JEE Main 2026 | ముగిసిన మూడో రోజు పరీక్ష.. 21-23 వరకు ఎంతమంది రాశారంటే?

JEE Main 2026 | ముగిసిన మూడో రోజు పరీక్ష.. 21-23 వరకు ఎంతమంది రాశారంటే?

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌ -1 మూడో రోజు పరీక్ష ముగిసింది. ఇప్పటివరకు (జనవరి 21, 22, 23 తేదీలు) షిఫ్టుల వారీగా ఈ పరీక్షలు విజయవంతంగా కొనసాగినట్లు ఎన్‌టీఏ(NTA) అధికారులు వెల్లడించారు.

Eenadu icon
By Education News Team Updated :23 Jan 2026 20:03 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) సెషన్‌ -1 మూడో రోజు పరీక్ష ముగిసింది. ఇప్పటివరకు (జనవరి 21, 22, 23 తేదీలు) షిఫ్టుల వారీగా ఈ పరీక్ష విజయవంతంగా కొనసాగినట్లు ఎన్‌టీఏ(NTA) అధికారులు వెల్లడించారు. దేశ వ్యాప్తంగా జనవరి 21న ప్రారంభమైన జేఈఈ మెయిన్‌ పరీక్షలు 29వ తేదీతో ముగియనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు దాదాపు 14లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నట్లు సమాచారం. అయితే, తొలి మూడు రోజుల్లోని అన్ని షిఫ్టుల్లో కలిపి 8,01,326 మంది విద్యార్థులకు పరీక్షను షెడ్యూల్‌ చేయగా.. వీరిలో 7,70,441 మంది (96.15శాతం) హాజరైనట్లు అధికారులు తెలిపారు. వీరిలో 2,563 మంది దివ్యాంగులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాలు, జిల్లాల అధికారుల నిరంతర సహకారం, అభ్యర్థుల క్రమశిక్షణతో కూడిన భాగస్వామ్యం వల్ల ఈ పరీక్షను సజావుగా నిర్వహించగలుగుతున్నట్లు పేర్కొన్నారు. 

అభ్యర్థులకు కీలక సూచనలివే.. 

  • మీ అడ్మిట్ కార్డ్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో పరీక్ష తేదీ, షిఫ్ట్, సెంటర్, రిపోర్టింగ్ సమయం, గేట్‌ మూసివేసే సమయాన్ని సరిచూసుకోండి. 

  • పరీక్ష కేంద్రానికి ముందుగానే చేరుకోండి. గేట్‌ మూసివేసిన తర్వాత ప్రవేశానికి అనుమతించరు. 
  • మీ వెంట అడ్మిట్‌ కార్డు (A4 ప్రింట్‌), ఒరిజినల్‌ ఫొటో ఐడీ కార్డు, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటో
  • ఆధార్‌ అథెంటికేషన్‌ (Aadhaar authentication)లేని అభ్యర్థులు బయోమెట్రిక్ వెరిఫికేషన్ కోసం ముందుగానే రిపోర్ట్ చేయాలి.
  • ఎలక్ట్రానిక్ పరికరాలు, వాచీలు, బ్యాగులు, పేపర్‌లు, ఆహారం, తాగునీటి బాటిళ్లకు అనుమతిలేదు. మధుమేహం ఉన్న అభ్యర్థులకు అనుమతించిన  కొన్ని వస్తువులు మినహాయింపు ఉంది. 
  • ఈ పరీక్ష కంప్యూటర్‌ ఆధారితంగా ఉంటుంది. సీసీటీవీ నిఘా ఉంటుంది. ఏవైనా అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు.

జేఈఈ మెయిన్‌ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను https://jeemain.nta.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు తలెత్తితే.. jeemain@nta.ac.in లేదా 011-40759000 నంబర్‌ని సంప్రదించవచ్చు.