Top 15 Skills In India | ఇది ఏఐ వరల్డ్! ఉన్న స్కిల్స్‌తో కష్టమే.. కొత్తగా వీటిని నేర్చుకుంటేనే కొలువు!
అసలే ఇది ఏఐ ప్రపంచం! ఈ తరుణంలో ఉద్యోగాల్లో వస్తోన్న విప్లవాత్మక మార్పులతో ఉన్న పరిమితమైన స్కిల్స్ సరిపోవు.. జాబ్ కొట్టాలంటే నేర్చుకోవాల్సిన స్కిల్స్ ఇవిగో!
By Education News Team
Published :20 Mar 2025 17:27 IST
https://results.eenadu.net/news.aspx?newsid=20032025-top-15-skills-in-india
ఇంటర్నెట్ డెస్క్: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)ప్రవేశంతో డిజిటల్ రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పని విధానంలో అనూహ్య మార్పులతో జాబ్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే నైపుణ్యాలే అత్యంత కీలకంగా మారాయి. రిక్రూటర్లు సైతం అభ్యర్థుల విద్యార్హతల్ని కాకుండా వారిలో నైపుణ్యాల వైపే చూస్తున్న పరిస్థితి. అందువల్ల ఉద్యోగార్థులు, ఉద్యోగులు తమ రెజ్యూమ్‌లో కొత్త నైపుణ్యాల్ని చేర్చుకోవాల్సిన అత్యంత కీలక సమయమిది. భారత్‌లో పని పద్ధతుల్లో చోటుచేసుకుంటున్న మార్పులకనుగుణంగా నేర్చుకోవాల్సిన 15 నైపుణ్యాల జాబితాను ప్రముఖ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ యాప్ లింక్డిన్ (LinkedIn) తాజాగా విడుదల చేసింది. భారత్‌లో ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకోవాలంటే.. అభ్యర్థులకు అవసరమైన నైపుణ్యాలతో ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ (Skills on the Rise 2025) పేరిట ఓ నివేదికను విడుదల చేసింది.
లింక్డిన్ పరిశోధనల ప్రకారం.. 25శాతం మంది ఉద్యోగులు భవిష్యత్తుకు అవసరమైన నైపుణ్యాలు తమకు లేవని ఆందోళనతో ఉన్నారట. 60 శాతం మంది పరిశ్రమలు మారేందుకు సిద్ధమవుతుండగా.. 39 శాతం మంది మాత్రం కొత్త నైపుణ్యాలను నేర్చుకోనేలా ప్రణాళికలతో ఉన్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే, భారత్‌లోని ఉద్యోగుల్లో ఉన్న స్కిల్స్, కంపెనీలు కోరుకొనే వాటికి మధ్య సరిపోవడంలేదని 69శాతం మంది రిక్రూటర్లు చెబుతున్నారు. ఏఐ ప్రవేశంతో మన పని విధానంలో విప్లవాత్మక మార్పులు రావడంతో సృజనాత్మకత(Creativity), సమస్య పరిష్కారం(Problem solving), వ్యూహాత్మక ఆలోచన (strategic thinking) వంటి సాఫ్ట్ స్కిల్స్ అత్యంత కీలకంగా మారినట్లు లింక్డ్‌ఇన్ ఇండియా సీనియర్ మేనేజింగ్ ఎడిటర్, కెరియర్ ఎక్స్‌పర్ట్ నిరాజిత బెనర్జీ తెలిపారు.
మరోవైపు, అన్ని ఉద్యోగాల్లోనూ ఏఐ పరిజ్ఞానం అనేది కీలకంగా మారిందని.. కంపెనీ యాజమాన్యాలు కస్టమర్ ఎంగేజ్‌మెంట్, స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్ అంశాలపై దృష్టిపెట్టినట్లు ఆమె తెలిపారు. ఏఐతో పని విధానంలో మార్పులతో గతంలో ఆప్షనల్‌గా ఉండే సృజనాత్మకత, ప్రాబ్లమ్ సాల్వింగ్, స్ట్రాటజికల్ థింకింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్.. బిజినెస్‌లో అత్యంత కీలకంగా మారినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది కంపెనీలకు కావాల్సిన నైపుణ్యాలను గుర్తించి వాటిని నేర్చుకొనేందుకు ఉద్యోగులు/ఉద్యోగార్ధులకు ‘స్కిల్స్ ఆన్ ది రైజ్ 2025’ నివేదిక ఒక వనరుగా ఉపయోగపడుతుందన్నారు. లింక్డిన్ జాబితాలో పేర్కొన్న 15 కీలక నైపుణ్యాలు ఇవే..
- క్రియేటివిటీ, ఇన్నోవేషన్
- కోడ్ రివ్యూ
- ప్రాబ్లమ్ సాల్వింగ్
- ప్రీ-స్క్రీనింగ్
- స్ట్రాటజిక్ థింకింగ్
- కమ్యూనికేషన్
- అడాప్టబిలిటీ
- లార్జ్ లాంగ్వేజ్ మోడల్ (ఎల్‌ఎల్‌ఎం)
- ఏఐ లిటరసీ
- డీబగ్గింగ్
- కస్టమర్ ఎంగేజ్‌మెంట్
- స్టాటిస్టికల్ డేటా ఎనాలసిస్
- ప్రాంప్ట్ ఇంజినీరింగ్
- మార్కెట్ అనాలసిస్
- స్టేక్‌హోల్డర్ మేనేజ్‌మెంట్