Young India Skills University | తెలంగాణ స్కిల్స్ యూనివర్సిటీలో కోర్సులు ఇవే.. దరఖాస్తు చేసుకోండిలా..!
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్‌ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు అక్టోబర్ 29లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
Published :12 Sep 2024 17:29 IST
https://results.eenadu.net/news.aspx?newsid=121024
Young India Skills University | ఇంటర్నెట్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చేసిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (Young India Skills university)లో ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన యువకులు అక్టోబర్ 29లోగా ఆన్‌లైన్‌లో అప్లయ్ చేసుకోవచ్చు. తొలి విడతలో భాగంగా ప్రాథమికంగా మూడు స్కూల్స్‌ను, వాటిలో నాలుగు కోర్సులను ప్రారంభించిన విషయం తెలిసిందే. లాజిస్టిక్స్ అండ్ ఈ-కామర్స్, హెల్త్‌కేర్, స్కూల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్‌ను ఈ ఏడాది నుంచే ప్రారంభిస్తున్నారు. లాజిస్టిక్స్ అండ్ ఈ -కామర్స్ స్కూల్ కింద వేర్‌హౌస్ ఎగ్జిక్యూటివ్, కీ కన్‌జైనర్ ఎగ్జిక్యూటివ్ కోర్సులు, హెల్త్‌కేర్‌లో భాగంగా ఫినిషింగ్ స్కిల్స్ ఇన్ నర్సింగ్ ఎక్సలెన్స్, ఫార్మాస్యూటికల్స్ అండ్ లైఫ్ సైన్సెస్ కింద ఫార్మా అసోసియేట్ ప్రోగ్రామ్ కోర్సుల్లో చేరాలనుకొనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ https://yisu.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
చదవడానికి ఏ టైం బెటర్.. ఉదయమా? రాత్రా?
నవంబర్ నుంచి శిక్షణ
ఎంపికైన అభ్యర్థులకు నవంబరు 4 నుంచి శిక్షణ ప్రారంభం కానుంది. తరగతులను తాత్కాలికంగా హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ప్రాంగణాల్లో నిర్వహిస్తారు.
దరఖాస్తులో ఏయే వివరాలు ఇవ్వాలంటే..?
దరఖాస్తు చేసేందుకు ఆధార్ కార్డులో పేర్కొన్నట్లుగా మీరు పేరు, తండ్రి పేరుతో పాటు ఫోన్ నంబర్, వాట్సప్ నంబర్, ఈ- మెయిల్ ఐడీ, పుట్టిన తేదీ వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే, మీ రాష్ట్రం, జిల్లా, అడ్రస్, పిన్ కోడ్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ (ఇంటర్, బీఏ/బీకామ్/బీఎస్సీ, బీబీఏ, ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, డిప్లొమా, తదితర విద్యార్హతలు)తో పాటు మీరు చదివే కళాశాల పేరు, ఏ సంవత్సరంలో పాసవుట్ అయ్యారు, కాలేజీలో మీ స్పెషలైజేషన్, పర్సంటేజీ, స్కిల్ వర్సిటీ అందిస్తోన్న ఏ కోర్సుపై ఆసక్తి ఉంది? తదితర వివరాలను పొందుపరిచి సబ్‌మిట్ చేయాల్సి ఉంటుంది.