JEE (Main) Session 2 exam I జేఈఈ (మెయిన్‌) సెషన్‌- 2 దరఖాస్తులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన

JEE (Main) Session 2 exam I జేఈఈ (మెయిన్‌) సెషన్‌- 2 దరఖాస్తులపై ఎన్‌టీఏ కీలక ప్రకటన

జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2 దరఖాస్తులకు (JEE Main 2025 Session 2 Applications) సంబంధించి ఎన్‌టీఏ కీలక ప్రకటన విడుదల చేసింది.

Eenadu icon
By Education News Team Published :24 Feb 2025 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జేఈఈ (మెయిన్‌) సెషన్‌ -2  దరఖాస్తుల (JEE Main 2025 Session 2 Applications)ప్రక్రియ ఫిబ్రవరి 25వరకే కొనసాగుతుందని ఎన్‌టీఏ(NTA) స్పష్టం చేసింది. ఈ గడువును పొడిగించే అవకాశమే లేదని తేల్చి చెప్పింది. నిర్ణీత సమయంలోగా వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థులకు సూచించింది. అలాగే, ఆన్‌లైన్‌ అప్లికేషన్‌ ఫారమ్‌లో సవరణలకు సంబంధించి కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. దరఖాస్తుల్లో వివరాల్ని ఎడిట్‌/మోడిఫై చేసుకొనే అవకాశం కల్పించాలంటూ పెద్ద సంఖ్యలో తమకు విజ్ఞాపనలు వస్తున్నాయని పేర్కొంది. దీంతో విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని జేఈఈ మెయిన్‌ సెషన్‌ 2 దరఖాస్తుల్లో తప్పులను ఫిబ్రవరి 27, 28 తేదీల్లో సరిచేసుకొనే అవకాశం కల్పిస్తున్నట్లు సోమవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపింది.

అభ్యర్థులకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారంలో తప్పులను సరిచేసుకొనేందుకు ఒకసారి మాత్రమే అవకాశం ఉంటుందని, అందువల్ల దీన్ని సద్వినియోగం చేసుకొని జాగ్రత్తగా సవరణలు చేసుకోవాలని అధికారులు సూచించారు.  ఫిబ్రవరి 28 రాత్రి 11.50 గంటలు దాటితే వివరాల్లో మార్పులకు ఎట్టిపరిస్థితుల్లో అనుమతించబోమని ఎన్‌టీఏ తేల్చి చెప్పింది. అయితే, ఇందుకు అదనపు ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారితో పాటు జేఈఈ మెయిన్‌ సెషన్‌ 1 పరీక్ష రాసిన విద్యార్థులూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చని తెలిపింది.

ఇవి మార్చేందుకు  ‘నో’ ఛాన్స్‌

  • ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థి మొబైల్‌ నంబర్‌, ఈ-మెయిల్‌, అడ్రస్‌ (శాశ్వత/ప్రస్తుత), ఎమర్జెన్సీ కాంటాక్టు వివరాలు, అభ్యర్థి ఫొటోను మార్చడానికి అవకాశం లేదని స్పష్టం చేసిన ఎన్‌టీఏ
  • అభ్యర్థి పేరు/తండ్రి పేరు/తల్లి పేర్లలో ఏదో ఒకటి మాత్రమే సవరించేందుకు అవకాశం 
  • పదో తరగతి, 12వ తరగతి సంబంధిత వివరాలు, పాన్‌ కార్డు నంబర్‌, పరీక్ష రాయాలనుకొనే నగరం, మాధ్యమాన్ని మార్చుకొనేందుకు ఛాన్స్‌ 
  • అభ్యర్థి పుట్టిన తేదీ, జెండర్‌, కేటగిరీ, సబ్‌ కేటగిరీ/పీడబ్ల్యూడీ, సంతకం మార్చుకొనేందుకు అవకాశం 

రెండు సెషన్ల విద్యార్థులూ వీటిని మార్చుకొనే ఛాన్స్‌!

  • కోర్సు (పేపర్‌), ప్రశ్నపత్రం మాధ్యమం, స్టేట్‌ కోడ్‌ ఆఫ్ ఎలిజిబిలిటీ, ఎగ్జామ్‌ సిటీ, పదో తరగతి, 12వ తరగతి సంబంధిత విద్యార్హత వివరాలు, జెండర్‌, కేటగిరీ వంటి వివరాలనుమాత్రమే మార్చుకొనేందుకు ఎన్‌టీఏ అవకాశం కల్పిస్తోంది.