PM Internship Scheme | టాప్‌-500 కంపెనీల్లో శిక్షణ.. పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు షురూ

PM Internship Scheme | టాప్‌-500 కంపెనీల్లో శిక్షణ.. పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు షురూ

యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా చేపట్టిన పీఎం ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తులు మొదలయ్యాయి. ఈ స్కీమ్‌ గురించి కొన్ని విశేషాలు మీ కోసం.. 

Published :13 Oct 2024 16:08 IST

Prime Minister's Internship Scheme | ఇంటర్నెట్ డెస్క్‌: యువతకు నైపుణ్యాలు నేర్పించి.. ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రయోగాత్మకంగా ఇటీవల ప్రారంభించిన పీఎం ఇంటర్న్‌షిప్‌ స్కీమ్‌ (PM Internship Scheme)కు దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది.  ఒక్కొక్కరికి ఏడాదికి రూ.60వేలు స్టైఫండ్‌ చెల్లిస్తూ రాబోయే ఐదేళ్లలో టాప్‌ 500 కంపెనీల్లో కోటి మందికి నైపుణ్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ పథకానికి శ్రీకారం చుట్టింది. 2024-25లో పైలట్ ప్రాజెక్ట్ కింద చేపట్టే ఈ కార్యక్రమానికి రూ.800 కోట్లు ఖర్చుతో డిసెంబర్‌ నుంచి ఇంటర్న్‌షిప్‌ మొదలుపెట్టనుంది. ఇందుకోసం అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థులు www.pmintern ship.mca.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ ఆర్థిక సంవత్సరంలో దాదాపు 1.25 లక్షల మందికి ఇంటర్న్‌షిప్‌ను అందించనున్నారు. 

అక్టోబర్‌ 26న అభ్యర్థుల జాబితా

అక్టోబర్‌ 12న మొదలైన దరఖాస్తుల ప్రక్రియ అక్టోబర్‌ 25 వరకు కొనసాగనుంది.. అభ్యర్థులు తమ పేర్లను పోర్టల్‌లో పేర్లు నమోదు చేసుకోవచ్చు. అక్టోబరు 26న ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తారు. అక్టోబరు 27 నుంచి నవంబరు 7 మధ్య కంపెనీలు అభ్యర్థులను ఎంపిక చేసుకుంటాయి. నవంబరు 8-15 లోగా ఆఫర్లను అంగీకరించాలి. ఒక అభ్యర్థికి మూడు ఆఫర్ల వరకు రావొచ్చు. 

ఇంగ్లిష్‌లో మాట్లాడాలంటే భయమా.. ఈ టిప్స్‌తో ఈజీగా నేర్చుకోవచ్చు!

నెలకు స్టైఫండ్‌ ఎంత?

నెలకు రూ.5,000: నెలవారీగా రూ.5,000 చొప్పున ఏడాది పాటు అభ్యర్థులకు ఆర్థిక సహాయం అందిస్తారు. కంపెనీలో చేరే ముందు ఇచ్చే రూ.6,000 (వన్‌టైం గ్రాంట్‌) కూడా ఉంటుంది. అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఈ పథకంలో స్వచ్ఛందంగా భాగస్వాములయ్యే కంపెనీలు ఏడాది పాటు ఇంటర్న్‌షిప్‌ అందిస్తాయి. ఇందులో కనీసం సగం కాలం తరగతి గదిలో కాకుండా వాస్తవ ఉద్యోగ వాతావరణంలో అభ్యర్థులు గడపాల్సి ఉంటుంది.  ఈ పథకంలో ఏదైనా కంపెనీ/బ్యాంకు/ఆర్థిక సంస్థలు సదరు మంత్రిత్వ శాఖ ఆమోదంతో చేరొచ్చు. 

బీమా సౌకర్యం ఉందా?

ఇంటర్న్‌షిప్‌లో చేరినవారికి వ్యక్తిగత బీమా సౌకర్యం ఉంది. పీఎం జీవన్‌ జ్యోతి బీమా యోజన, పీఎం సురక్షా బీమా యోజన వంటి కేంద్ర ప్రభుత్వ బీమా పథకాల ద్వారా బీమా కల్పిస్తారు. దీనికి కావాల్సిన ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది. 

అర్హులు ఎవరు?

కొన్ని నిబంధనలకు లోబడి 21 నుంచి 24 ఏళ్ల  మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు. ఆన్‌లైన్‌/దూరవిద్య ప్రోగ్రామ్‌లో నమోదు చేసుకున్నవారితో పాటు ఎస్‌ఎస్‌సీ పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం ₹8లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్‌ చేసినవారు.. సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్‌షిప్‌కు అనర్హులు.