగపడుతుంది. నిజానికి ఒత్తిడి అనేది.. ఒక స్థాయి వరకూ మంచి ఫలితాలనే ఇస్తుంది. ఒక మోస్తరు ఒత్తిడి వల్ల మీ పనుల్ని సకాలంలో పూర్తిచేయగలుగుతారు కూడా. కానీ విపరీతమైన ఒత్తిడికి గురికావడం వల్ల బర్న్‌అవుట్‌ అయ్యి నష్టపోయే సందర్భాలూ ఉంటాయి. రబ్బర్‌ బ్యాండ్‌ను రెండు వైపులా పట్టుకుని సాగదీశారు అనుకుందాం. ఒక దశ వరకూ బానే ఉన్నా.. ఆ తర్వాత అది తెగిపోయి.. చేతికి చురుక్కుమని తగులుతుంది. విపరీతమైన ఒత్తిడి వల్ల ఇలాగే బర్న్‌అవుట్‌కు గురికావాల్సి వస్తుంది. ‘3 ఆర్‌’ పద్ధతిని ఉపయోగించడం వల్ల ప్రతి దశలోనూ ఒత్తిడిని నియంత్రించవచ్చు. అవేంటో చూద్దామా!

ఈ కంపెనీల్లో ఉద్యోగం వస్తే జాక్‌పాట్‌ తగిలినట్లే!

రికగ్నైజ్‌ (గుర్తించటం)

ఏయే సందర్భాల్లో విపరీతమైన మీరు ఒత్తిడికి గురవుతున్నారో గుర్తించండి. దీంతో పాటు దేనివల్ల ప్రేరేపితమైన ఒత్తిడికి గురవుతున్నారనే కారణాన్నీ కనుక్కోవడానికి ప్రయత్నించాలి. అసలు కారణాన్ని కనుక్కుంటే ఇబ్బంది నుంచి త్వరగా బయటపడొచ్చు. ఈ సందర్భంలో శ్వాస వ్యాయామాలను సాధన చేయడం వల్ల ఫలితం ఉంటుంది. దీర్ఘంగా గాలి పీల్చుకుని.. దాన్ని కాసేపు అలాగే నిలిపివుంచి.. కొన్ని నిమిషాల తర్వాత మెల్లగా బయటకు వదిలేయాలి. కొంతకాలంపాటు ఈ పద్ధతిని పాటించడం వల్ల పరిస్థితిలో వచ్చే మార్పును మీరే స్వయంగా అనుభూతి చెందుతారు.

రివర్స్‌ (వెనక్కి తిప్పటం)

ఏ సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో గుర్తిస్తే.. ఇబ్బంది నుంచి బయటపడే మార్గాలను అన్వేషించగలుగుతారు. కానీ ఇలా వీలుకానప్పుడు మరో విధంగానూ ప్రయత్నించవచ్చు. ఒత్తిడిని ఎదుర్కొనే సందర్భాల్లో.. సాధారణంగా నిరవధికంగా ఆలోచనలు వస్తుంటాయి కదా. అందువల్ల ముందుగా ఆ ఆలోచనల్ని నిరోధించాలి. అంటే ఒత్తిడి రాకముందే దాన్ని అధిగమించడానికి మీ వంతుగా ప్రయత్నాలను ప్రారంభించాలన్న మాట.

ఉదాహరణకు.. ఒక ప్రాజెక్టు నిర్దేశించిన టైంలో చేయలేమోనని/ఒక సబ్జెక్టులో మంచి మార్కులు సాధించలేమోననే ఆలోచనలు పదేపదే వస్తున్నాయనుకుందాం. వీటిని నిరోధించడానికి అదే ప్రాజెక్టు లేదా సబ్జెక్టుపై పట్టుసాధించాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలనే దిశగా ఆలోచించడం మొదలు పెట్టాలి. విద్యార్థులైతే తమ అధ్యాపకుల్ని అడిగి సందేహాలను నివృత్తి చేసుకోవాలా.. ట్యూషన్‌కు వెళ్లాలా.. లేదా స్నేహితుల సహాయం తీసుకోవడం వల్ల ఏమైనా ప్రయోజనం ఉంటుందా.. ఇలా వివిధ కోణాల్లో ఆలోచించడం మొదలుపెట్టాలి. ఇక్కడో విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమస్య గురించి పదేపదే ఆలోచించడం వల్ల ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఒక్కసారి పరిష్కార మార్గాల దిశగా ఆలోచించడం మొదలుపెడితే సమస్య తీవ్రత తగ్గుతుంది.

చదవడానికి టైం చాలట్లేదా? ఇలా ట్రైచేసి చూడండి!

రెసీలియెన్స్‌ (పూర్వస్థితికి రావటం)

ఒత్తిడిని కలిగించే సందర్భాల్లో చిక్కుకున్నప్పుడు.. యథాస్థితికి రావడానికి ప్రయత్నించగలగాలి. ఎంత త్వరగా, తేలిగ్గా ఒత్తిడి నుంచి బయటపడాలనేది ముఖ్యం కాదు. కానీ దాన్ని నివారించి పూర్వపు స్థితికి రావడమే ప్రధానం. ఎందువల్ల ఒత్తిడి కలుగుతుందో ధ్రువీకరించుకోవడం, దాని గురించి అవగాహన పెంచుకోవడం, శ్వాస వ్యాయామాలు చేయడం.. ఇవన్నీ పూర్వపు స్థితికి తీసుకొస్తాయి. ఒత్తిడికి గురైన సందర్భాల్లో ఈ సాధనాలను ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

మరికొన్ని సూచనలు

  • ఇతరులు ఏయే సందర్భాల్లో ఒత్తిడికి గురవుతున్నారో వివరంగా తెలుసుకునే ప్రయత్నాలు చేయకూడదు. ఇలాచేస్తే అలాంటి సందర్భాల్లో మీరు కూడా ఒత్తిడికి గురయ్యే అవకాశం లేకపోలేదు.
  • చుట్టుపక్కల ఎప్పుడూ సానుకూల ఆలోచనలు చేసే వ్యక్తులు ఉండేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడికి దూరంగా.. మానసిక ప్రశాంతతకు దగ్గరగా ఉండగలుగుతారు.