గూగుల్ సువర్ణావకాశం.. ఇకపై ‘జెమిని’లో జేఈఈ మెయిన్ ఉచిత మాక్ టెస్టులు
Google Gemini JEE Main free Mock tests | ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు రాసే అభ్యర్థులకు గూగుల్ (Google) అద్భుతమైన అవకాశం కల్పించింది.
By Education News Team
Updated :29 Jan 2026 18:09 IST
https://results.eenadu.net/education-news/Google-Gemini-Offers-Free-Full-Length-JEE-Main-Mock-Tests
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2026) పరీక్షలు రాసే అభ్యర్థులకు గూగుల్ (Google) అద్భుతమైన అవకాశం కల్పించింది. తన ఏఐ ప్లాట్‌ఫాం ‘జెమిని’లో జేఈఈ మెయిన్ పరీక్షకు సంబంధించిన పూర్తిస్థాయిలో ఉచిత మాక్ టెస్టులను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇటీవల అమెరికాలో శాట్ (SAT) పరీక్షల ప్రాక్టీస్ టెస్టులను అందుబాటులోకి తీసుకొచ్చిన గూగుల్.. తాజాగా భారత్‌లో జేఈఈ మెయిన్ అభ్యర్థులకు మాక్ టెస్టులను అందిస్తుండటం విశేషం. ఐఐటీలు/ఎన్‌ఐటీలు వంటి ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ పరీక్ష ఎంతో కఠినంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.
అయితే, ఈ పరీక్ష రాసే అభ్యర్థుల ప్రిపరేషన్‌ను మరింత సులభతరం చేసేలా కెరీర్స్ 360, ఫిజిక్స్‌వాలాతో కలిసి ఈ అద్భుతమైన ఫీచర్‌ని గూగుల్ తీసుకొచ్చింది. ఈ సదుపాయాన్ని అభ్యర్థులకు ఉచితంగా తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తమవుతోంది. గూగుల్ జెమినిలో ఈ ఉచిత మాక్ టెస్టులు ఎలా రాయాలనే అంశంపై రూపొందించిన డెమో వీడియోను గూగుల్ ల్యాబ్స్ ఉపాధ్యక్షుడు జోష్ వుడ్వార్డ్ పోస్టు చేశారు. పూర్తి స్థాయిలో మాక్‌టెస్టులు కావాలంటూ భారత విద్యార్థుల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన విజ్ఞప్తుల మేరకే ఈ ఉచిత ఫీచర్‌ని తీసుకొచ్చినట్లుగా ఆయన పేర్కొన్నారు.
మాక్ టెస్టులు ఎలా రాయాలి?(Video)
ఈ డెమో వీడియోలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టులతో కూడిన ఈ మాక్ టెస్టులు ఎలా రాయాలో విద్యార్థులు తెలుసుకోవచ్చు. అలాగే, ఏయే సబ్జెక్టులో ఎంత స్కోరు చేశారు? ఎక్కడ వెనకబడి ఉన్నారో తెలుసుకొని తద్వారా తమ తదుపరి ప్రిపరేషన్‌ను కొనసాగించడం ద్వారా విద్యార్థులు విజయం సాధించవచ్చు. ఈ ఏడాది జేఈఈ మెయిన్ సెషన్ 1 పరీక్షలు ముగిసినప్పటికీ.. ఏప్రిల్‌లో జరగనున్న జేఈఈ మెయిన్ సెషన్-2 పరీక్షకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ ఫీచర్ ఎంతో ప్రయోజనకరం కానుంది.