JEE Main 2026 | ముగిసిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ, ఫలితాలు ఎప్పుడంటే?

JEE Main 2026 | ముగిసిన జేఈఈ మెయిన్‌ పరీక్షలు.. ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ, ఫలితాలు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌-1 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి.

Eenadu icon
By Education News Team Updated :29 Jan 2026 16:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌-1 పరీక్షలు విజయవంతంగా ముగిశాయి. జనవరి 21న ప్రారంభమైన ఈ పరీక్షలు గురువారం మధ్యాహ్నంతో పూర్తయ్యాయి. జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌-1(బీఈ/బీటెక్‌) పరీక్ష జరగ్గా.. 29న పేపర్‌ 2ఎ (బీఆర్క్‌), పేపర్‌ 2బి (బి.ప్లానింగ్‌) పరీక్షలను ఎన్‌టీఏ (NTA) నిర్వహించిన విషయం తెలిసిందే. నిర్ణీత తేదీల్లో రోజూ రెండు షిఫ్టుల్లో జరిగిన ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా మొత్తంగా  దాదాపు 13.5 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరైనట్లు సమాచారం.

జేఈఈ మెయిన్‌ ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం ఏదీ లేనప్పటికీ గత ట్రెండ్స్‌ని బట్టి చూస్తే.. ఫిబ్రవరి మొదటి వారంలో అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం కనబడుతోంది. గత మూడేళ్ల ట్రెండ్స్‌ని పరిశీలిస్తే.. పరీక్షలు పూర్తయిన ఐదు రోజుల వ్యవధిలోనే ప్రొవిజినల్‌ ఆన్షర్‌ కీ విడుదల చేశారు. దీన్నిబట్టి ఈసారి కూడా అదే తరహాలో జేఈఈ మెయిన్‌ ప్రాథమిక కీ విడుదల చేసి విద్యార్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. పరీక్షల షెడ్యూల్‌లో పేర్కొన్న ప్రకారం ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్‌ ఫలితాలను (JEE Main 2026 Results) విడుదల చేసే అవకాశం ఉంది.