LIC Bima sakhi | ‘పది’ పాసైన మహిళలకు సువర్ణావకాశం.. ‘బీమా సఖి’ గురించి తెలుసా?

LIC Bima sakhi | ‘పది’ పాసైన మహిళలకు సువర్ణావకాశం.. ‘బీమా సఖి’ గురించి తెలుసా?

మహిళలకు ఉపాధి కల్పించి.. ఆర్థిక సాధికారత సాధించేలా కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ ద్వారా సువర్ణావకాశం కల్పిస్తోంది.

Eenadu icon
By Education News Team Published :09 Dec 2024 17:02 IST

LIC Bima sakhi Recruitment| ఇంటర్నెట్ డెస్క్‌: మహిళలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఎల్‌ఐసీ (LIC) ద్వారా సరికొత్త స్కీమ్‌ను ప్రారంభించింది. ఎల్‌ఐసీ సంస్థలో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంతో పాటు అర్హులైన వారికి ఆర్థిక భరోసా కల్పించేలా ‘బీమా సఖి యోజన’ (Bima Sakhi Yojana) పేరిట సరికొత్త పథకాన్ని ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) హరియాణాలోని పానిపత్‌లో ప్రారంభించారు. మహిళలకు మాత్రమే ప్రత్యేకంగా ప్రారంభించిన ఈ పథకంలో చేరే వారు ఎల్‌ఐసీలో మహిళా కెరీర్‌ ఏజెంట్లు (Mahila Career Agents)గా పనిచేసే అవకాశం పొందొచ్చు. ఈ పథకంలో చేరేందుకు అర్హతలేంటీ? స్టైఫండ్‌, ఇతర ప్రయోజనాలేంటో పరిశీలిస్తే..

ఎవరు అర్హులు?

ఈ పథకం కింద మహిళా కెరీర్‌ ఏజెంట్లుగా చేరాలనుకొనే వారి కనీస వయసు 18 ఏళ్లు, గరిష్ఠంగా 70 ఏళ్లు ఉండాలి. ‘బీమా సఖి’లో చేరేందుకు కనీస విద్యార్హత పదో తరగతి. ఈ స్కీమ్‌ కింద మహిళలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. మొదటి మూడేళ్ల పాటు ప్రతి నెలా స్టైఫండ్‌తో పాటు బోనస్‌ కమీషను సైతం అందిస్తారు. కాకపోతే, మహిళా కెరీర్‌ ఏజెంట్లు తమకు ఇచ్చిన టార్గెట్‌లను పూర్తి చేయాల్సి ఉంటుంది. 

స్టైఫండ్‌ ఎంత? 

మహిళా కెరీర్‌ ఏజెంట్లకు బోనస్‌ కాకుండా ఏడాదికి రూ.48వేలు చొప్పున కమీషన్‌ అందజేస్తారు.  స్టైఫండ్‌ విషయానికి వస్తే..  తొలి ఏడాదిలో నెలకు రూ.7వేలు; రెండో ఏడాదిలో రూ.6వేలు, మూడో ఏడాది రూ.5వేలు చొప్పున చెల్లిస్తారు. ఇందుకు పాలసీలు చేయడంలో ఏటా ఇచ్చిన  టార్గెట్‌లో కనీసం 65శాతం పూర్తిచేయడం తప్పనిసరి. 

నిబంధనలు ఇవే..

  • Mahila Career Agentsగా రిక్రూట్‌ అయ్యేవారిని ఎల్‌ఐసీ ఉద్యోగిగా పరిగణించరు.
  • మహిళా కెరీర్‌ ఏజెంట్ల పనితీరు ఆధారంగా స్టైఫండ్‌ కొనసాగింపు ఉంటుంది.
  • ప్రస్తుతం ఎల్‌ఐసీ ఏజెంట్లుగా, ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి కుటుంబ సభ్యులు అనర్హులు.
  • ఎల్‌ఐసీలో పదవీ విరమణ చేసిన ఉద్యోగి లేదా మళ్లీ చేరాలని కోరుకొనే మాజీ ఏజెంట్‌కు ఈ పథకం కింద ఏజెన్సీ మంజూరు చేయరు.
  • ప్రస్తుతం ఏజెంట్లుగా ఉన్నవారూ ఎంసీఏగా నియామకానికి దరఖాస్తు చేసుకోలేరు.

దరఖాస్తు ఇలా.. ఏయే డాక్యుమెంట్లు కావాలి?

  • ఏజెంట్‌గా దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థుల పాస్‌పోర్టు సైజ్‌ ఫొటోను దరఖాస్తు ఫారంతో పాటు అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది.
  • వయసు, అడ్రస్‌, విద్యార్హతలను ధ్రువీకరించేలా సెల్ఫ్‌ అటెస్టేషన్‌ కాపీని సమర్పించాలి. 
  • అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు. 

దరఖాస్తుల కోసం క్లిక్‌ చేయండి