Stress management | విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే యాప్‌లు ఇవిగో.. మీరూ ట్రై చేస్తారా?

Stress management | విద్యార్థుల్లో ఒత్తిడిని తగ్గించే యాప్‌లు ఇవిగో.. మీరూ ట్రై చేస్తారా?

పరీక్షల కోసం ప్రిపరేషన్‌లో తలమునకలయ్యే విద్యార్థుల్లో మానసిక ఆందోళన, ఒత్తిళ్ల నుంచి ఉపశమనం కలిగించే కొన్ని మొబైల్‌ యాప్‌లు మీ కోసం..

Eenadu icon
By Education News Team Published :12 Jan 2024 08:40 IST

Stress Relief Apps | రాబోయే మూడు నాలుగు నెలలు విద్యార్థి లోకానికి ‘పరీక్షా’ కాలమే! జేఈఈ మెయిన్‌ (JEE Main), నీట్‌ (NEET), జేఈఈ అడ్వాన్స్‌డ్‌(JEE Advanced) వంటి పలు జాతీయస్థాయి పోటీ పరీక్షలు ఒకవైపు.. విద్యార్థుల వార్షిక పరీక్షలు మరోవైపు. దీంతో ప్రిపరేషన్‌లో బిజీ బిజీ అయిపోతున్నారు. ఈ క్రమంలో వారిలో ఎదురయ్యే మానసిక ఆందోళన, ఒత్తిళ్ల నుంచి కాసేపు ఉపశమనం కలిగించే కొన్ని మొబైల్‌ యాప్‌లు ఇవే..

బ్రీత్‌2రిలాక్స్‌ (Breathe2Relax)

ఈ ఉచిత యాప్‌ను కళాశాల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించారు. డౌన్‌లోడ్‌ చేసుకుని.. అందులో సూచించినట్లు శ్వాస సంబంధ వ్యాయామాలు చేయాలి. దీర్ఘంగా శ్వాస తీసుకుని వదిలినప్పుడు గుండె కొట్టుకునే వేగాన్ని కొలుస్తారు. ప్రతీ సెషన్‌లో ఫలితాలను భద్రపరిచే రికార్డును నిర్వహిస్తారు. దీనిద్వారా శ్వాస వ్యాయామాల పనితీరును పరీక్షించుకోవచ్చు.

మైండ్‌షిఫ్ట్‌ (MindShift CBT)

దీన్ని ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్నిరకాల భయాలు, ఆపదలు రాబోతున్నాయని ముందుగానే ఊహించుకుని ఒత్తిడికి గురికావడం, ఎదుటివాళ్లు ఏమనుకుంటారోనని భయపడటం.. వీటన్నింటికీ దీంట్లో పరిష్కారాలను సూచించారు. ఆలోచనలను రికార్డు చేయడం ద్వారా ఒత్తిడికి గురిచేసే అంశాలను గుర్తించే వెసులుబాటు ఉంది. ఈ యాప్‌లో ఆడియో రికార్డింగ్‌ల లైబ్రరీ కూడా అందుబాటులో ఉంటుంది.

సాన్‌వెల్లో (Sanvello)

మానసిక ఆరోగ్య మార్గాలూ, ధ్యానానికి సంబంధించిన మార్గదర్శకాలనూ ఇందులో పొందుపరిచారు. ఒత్తిడిని తగ్గించుకుని, విశ్వాసాన్ని పెంచుకునే చిట్కాలూ అందుబాటులో ఉంటాయి. గుండె కొట్టుకునే వేగాన్ని రికార్డు చేసే మానిటర్‌ ఉంటుంది. ఈ యాప్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కొన్ని ప్రత్యేక ఫీచర్లకు మాత్రం నామమాత్రపు ఫీజు చెల్లించాలి.

వర్రీ వాచ్‌ (Worry Watch)

ఈ యాప్‌ను కళాశాల విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం రూపొందించారు. తక్కువ ఫీజుతో యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. రోజు మొత్తంలో ఒత్తిడికి గురైన సందర్భాలను, అనుభవాలను ఇందులో రాసుకోవచ్చు. వీటి ద్వారా ఒత్తిడికి అసలు కారణాలను గుర్తిస్తారు. ఈ యాప్‌ మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌లో కూడా పనిచేస్తుంది.

హ్యాపీఫై (Happify)

దీంట్లో కొన్ని గేమ్స్‌, యాక్టివిటీస్‌ ఉంటాయి. స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్స్‌, డెస్క్‌టాప్స్‌, ల్యాప్‌టాప్స్‌, కంప్యూటర్‌ వేదికగా దీన్ని ఉపయోగించుకోవచ్చు. యాప్‌లోని వివిధ ఆటల ద్వారా వినియోగదార్లు పొందిన ఆనందాన్ని కొలుస్తారు. నాలుగు వారాలపాటు వీటిని ఆడిన తర్వాత 80 శాతం మందిలో మూడ్‌ మెరుగైనట్టు గుర్తించారు. దీన్ని వాడటానికి ముందు కొన్ని సంక్షిప్త సర్వే ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. సబ్‌స్క్రైబ్‌ చేసుకుని ఈ యాప్‌ సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఇవే కాకుండా.. కామ్‌ (Calm), హెడ్‌స్పేస్‌ (Headspace), వర్రీవాచ్‌ (worrywatch), మై మూడ్ ట్రాకర్‌ (My Mood Tracker), పర్సనల్‌ జెన్‌ (Personal Zen) వంటి మరెన్నో యాప్‌లు అందుబాటులో ఉన్నాయి.