IIT Delhi Placements | ఐఐటీ-దిల్లీలో జాబ్‌ జోష్‌.. 1200+ విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు

IIT Delhi Placements | ఐఐటీ-దిల్లీలో జాబ్‌ జోష్‌.. 1200+ విద్యార్థులకు ఉద్యోగ ఆఫర్లు

ఇటీవల క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ప్రఖ్యాత ఐఐటీ దిల్లీ (IIT Delhi)లో ఉద్యోగాల జోష్‌ మొదలైంది.

Eenadu icon
By Education News Team Published :23 Dec 2024 15:53 IST

IIT Delhi Placements| ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల క్యూఎస్‌ వరల్డ్‌ యూనివర్సిటీ ర్యాంకింగ్స్‌లో సత్తా చాటిన ప్రఖ్యాత ఐఐటీ దిల్లీ (IIT Delhi)లో ఉద్యోగాల జోష్‌ మొదలైంది.  ప్రపంచ వ్యాప్తంగా పలు దిగ్గజ కంపెనీలు నిర్వహించిన ప్రాంగణ నియామకాల్లో ఐఐటీ దిల్లీ విద్యార్థులు అదరగొట్టారు. 2024-25 విద్యా సంవత్సరానికి  చేపట్టిన ఉద్యోగ నియామక ప్రక్రియలో ఆరంభంలోనే 1200మందికి పైగా విద్యార్థులు పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు (పీపీవో) అందుకున్నట్లు వర్సిటీ వెల్లడించింది. గూగుల్‌, గోల్డ్‌మెన్‌ సాచ్స్‌, అమెరికన్‌ ఎక్స్‌ప్రెస్‌, బీసీజీ, బ్లూ స్టోన్‌ జ్యువెలరీ అండ్‌ లైఫ్‌స్టైల్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌,  ఇంటెల్‌ ఇండియా, మీషో, మైక్రాన్‌ టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్‌, ఓలా, ఒరాకిల్‌, పీయూ, క్వాల్కమ్‌, షిప్‌రాకెట్‌, ట్రైడెంట్‌ గ్రూప్‌ తదితర ప్రఖ్యాత సంస్థల్లో ఉద్యోగ ఆఫర్లు పొందారని ఓ ప్రకటనలో తెలిపింది. 

ఈ విడతలో విద్యార్థులు జపాన్‌, నెదర్లాండ్స్‌, దక్షిణ కొరియా, తైవాన్‌, యూఏఈ, యూకే,అమెరికాతో పాటు పలు దేశాలకు చెందిన 15కి పైగా ప్రతిష్ఠాత్మక సంస్థల నుంచి 50కి పైగా అంతర్జాతీయ ఆఫర్లను అందుకున్నట్లు ఐఐటీ దిల్లీ పేర్కొంది. విద్యార్థులకు మంచి ఆఫర్లు రావడంపై ఐఐటీ దిల్లీ కెరీర్‌ సర్వీసెస్‌ కార్యాలయం (OCS) ఇంఛార్జి ప్రొఫెసర్‌ నరేష్‌ వర్మ హర్షం వ్యక్తం చేశారు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌లో ఈ ఏడాది ఆరంభం బాగుందని, రాబోయే రోజుల్లోనూ ఇదే ట్రెండ్‌ కొనసాగుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. క్యాంపస్‌ప్లేస్‌మెంట్స్‌కు హాజరయ్యే విద్యార్థుల కోసం కంపెనీల పరిధి, జాబ్‌ ప్రొఫైల్స్‌ విస్తరణపై దృష్టిసారించినట్లు పేర్కొన్నారు. 

అలాగే, ఓసీఎస్‌కు చెందిన మరో అధికారి ప్రొఫెసర్‌ సురేష్‌ నీలకంఠన్‌ మాట్లాడుతూ.. తమ వర్సిటీకి చెందిన విద్యార్థుల ప్రతిభా పాటవాలను గుర్తించినందుకు రిక్రూటర్లకు కృతజ్ఞతలు చెప్పారు. నిరంతరంగా శ్రమించి.. అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ఉద్యోగ ఆఫర్లు పొందిన విద్యార్థులకు ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. ఈ ప్లేస్‌మెంట్స్‌ సీజన్ వచ్చే సెమిస్టర్ ఆఖరి వరకు కొనసాగనుందని.. తమ వర్సిటీలో యూజీ, పీజీ విద్యార్థులకు ప్లేస్‌మెంట్స్‌ కల్పించడంపై ప్రధానంగా దృష్టిసారించినట్లు దిల్లీ ఐఐటీ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే, ఈసారి విద్యార్థులు సాధించిన ఉద్యోగాల వార్షిక ప్యాకేజీ వివరాలను మాత్రం వెల్లడించలేదు.