Life Skills I మధ్యలోనే ఆగిపోతున్నారా? ఆరంభ శూరత్వానికి చెక్‌ పెట్టండిలా!

Life Skills I మధ్యలోనే ఆగిపోతున్నారా? ఆరంభ శూరత్వానికి చెక్‌ పెట్టండిలా!

మీరు ఆరంభశూరులా? ఏదైనా పని ప్రారంభించి మధ్యలోనే వదిలిపెట్టేసే అలవాటు ఉందా? ఈ అలవాటుకు ఇలా చెక్‌ పెట్టండి

Published :20 August 2024 08:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎవరైనా బాగా నచ్చినవాళ్లు చెప్పింది వినో.. ఒక సినిమా చూశో.. ఎక్కడో చదవడం వల్లో అప్పటికప్పుడు ప్రేరణ పొంది ఆరంభ శూరత్వాన్ని ప్రదర్శిస్తుంటారు కొందరు. కొత్త కోర్సుల్లో చేరడం, పరిచయం లేని సబ్జెక్ట్‌ చదవడం, కొత్త నైపుణ్యాన్ని నేర్చుకోవడం.. ఇలా ఏ నూతన కార్యాన్ని తలపెట్టినా ఉత్సాహంగా మొదలుపెట్టి.. సగం వరకూ పూర్తిచేసి.. ఆ తర్వాత చేతులెత్తేసే అలవాటు ఉంటుంది. కానీ, ఈ తీరు బాగా నష్టం చేస్తుంది. ముఖ్యంగా విద్యార్థి దశలో భవిష్యత్తును నిర్దేశించే లక్ష్యాల సాధనలో అలసత్వం వద్దే వద్దు. చదువులో, కెరియర్‌లో సక్సెస్‌ కావాలని తపించే ఎవరైనా సరే తాము మొదలుపెట్టిన టాస్క్‌లను మధ్యలో వదిలేయకుండా పూర్తి చేయడం ఎలాగంటే..?

వృత్తిలో రాణించాలంటే.. ఈ 12 నైపుణ్యాలూ అవసరమే!

  • ఒక్కసారి ఇది చేయాలి అని నిర్ణయించుకున్నాక.. మళ్లీ ఆప్షన్‌ తీసుకోకూడదు. ఎవరికైనా ఒక పని చేసినా పర్లేదు, చేయకపోయినా పర్లేదు అనే ఆప్షన్‌ ఉంటే.. అందులో వంద శాతం కృషి చేయలేరు. పూర్తయ్యే తీరాలి అనుకున్నప్పుడే పూర్తిగా తలమునకలవుతారు. ఫలితాలు కూడా అంతే ఆశాజనకంగా ఉంటాయి.
  • ఎంతటి కార్యదక్షత ఉన్నవారైనా.. ఏదో ఒక సమయంలో మానసికంగా అలసిపోవడం మామూలే. సవాళ్లు ఎదురైనప్పుడు అసలు ఈ పని ఎందుకు మొదలుపెట్టామా అని కూడా ఒక్కోసారి అనిపించొచ్చు. కానీ ఆ నెగటివ్‌ భావన నుంచి ఎంత త్వరగా బయటకొస్తే అంత వేగంగా పనిలో నిమగ్నం కాగలం.
  • కొన్నిసార్లు సహనం చాలా అవసరం. ముఖ్యంగా దీర్ఘకాలిక లక్ష్యాలను చేరుకునేటప్పుడు ఎంతో ఓపిగ్గా ఉండాల్సి వస్తుంది. విసుగు చెందితే లక్ష్యాలు నీరుగారడమే కాక, అప్పటివరకూ పడిన శ్రమంతా వృథా అయ్యే ప్రమాదం ఉంది.
  • ఎప్పుడూ ప్రేరణ కోల్పోకూడదు. మనిషిని నడిపించేది అంతర్లీనంగా ఉండే స్ఫూర్తే. దాన్ని నిరంతరం రగిలిస్తూ ఉండాలి.
  • ఈ పని ఎందుకు మొదలుపెట్టామనే కారణాన్ని మళ్లీ మళ్లీ గుర్తుచేసుకోవాలి, అదే మనల్ని ముందుకు నడిపిస్తుంది. కారణం మన మనసుకు ఎంత దగ్గరైనది అయితే.. చేసే పనిలో నాణ్యత, వేగం అంత ఎక్కువగా ఉంటాయి. ఆ ఉత్సాహంతో మరింత శ్రమించగలుగుతాం.
  • కొన్నిసార్లు పని పూర్తిచేయలేక మొత్తంగా వదిలేద్దాం అనిపిస్తుంటే.. ముందు చిన్న విరామం తీసుకోవడం ఉత్తమం. దాన్నివల్ల మనసు తేలికపడి కొత్త ఆలోచనలు వస్తాయి. టాస్క్‌ను ఎలా పూర్తిచేయాలో తెలుస్తుంది.
  • అవరోధాలు అవసరమేనన్న విషయాన్ని గుర్తించాలి. ఎవరైనా విజయాల నుంచి కంటే, అపజయాల నుంచే ఎక్కువగా నేర్చుకోగలుగుతారు. అడ్డంకులు ఎదురైనప్పుడే సమస్యల పరిష్కారం అర్థమవుతుంది. అందువల్ల వాటిని పాజిటివ్‌గా తీసుకోవాలి.
  • నిరాశగా అనిపించినప్పుడు పాత విజయాలను గుర్తుచేసుకుంటే కొత్త ఉత్సాహం వస్తుంది. చిన్నదే అయినా, సక్సెస్‌పై మనల్ని మనం అభినందించుకోవాలి. అదే స్ఫూర్తితో కొత్త పనులు చేసేందుకు ప్రయత్నించాలి.