LinkedIn Profile Tips | రిక్రూటర్లను ఆకట్టుకొనేలా మీ లింక్డిన్ ప్రొఫైల్ ఉందా? చిట్కాలివిగో..!
డ్రీమ్ జాబ్ సాధించడం అంత ఈజీ కాదు. మీరే కంపెనీలో చేరాలనుకుంటున్నారో అందుకు సర్వసన్నద్ధంగా ఉన్నట్లు కంపెనీల రిక్రూటర్లకు తెలిసేలా మీ లింక్డిన్ ప్రొఫైల్ ఎలా ఉండాలో కొన్ని చిట్కాలివిగో..
By Education News Team
Published :13 Dec 2024 21:08 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13122024
ఇంటర్నెట్ డెస్క్: డ్రీమ్ జాబ్ సాధించడం అంత ఈజీ కాదు. ఏ కంపెనీలో చేరాలనుకుంటున్నారో అందుకు తగ్గట్టు సర్వసన్నద్ధం కావాల్సి ఉంటుంది. మరి మీలో ఆ కంపెనీలు కోరుకుంటున్న లక్షణాలు, నైపుణ్యాలు ఉన్నాయనేది వారికి తెలిసేదెలా?అందుకు మీ లింక్డిన్(LinkedIn) ప్రొఫైల్‌ను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుకోవడం తప్పనిసరి. ఈ ప్లాట్‌ఫాం వేదిక ద్వారానే అనేక దిగ్గజ కంపెనీలు తమకు కావాల్సిన మానవ వనరుల్ని ఎంపిక చేస్తున్నాయి. మరి మీ లింక్డిన్ ప్రొఫైల్ రిక్రూటర్లను ఆకట్టుకొనేలా కొన్ని చిట్కాలు మీ కోసం..
- ఎవరిదైనా ప్రొఫైల్ చూసే ముందు వారి ఫొటోను చూడాలనుకుంటారు కదా! అందరి దృష్టి ఫొటోపై ఉండటంతో ప్రొఫెషనల్‌గా, స్పష్టంగా కనబడేలా అప్‌లోడ్ చేయండి. ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనే మాటను దృష్టిలో ఉంచుకొని రిక్రూటర్లకు మీ ముఖం స్పష్టంగా కనబడేలా తాజా ఫొటోను మీ ప్రొఫైల్‌లో అప్‌డేట్ చేయడం మరిచిపోవద్దు.
- రిక్రూటర్ల దృష్టిని మీవైపు ఆకర్షించేలా సంబంధిత రంగంలో మీకు ఉన్న అనుభవం, నైపుణ్యాలను హైలైట్ చేయండి. అంతేకాకుండా గతంలో మీరు సాధించిన విజయాలు, కెరీర్‌లో మీ లక్ష్యాలనూ పొందుపరచొచ్చు. మీ నైపుణ్యాన్ని ధ్రువీకరించేందుకు లింక్డిన్ ఎండార్స్‌మెంట్ ఫీచర్ ఉపయోగించండి. కీవర్డ్స్‌ను ఉపయోగించండి.
- మీ లింక్డిన్ ప్రొఫైల్ URLలో మీ పేరు కనబడేలా కస్టమైజ్ చేయడం ద్వారా తేలిగ్గా గుర్తించేందుకు, షేర్ చేయడానికి వీలవుతుంది. అలాగే, మీరు సాధించిన విజయాలను ప్రొఫైల్‌లో ప్రముఖంగా ప్రస్తావించేలా.. మీరు పనిచేసిన ముఖ్యమైన ప్రాజెక్టులు, సాధించిన అవార్డులు, సర్టిఫికెట్ల వివరాలను పొందుపరచండి.
- మీరు పనిచేస్తున్న రంగంలో మంచి సంబంధాలను ఏర్పరుచుకోండి. మీకుండే బలమైన నెట్‌వర్క్.. రిక్రూటర్లకు మీపట్ల సానుకూలతను పెంచే అవకాశం ఉంటుంది. మీ ప్రొఫైల్‌ను మరింత విశ్వసనీయంగా మార్చుకొనేలా సహోద్యోగులు, పర్యవేక్షకుల సలహాలను తీసుకోండి.
- మీరు పనిచేయాలనుకొంటున్న కంపెనీల ప్రొఫైల్స్‌ను ఫాలో అవ్వండి. ఏవైనా ఓపెనింగ్స్ ఉన్నా కంపెనీకి సంబంధించిన సమాచారం తెలుసుకోనేందుకు ఉపకరిస్తుంది. కంపెనీల హెచ్‌ఆర్ మేనేజర్లు, రిక్రూటర్లను అనుసరించండి. మీ నెట్‌వర్క్‌ను పెంచుకొనేందుకు దోహదపడుతుంది.
- మీరు పనిచేసే రంగానికి సంబంధించిన పోస్టులను షేర్ చేయడంలో క్రియాశీలంగా ఉండండి. చర్చల్లో పాల్గొనడం, మీ నెట్‌వర్క్‌తో నిరంతరం టచ్‌లో ఉండడం కొనసాగించండి. లింక్డిన్‌లోని ప్రొఫైషనల్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. మీరు ఎంచుకున్న రంగంలో వస్తున్న సరికొత్త పోకడలను తెలుసుకొనేందుకు ఇది ఉపయోగపడుతుంది.
- మరీ ముఖ్యంగా, మీ ప్రొఫైల్‌ను రెగ్యులర్‌గా అప్‌డేట్ చేయడం చాలా అవసరం. తరచూ మీరు నేర్చుకొనే స్కిల్స్, పనిచేసే బాధ్యతలు, సాధించిన విజయాలను ఎప్పటికప్పుడు తాజాగా అప్‌డేట్ చేసుకోవడం మరిచిపోవద్దు.
- లింక్టిన్‌లోని 'ఓపెన్ టు నెట్‌వర్క్' ఫీచర్‌ను యాక్టివేట్ చేయండి. దీంతో రిక్రూటర్లకు ఫలానా ప్రొఫైల్ ఉద్యోగాన్వేషణలో ఉందనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. అంతేకాకుండా మీ అభిరుచిన బట్టి ఆర్టికల్స్‌ను పబ్లిష్ చేస్తుండడం మీ పట్ల సానుకూలతను పెంచే మరో అంశం. మీరు పని చేస్తున్న రంగంపై మీకున్న అభిరుచి, అవగాహన ఎంతో రిక్రూటర్లకు తెలిసే అవకాశం ఉంటుంది.