Internship | ఇంటర్న్‌షిప్ చేయడం ఎందుకు ముఖ్యం? ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?
అసలే ఇది పోటీ ప్రపంచం. ఉద్యోగం రావాలంటే డిగ్రీలుంటే సరిపోదు.. నైపుణ్యాలే కీలకం. కలల కొలువు సొంతం చేసుకోనేందుకు కాలేజీలో ఉన్నప్పుడే ఇంటర్న్‌షిప్‌లు చేయడం ద్వారా కెరీర్‌లో రాణించే వీలుంటుంది.
Published :17 Oct 2024 17:26 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17102024
Internship | ఇంటర్నెట్ డెస్క్: ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగానికి నైపుణ్యాభివృద్ధే (Skills Development) గీటురాయి. అందుకే, రాబోయే ఐదేళ్లలో దేశంలోని కోటిమంది విద్యార్థులకు అగ్రశ్రేణి 500 కంపెనీల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పీఎం ఇంటర్న్‌షిప్ (PM Internship Scheme)పథకానికి శ్రీకారం చుట్టింది. ఇందుకోసం అర్హులైన, ఆసక్తికలిగిన వారి నుంచి దరఖాస్తులు కోరుతోంది. అంతేకాదు, దేశంలో అనేక ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థలు సైతం విద్యార్థులకు చక్కటి ఇంటర్న్‌షిప్ అవకాశాలు కల్పిస్తూ ఆకర్షణీయమైన స్టైఫండ్ అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్న్‌షిప్ ప్రాముఖ్యత, కాలేజీ విద్య పూర్తవుతుండగానే విద్యార్థులు ఇంటర్న్‌షిప్ చేయడం ఎందుకు ముఖ్యం? వీటిని ఎలా ఎంచుకోవాలనే అంశాలపై నిపుణుల కీలక సూచనలివే..!
టాప్-500 కంపెనీల్లో శిక్షణ.. పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు షురూ
ఇంటర్న్‌షిప్ ఎందుకు ముఖ్యం?
- విద్యార్థులను ఉద్యోగ ప్రపంచానికి పరిచయం చేసే గొప్ప వేదిక ఇంటర్న్‌షిప్ (Internship). ఇక్కడ ఉద్యోగార్ధికి అవసరమైన నైపుణ్యాలపై శిక్షణ అందుతుంది. ఇంటర్న్‌షిప్ చేసే స్వల్ప వ్యవధిలో (మూడు/ఆరు మాసాలు) మంచి ప్రతిభ, నైపుణ్యాలు ప్రదర్శిస్తే.. ఆయా కంపెనీలు శాశ్వత ఉద్యోగిగా నియమించుకొనే అవకాశాలూ అందిపుచ్చుకోవచ్చు. ఇంటర్న్‌షిప్‌లు ప్రయోగాత్మక శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఆయా సంస్థల్లో పనిచేసే నిపుణుల మార్గదర్శకత్వంలో పనిచేసే సదావకాశం దక్కుతుంది. వారితో కలిసి మాట్లాడటం ద్వారా కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపరుచుకోవచ్చు. నైపుణ్యాలను పెంపొందించుకొని రెజ్యూమ్‌ను మరింత ఉపయుక్తంగా రూపొందించడంతో పాటు పనిచేసే చోట పరిస్థితులు ఎలా ఉంటాయి? తోటి ఉద్యోగులతో వ్యవహరించాల్సిన తీరుతెన్నులు అలవర్చుకొనేందుకు ఇదో గొప్ప అవకాశం.
- ఇంటర్న్‌షిప్ ద్వారా విద్యార్థి తాను కాలేజీలో అభ్యసించిన చదువును పరీక్షించుకొనే క్షేత్రంలా ఉపయోగపడుతుంది. ఏ రంగంలో ప్రవేశించాలనుకొంటున్నారో దానిగురించి సర్వం తెలుసుకొనే అమూల్యమైన వేదిక. ఇది కాలక్షేపం చేసే స్వల్ప దశ కాదు.. విద్యార్థిగా ఉన్న సమయంలో మీరు నిర్మించుకున్న కలల ప్రపంచానికి దారిచూపే ఒక లైట్ హౌస్‌లాంటిది.
- డిగ్రీలు కేవలం ప్రవేశార్హతలు మాత్రమే.. ఒకసారి కంపెనీలో కాలుమోపాక.. ఇక అంతా స్కిల్స్‌తోనే పని. ఉద్యోగ ప్రపంచమే వేరు. మీరు అనుభవం గడిస్తున్నకొద్దీ కొత్త ప్రాజెక్టుల్లో చోటు సంపాదించి కెరీర్‌లో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చు. అందువల్ల విద్యాసంస్థల్లో మీరు నేర్చుకున్న దాన్ని ఉద్యోగావసరాలకు తగ్గట్టుగా మలచుకొనేందుకు ఇంటర్న్‌షిప్ ఓ గొప్ప ఛాన్స్.
- ఇంటర్వ్యూలకు వెళ్లే సమయంలో మిగతా వారితో పోలిస్తే.. ఇంటర్న్‌షిప్ చేసే వారిలో కాన్ఫిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. భయం, అపనమ్మకం వంటి ప్రతికూల లక్షణాలు వీరిలో కనబడవు. శిక్షణలో పొందిన నైపుణ్యాలు, అనుభవాలను ప్రస్తావించొచ్చు. సమర్థతో చేయగలిగే పనులను పేర్కొనొచ్చు.
- ఇంటర్న్‌షిప్ చేసేది ఎంత తక్కువ కాలమైనా.. విద్యార్థి తనకున్న నైపుణ్యాలపై, సామర్థ్యంపై అవగాహన ఏర్పడుతుంది. ఏ తరహా నైపుణ్యాలపై తనకు పట్టుందో, ఏ స్కిల్స్‌ను ఇంకా నేర్చుకోవాలో గ్రహించవచ్చు.
ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!
ఎంపికలో జాగ్రత్తలివే..
- ఇంటర్న్‌షిప్ అవకాశం వస్తే వెంటనే చేరిపోదామనే తాపత్రయం వద్దు. ఆఫర్ చేసే కంపెనీ గురించి ముందు తెలుసుకోండి.
- ఇంటర్న్‌షిప్‌లో చేయాల్సిన పని ఏంటో వివరంగా తెలుసుకోండి.
- ఇంటర్న్‌షిప్ చేసే కంపెనీని ఎంచుకునే అవకాశం వస్తే మాత్రం విద్యార్థి తాను చదివిన సబ్జెక్టుకు సంబంధించిన కోర్ కంపెనీనే ఎంపిక చేసుకోవడం ఉత్తమం.
- మార్కెట్‌లో కాస్త పేరున్న కంపెనీనే ఎంపిక చేసుకోండి. చేసే పని తన కెరియర్ లక్ష్యాలకు అనుకూలమైన అవకాశమో, కాదో చూసుకోండి.
- ఎక్స్‌పీరియన్స్ కోసం ఒక పనిచేసి రెజ్యూమెలో రాసుకుంటే చాలనుకోవద్దు. సంబంధం లేని అనుభవం ఎంత ఉన్నా దాన్ని పరిగణనలోకి తీసుకోరు. శిక్షణకు వెచ్చించిన కాలం వృథా అయిపోతుంది.
- ఇంటర్న్‌షిప్ ఎంపిక కోసం సాధ్యమైనంతవరకు తనకంటే ముందు చేసిన సీనియర్లను అనుసరించడం మంచిది. వారి రిఫరెన్స్‌తో ముందుకెళితే చాలావరకు సజావుగా సాగుతుంది.
- ఇంటర్న్‌షిప్ కాలంలో పాటించాల్సిన కార్యాలయ వేళలు, చేయవలసిన పని, ఆఫర్ చేసే నెలవారీ భృతి వివరాలు తెలుసుకోవాలి.
- ఎంచుకోబోతున్న కంపెనీ గురించి నలుగురినీ వాకబు చేయాలి. ముఖ్యంగా ఆ సంస్థలో పని సంస్కృతి ఎలా ఉంటుందో తెలుసుకొని ముందడుగు వేయాలి.
- శిక్షణ విజయవంతంగా ముగించాక ఇచ్చే సర్టిఫికెట్ విషయంపై కూడా స్పష్టత అవసరం.