CBSE Scholarship | సీబీఎస్‌ఈ ‘సింగిల్ గర్ల్ చైల్డ్’ మెరిట్ స్కాలర్‌షిప్.. దరఖాస్తు చేశారా?
CBSE Scholarship | తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్ అందజేస్తోంది. అర్హులైన వారు ఫిబ్రవరి 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
By Education News Team
Updated : 26 Jan 2025 15:11 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17122024
ఇంటర్నెట్ డెస్క్: మీరు పదో తరగతి పూర్తి చేసిన అమ్మాయిలా? తల్లిదండ్రులకు మీరొక్కరే సంతానమా? అయితే, సీబీఎస్‌ఈ(CBSE) ప్రకటించిన ఈ మెరిట్ స్కాలర్‌షిప్(CBSE Merit Scholarship) స్కీమ్ మీ కోసమే. తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉండి ప్రతిభావంతులైన ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించేందుకు సీబీఎస్‌ఈ(CBSE) స్కాలర్‌షిప్‌ను అందిస్తోంది. ఇందులో భాగంగా 2024 సంవత్సరానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణకు పొడిగించిన గడువు ముగియడంతో మరోసారి పొడిగించింది. దీంతో సీబీఎస్‌ఈ (CBSE) పదో తరగతి పరీక్షల్లో 70శాతం మార్కులతో ఉత్తీర్ణులైన విద్యార్థినులు 2025 ఫిబ్రవరి 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలివే..
దరఖాస్తు కోసం క్లిక్ చేయండి
- తల్లిదండ్రులకు ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల్ని విద్యలో ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ మెరిట్ స్కాలర్‌షిప్ స్కీమ్‌ను అమలు చేస్తున్నారు.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఎంపికైన విద్యార్థినులకు ప్రతి నెలా ₹1000 చొప్పున రెండేళ్ల పాటు అందజేస్తారు. విద్యార్థినికి చెందిన ఖాతాలోనే ఈ మొత్తాన్ని జమ చేస్తారు.
- దరఖాస్తు చేసుకొనే విద్యార్థినులు సీబీఎస్‌ఈలో పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే, ప్రస్తుతం సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాల్లో 11, 12వ తరగతులు అభ్యసిస్తుండాలి.
- పదో తరగతి పరీక్షల్లో కనీసం 70శాతం, ఆపైన మార్కులు సాధించిన వారే ఈ స్కాలర్‌షిప్ అవార్డుకు అర్హులు.
- విద్యార్థిని ట్యూషన్ ఫీజు పదో తరగతిలో నెలకు రూ.2500; సీబీఎస్‌ఈ 11, 12 తరగతులకు రూ.3వేలు మించరాదు.
- సీబీఎస్‌ఈ బోర్డులో విద్యనభ్యసిస్తున్న ఎన్నారై విద్యార్థినులూ ఈ అవార్డుకు అర్హులే. వీరి ట్యూషన్ ఫీజు నెలకు రూ.6వేలు మించొద్దు.
- ఈ స్కాలర్‌షిప్‌నకు ఇప్పటికే ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత మళ్లీ రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
- 11వ తరగతి నుంచి 12వ తరగతికి రెన్యువల్ చేయించుకోవాలంటే సదరు విద్యార్థినులు కనీసం 70శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించాల్సి ఉంటుంది.
- తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.8లక్షల కన్నా తక్కువ ఉండాలి.
- ఈ దరఖాస్తులను సంబంధిత పాఠశాలలు ఫిబ్రవరి 15వరకు వెరిఫికేషన్‌ను పూర్తి చేయాల్సి ఉంటుంది.