JEE Main 2025 | జేఈఈ మెయిన్ (సెషన్-2) పరీక్ష తేదీలివే.. ఎన్‌టీఏ ప్రకటన
జేఈఈ (మెయిన్) సెషన్ -2 పరీక్షలను ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ తెలిపింది.
By Education News Team
Published :10 Mar 2025 18:45 IST
https://results.eenadu.net/news.aspx?newsid=10032025-jee-main-2025
ఇంటర్నెట్ డెస్క్: జేఈఈ మెయిన్ (JEE Main 2025)సెషన్- 2 పరీక్షకు సంబంధించి ఎన్‌టీఏ(NTA) కీలక అప్‌డేట్ ఇచ్చింది. JEE Main 2025 నోటిఫికేషన్ విడుదల సమయంలో ఏప్రిల్ మొదటి వారంలో ఈ పరీక్ష నిర్వహిస్తామన్న అధికారులు తాజాగా పూర్తి స్థాయి షెడ్యూల్‌ను ప్రకటించారు. జేఈఈ (మెయిన్) సెషన్ -2 పరీక్షలు ఏప్రిల్ 2, 3, 4, 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్నట్లు స్పష్టం చేసింది.
జేఈఈ మెయిన్ పరీక్షలను ఏటా రెండు విడతల్లో నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తొలి విడత పరీక్ష పూర్తి చేసి ఫలితాలను వెల్లడించగా.. తాజాగా రెండో సెషన్ పరీక్ష నిర్వహణకు ఎన్‌టీఏ ఏర్పాట్లు చేస్తోంది. పేపర్ -1 (బీఈ/బీటెక్) పరీక్ష.. ఏప్రిల్ 2,3,4,7 తేదీల్లో రెండు షిఫ్టుల్లో; 8వ తేదీన మొదటి షిఫ్టులో జరగనుంది. అలాగే, ఏప్రిల్ 9న పేపర్ 2ఏ (బీఆర్క్), పేపర్-2బి (బి.ప్లానింగ్, పేపర్ 2ఎ, బి(బీఆర్క్, బి.ప్లానింగ్) పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు నిర్వహిస్తారు.
ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు మొదటి షిఫ్టు పరీక్ష.. మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు రెండో షిఫ్టు పరీక్ష ఉంటుంది. దేశవ్యాప్తంగా పలు నగరాలతో పాటు విదేశాల్లోని 15 నగరాల్లో జేఈఈ మెయిన్ నిర్వహించేందుకు ఎన్‌టీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. త్వరలోనే సిటీ ఇంటిమేషన్ స్లిప్పులు, అడ్మిట్ కార్డులు విడుదల చేయనున్నారు.