JEE Main 2025 : జేఈఈ మెయిన్ అభ్యర్థులకు NTA కీలక సూచనలివిగో!
జేఈఈ మెయిన్ 2025 సెషన్-1 పరీక్షకు రంగం సిద్ధమైంది. జనవరి 22 నుంచి 30 వరకు వివిధ తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలు రాసే విద్యార్థులకు కీలక సూచనలివిగో..
By Education News Team
Published :20 Jan 2024 17:31 IST
https://results.eenadu.net/news.aspx?newsid=20012025
ఇంటర్నెట్ డెస్క్ : జేఈఈ మెయిన్(JEE (Main) 2025) తొలి విడత పరీక్షకు సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు రాసే ఈ పరీక్షలు బుధవారం నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ పరీక్షను విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్‌టీఏ(NTA) అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జనవరి 22, 23, 24, 28, 29, 30 తేదీల్లో జరిగే JEE Main 2025 పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులు తమ అడ్మిట్ కార్డు (Admit card)ను అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పరీక్ష రాసే విద్యార్థులకు ఎన్‌టీఏ కీలక సూచనలు ఇవిగో..
ఇవి మరిచిపోవద్దు..
- పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా తమ అడ్మిట్ కార్డును వెంట తీసుకెళ్లాలి. దీంతో పాటు ఎన్‌టీఏ వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్న సెల్ఫ్ డిక్లరేషన్ ఫారంను కచ్చితంగా నింపాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
- ఫొటో ఐడీ: పరీక్ష రాసే విద్యార్థులు తమ ధ్రువీకరణను నిర్ధారించేలా ఫొటోతో కూడిన గుర్తింపు కార్డులను తీసుకెళ్లడం తప్పనిసరి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్టు, ఆధార్ కార్డు, రేషన్‌కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, అభ్యర్థి ఫొటో ఉన్న బ్యాంకు పాసుపుస్తకం.. వీటిలో ఏదైనా ఒక గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రం వద్దకు తీసుకెళ్లాలి.
- పరీక్ష కేంద్రానికి పాస్‌పోర్టు సైజ్ ఫొటోను తీసుకెళ్లడం మరిచిపోవద్దు. మీరు ఆన్‌లైన్ దరఖాస్తు చేసినప్పుడు అప్‌లోడ్ చేసిన ఫొటోనే ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఎందుకంటే దాన్ని అటెండెన్స్ షీట్‌పై అతికించాల్సి ఉంటుంది.
- విద్యార్థులు ట్రాన్స్‌పరెంట్‌గా ఉండే బాల్‌పాయింట్ పెన్‌ను తీసుకెళ్లాలి.
- పీడబ్ల్యూడీ సర్టిఫికెట్: దివ్యాంగులైన విద్యార్థులు ఎవరైనా ఉంటే వారు తమ వెంట మెడికల్ ఆఫీసర్ ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ను తీసుకెళ్లడం తప్పనిసరి.
మరికొన్ని కొన్ని కీలక సూచనలివే..
- మీ అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనల్ని క్షుణ్ణంగా చదవండి.
- పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్లాన్ చేసుకోండి. అడ్మిట్ కార్డులో పేర్కొన్న సమయానికి మీకు కేటాయించిన పరీక్ష కేంద్రం వద్ద రిపోర్టు చేయండి. పరీక్ష హాలు తెరవగానే మీకు కేటాయించిన సీట్లో కూర్చొని పరీక్ష రాసేందుకు అవసరమైనవన్నీ ఉన్నాయో, లేదో సరిచూసుకోండి.
- ట్రాఫిక్ జామ్, రైలు/బస్సు ఆలస్యం వంటి కారణాల వల్ల పరీక్ష కేంద్రానికి సకాలంలో చేరుకోకపోతే.. అక్కడ ఇన్విజిలేటర్లు ఇచ్చే ముఖ్యమైన సూచనల్ని మీరు మిస్ అయ్యే అవకాశం ఉంటుంది. అభ్యర్థుల ఆలస్యానికి ఎన్‌టీఏ ఎలాంటి బాధ్యత వహించదు.
- పరీక్ష హాలులో ఏదైనా సాంకేతిక సాయం/ఎమర్జెన్సీ, పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే సెంటర్ సూపరింటెండెంట్ /ఇన్విజిలేటర్‌ను సంప్రదించవచ్చు.
- కంప్యూటర్‌లో మీరు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు ప్రకారం ప్రశ్నపత్రం వచ్చిందో లేదో సరిగా నిర్ధారించుకోండి. వేరే సబ్జెక్టుకు సంబంధించిన ప్రశ్నపత్రం వస్తే వెంటనే సంబంధిత ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లండి.
- పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు/రైటింగ్ వర్కు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రఫ్ షీట్లను కచ్చితంగా ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
- కంప్యూటర్ ఆధారిత పరీక్షకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు/సందేహాలను నివృత్తి చేసుకొనేందుకు జేఈఈ(మెయిన్) వెబ్‌సైట్‌లో హెల్ప్‌లైన్ నంబర్లను సంప్రదించవచ్చు.
- పరీక్షలకు ముందు రోజు కొత్త టాపిక్స్‌ను కవర్ చేసేందుకు ప్రయత్నించొద్దు. దానివల్ల విద్యార్థుల ఒత్తిడి, ఆందోళన స్థాయి పెరుగుతుంది.
- పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు కచ్చితంగా వెంట తీసుకెళ్లాల్సిన వాటిని ముందు రోజే సిద్ధం చేసి పెట్టుకోండి. పరీక్ష కేంద్రం ఎక్కడో ముందుగానే ఓసారి చూసుకొని రండి. లొకేషన్, అక్కడి పరిసరాల గురించి తెలుసుకోవడం మంచిది.
- ఒక అభ్యర్థి తప్పుడు సమాచారంతో ఒకటి కంటే ఎక్కువ షిఫ్ట్‌లు/తేదీల్లో పరీక్ష కేంద్రం వద్ద కనిపిస్తే.. అతడి/ఆమె అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. వారి ఫలితాలను ప్రకటించరు.
- ఏ కారణం చేతనైనా షెడ్యూల్ చేసిన పరీక్ష తేదీకి హాజరు కాలేని వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్‌టీఏ తిరిగి పరీక్ష నిర్వహించదు.
పరీక్ష కేంద్రం వద్ద వీటికి నో ఎంట్రీ..
చిరుతిళ్ళు, జామెట్రీ/పెన్సిల్ బాక్స్, హ్యాండ్ బ్యాగ్, పర్సు, పేపర్లు/స్టేషనరీ, ప్రింటెడ్ మెటీరియల్, వాటర్ బాటిళ్లు, మొబైల్‌ఫోన్/ఇయర్ ఫోన్/మైక్రోఫోన్/పేజర్, కాలిక్యులేటర్, డాక్యుపెన్, కెమెరా, టేప్ రికార్డర్ వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు/గ్యాడ్జెట్లు/పరికరాలను పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. ఎక్కువ పాకెట్స్ ఉన్న దుస్తులు వేసుకోరాదు. వీటితో పాటు నగలు, మెటాలిక్ వస్తువులు పరీక్ష కేంద్రంలోకి నిషేధం.