SSC exams Preparation | ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షకు ప్రిపరేషన్.. IIT కాన్పూర్ గుడ్‌న్యూస్
ఎస్‌ఎస్‌సీ ఉద్యోగాలకు సన్నద్ధమవుతోన్న వారికి ఐఐటీ కాన్పూర్ తోడుగా నిలుస్తోంది. వారి ప్రిపరేషన్ కోసం కొత్త వేదికను ఏర్పాటు చేసింది.
Published :18 July 2024 17:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=18072024
SSC exams Preparation| ఇంటర్నెట్ డెస్క్: కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సన్నద్ధమయ్యే లక్షలాది మంది అభ్యర్థులకు ఐఐటీ కాన్పూర్ (IIT Kanpur) గుడ్‌న్యూస్ చెప్పింది. అనుభవజ్ఞులైన నిపుణులతో ప్రాక్టీస్ టెస్ట్‌లు, వీడియో లెక్చర్లు, ఇంటరాక్టివ్ సెషన్లతో సాథీ ఎస్‌ఎస్‌సీ (SATHEE SSC) పేరిట ఓ ప్రత్యేక వేదికను ఏర్పాటు చేసింది. ఆశావహులు/ విద్యార్థులకు, మరీ ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని వారందరికీ నాణ్యమైన శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా కేంద్ర విద్యాశాఖ సహకారంతో రూపొందించారు.
పరీక్ష లేదు.. పది పాసైతే చాలు.. 44,228 ఉద్యోగాలకు భారీ నోటిఫికేషన్
ఈ వేదిక ఏర్పాటుపై ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ మాట్లాడుతూ.. సాథీ ఎస్‌ఎస్‌సీ (SATHEE SSC) జాతీయ విద్యా విధానం - 2020 లక్ష్యానికి అనుగుణంగా రూపొందించినట్లు తెలిపారు. అందరికీ నాణ్యమైన విద్యనందించే లక్ష్యాన్ని విస్తరించాలనే సంకల్పంతో ముందడుగు వేసినట్లు పేర్కొన్నారు. పరీక్షలకు ప్రిపేరేషన్ మాత్రమే కాకుండా ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేందుకు దోహదపడుతుందని తెలిపారు. ఏఐ సాంకేతికతతో రూపొందించిన ఈ SATHEE SSC వేదిక విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా కొత్త అనుభూతినిచ్చేలా తీర్చిదిద్దినట్లు ఐఐటీ కాన్పూర్ అధికారులు తెలిపారు. ఎస్‌ఎస్‌సీ ఎంటీఎస్ స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉందని.. మిగతా ఎస్‌ఎస్‌సీ పోస్టులకు సంబంధించిన మెటీరియల్ అందుబాటులోకి తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు sathee.iitk.ac.in వెబ్‌సైట్ ద్వారా SATHEE SSCలో రిజిస్టర్ చేసుకోవచ్చని.. లేదా SATHEE యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి పొందొచ్చని సూచించారు.