GATE 2025 | గేట్ పరీక్ష షెడ్యూల్ ఇదే.. దరఖాస్తులు ఎప్పట్నుంచంటే?
గేట్ 2025 పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరిలో జరిగే ఈ పరీక్షకు సంబంధించి అధికారిక బ్రోచర్‌ను ఐఐటీ రూర్కీ గురువారం విడుదల చేసింది.
Published : 15 August 2024 20:40 IST
https://results.eenadu.net/news.aspx?newsid=150824
GATE 2025| రూర్కీ: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో వచ్చే ఏడాది ప్రవేశాలకు నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (GATE 2025) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 24 నుంచి సెప్టెంబర్ 26వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించన్నట్లు ఐఐటీ రూర్కీ వెల్లడించింది. ఈ మేరకు గురువారం విడుదల చేసిన అధికారిక బ్రోచర్‌లో ఈ వివరాలను పేర్కొంది. ఆలస్య రుసుంతో అక్టోబర్ 7వరకు దరఖాస్తు చేసుకొనే అవకాశం ఉంటుందని తెలిపింది. దరఖాస్తు కోసం మహిళలు/ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులైతే.. ₹900, ఇతర కేటగిరీలు, విదేశీ విద్యార్థులు రూ.1800 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. జనవరి 2న అడ్మిట్ కార్డులను విడుదల చేయనున్నారు.
అన్నింటా మేటి.. ఐఐటీ మద్రాస్ గురించి తెలుసా?
వచ్చే ఏడాది ఫిబ్రవరి 1, 2, 15, 16 తేదీల్లో దేశ వ్యాప్తంగా పలు నగరాల్లో రెండు షిఫ్టుల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నారు. మొత్తం 30 సబ్జెక్ట్‌లకు నిర్వహించే ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష మూడు గంటల పాటు జరగనుంది. తప్పు సమాధానానికి నెగెటివ్ మార్కులు ఉంటాయి. మార్చి 19న ఫలితాలు విడుదల చేస్తారు. మార్చి 28 నుంచి మే 31 వరకు స్కోర్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. అసాధారణ పరిస్థితులు ఏమైనా ఎదురైతే.. ఈ తేదీలు మారే అవకాశం ఉన్నట్లు ఐఐటీ రూర్కీ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమయ్యే GATE 2025 Exam సమాచార బ్రోచర్ కోసం క్లిక్ చేయండి
గేట్ స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాలకు సైతం పరిగణనలోకి తీసుకుంటారు. బీటెక్ విద్యార్థులు మూడో సంవత్సరం చదువుతున్న వారూ దరఖాస్తు చేసుకోవచ్చు. చివరి సంవత్సరం చదువుతున్న డిగ్రీ విద్యార్థులూ (బీఏ, బీకాం, బీఎస్‌సీ) పోటీ పడవచ్చు. ఐఐటీలు గేట్ స్కోర్‌తో నేరుగా పీహెచ్‌డీలో కూడా ప్రవేశాలు ఇస్తున్నాయి.