New Language learning Tips | కొత్త భాష నేర్చుకోవాలా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

New Language learning Tips | కొత్త భాష నేర్చుకోవాలా? ఈ చిట్కాలు ట్రై చేయండి!

ఏదైనా పనిమీద కొత్త ప్రాంతానికో, దేశానికో వెళ్లాల్సి వస్తే.. అక్కడి భాష వచ్చి, కొత్త వ్యక్తులతో డీల్‌ చేయగల సమర్థత ఉన్నవారినే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కదా! అందువల్ల ఎన్ని భాషలు నేర్చుకుంటే.. మీకు అంత ప్రయోజనం. కొత్త భాష నేర్చుకొనేందుకు చిట్కాలివిగో..

Eenadu icon
By Education News Team Published : 17 Dec 2024 06:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నేటి డిజిటల్‌ యుగంలో ప్రపంచమే ఓ కుగ్రామంలా మారింది. కెరీర్‌లో ఎదగాలంటే మాతృభాష ఒక్కటే వస్తే చాలదు. ఇతర భాషలూ తెలిసుండాలి. ఏదైనా పనిమీద కొత్త  ప్రాంతానికో, దేశానికో వెళ్లాల్సి వస్తే.. అక్కడి భాష (Language) వచ్చి, కొత్త వ్యక్తులతో డీల్‌ చేయగల సమర్థత ఉన్నవారినే అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి కదా! అందువల్ల ఎన్ని భాషలు నేర్చుకుంటే.. మీకు అంత ప్రయోజనం. మరి, మీరూ కొత్త భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? ఈ చిట్కాలు ప్రయత్నించొచ్చు. 

  • రిక్రూటర్లను ఆకట్టుకొనేలా మీ లింక్డిన్‌ ప్రొఫైల్‌ ఉందా? చిట్కాలివిగో..!
  • ఏదైనా కొత్త విషయాన్ని నేర్చుకోవడం మొదలు పెడితే..  వెంటనే రావట్లేదని నిరుత్సాహపడొద్దు.  నేర్చుకోవడంలో చిన్న చిన్న లక్ష్యాలను నిర్దేశించుకోండి.  అక్షరాలు.. పదాలు.. వాక్యాలు.. ఇలా నేర్చుకుంటున్న కొద్దీ.. మీలో ఉత్సాహం, విశ్వాసం పెరుగుతాయి. అదే మీరు భాషను త్వరగా నేర్చుకొనేలా ప్రేరణ ఇస్తుంది. 
  • ఏ భాష నేర్చుకోవాలనుకుంటారో దాంట్లోనే ఇతరులతో మాట్లాడేందుకు ప్రయత్నించండి. అదే భాషలో సినిమాలు చూడటం, మ్యూజిక్‌ వినడం అలవాటు చేసుకోండి. తద్వారా మీరు నేర్చుకోవాలనుకొనే భాషకు సంబంధించిన సంభాషణలు వినే నైపుణ్యం మెరుగుపడుతుంది. 
  • రోజూ కొత్త పదాలు, పదబంధాలు నేర్చుకోవడం సాధన చేయండి. కొత్త పదాలను నేర్చుకోవడం ద్వారా పద సంపద పెరిగి ఆ భాష పట్ల అభిమానం పెరుగుతుంది. 
  • వార్తలంటే ఇష్టపడేవారైతే.. మీరు నేర్చుకోవాలనుకొంటున్న భాషలో దినపత్రికల్ని చదవడం, టీవీ చూడటం చేయండి. అక్కడ జరుగుతున్న సంఘటనల గురించి చదువుతూ ఉంటే కొత్త కొత్త పదాలు అవే అర్థమైపోతుంటాయి. తెలియని పదాల అర్థాల కోసం ద్విభాషా నిఘంటువును వాడండి. 
  • మీ దిన చర్యను అదే భాషలో రాయడం అలవాటు చేసుకోండి. మీ అనుభవాలు, ఆలోచనలు మీకు ఇష్టమైన అంశాలను ఒక పుస్తకంలో రాయడం ద్వారా పద సంపద పెంచుకోవచ్చు. వాక్య నిర్మాణం మెరుగుపడుతుంది.  ఇప్పుడు భాషలు నేర్పే యాప్‌లు అందుబాటులోకి వచ్చాయి. వాటి సాయంతో మీ భాషా పరిజ్ఞానానికి మరింత పదును పెట్టొచ్చు. 
  • మీరు ఏ భాషనైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని మాట్లాడేవారితో స్నేహం చేయండి. వారిని కలిసేటప్పుడు అదే భాషలో మాట్లాడండి. ఒకవేళ మీ మాటల్లో తప్పులు దొర్లినా వారే సరిచేస్తుంటారు. తద్వారా మీరు మరింత బాగా నేర్చుకొనే వీలుంటుంది. 
  • మీరు నేర్చుకోవాలనుకుంటున్న భాషకు సంబంధించిన పుస్తకాలను నిరంతరం చదవడం, పాటలు వినడం, ఆలోచించడం చేయండి. అవతలి వ్యక్తులతో మీరు జరిపే చర్చలు, మీ ఆలోచనలు అదే భాషలో వ్యక్తపరచండి. వీలుంటే అప్పుడప్పుడు ఆ భాషలకు సంబంధించిన కస్టమర్‌ కేర్‌కి ఫోన్‌ చేసి మాట్లాడితే ఇంకా మంచిది. మీరు మాట్లాడే వ్యక్తి ఎవరో తెలీదు గనక.. ఎవరో ఏదో అనుకుంటారన్న బిడియం అసలే ఉండదు కదా!  
  • పాటలు రాయడం, కామిక్స్ గీయడం, లేదంటే చిన్న చిన్న కథలను రాయడం వంటి సృజనాత్మక పద్ధతుల్ని అలవాటు చేసుకొనేందుకు ప్రయత్నించండి. 
  • లోకల్‌ స్పీకర్లను అనుకరించండి. వాళ్లు ఏం చెబుతున్నారో గమనించి అలాగే మీరూ పలకడం ప్రాక్టీస్‌ చేయండి. తద్వారా భాషలో సహజత్వం అలవడుతుంది. 
  • కొత్త విషయాలు నేర్చుకొవాలంటే చొరవ ఎంతో అవసరం. బిడియం, సిగ్గు నుంచి బయట పడి కొత్త వారితో మాట్లాడటం నేర్చుకోండి. అనుకున్న లక్ష్యాన్ని సాధించినప్పుడు మిమ్మల్ని మీరే ప్రశంసించుకోవడం మరింత ప్రేరణనిస్తుంది.