NEET UG 2025 Preparation Tips | నీట్ 2025 తుది ప్రిపరేషన్ ప్లాన్ ఎలా? నిపుణుల టిప్స్ ఇవిగో!
దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష (NEET UG 2025) పరీక్షకు సమయం దగ్గరపడుతోన్న వేళ.. ఉత్తమ స్కోరుకు నిపుణుల చిట్కాలివే..
By Education News Team
Published :09 Apr 2025 17:18 IST
https://results.eenadu.net/news.aspx?newsid=09042025-neet-ug-2025-preparation-tips
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ (యూజీ) పరీక్ష (NEET UG 2025) పరీక్షకు సమయం దగ్గరపడుతోంది. మే 4న జరగనున్న ఈ పరీక్ష కోసం విద్యార్థులు ప్రిపరేషన్‌లో తలమునకలై ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే ఇంటర్ పరీక్షలు పూర్తికావడంతో విద్యార్థులు తమ పూర్తి ఫోకస్‌ని నీట్ తుది సన్నద్ధతపైనే ఉంచారు. నీట్‌లో ఉత్తమ స్కోరు సాధించేందుకు ఉన్నకొద్దిపాటి సమయంలోనే సమర్థంగా ప్రిపరేషన్ ఉండాలంటే ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి? పరీక్ష సమయంలో ఒత్తిడికి గురికాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో నిపుణులు సూచిస్తున్న టిప్స్ మీ కోసం..
ప్రాక్టీస్‌తో సిలబస్‌పై పట్టు..
ఏ పోటీ పరీక్షకైనా ముందుగా సిలబస్ ఏంటో తెలుసుకోవడం, దానిపై అవగాహన పెంచుకోవడమే కీలకం. లేదంటే గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంటుంది. నీట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి గనక.. వీటిలో ఏది కష్టమో దానికి ఎక్కువ టైం కేటాయించి ప్రాక్టీసును పెంచండి. చాప్టర్ల వారీగా ప్రతిరోజూ కనీసం 10శాతం మేర సిలబస్ కవర్ అయ్యేలా సన్నద్ధత కొనసాగించండి. ఫిజిక్స్, కెమిస్ట్రీలలో అంకెలు, ఫార్ములాలను గుర్తుపెట్టుకొనేందుకు మైండ్‌మ్యాప్‌లు, ఫ్లాష్ కార్డుల్ని వినియోగించడం ఉత్తమం. స్థిరమైన ప్రాక్టీసుతోనే సబ్జెక్టుపై పట్టు పెరుగుతుంది.
పాత ప్రశ్నాపత్రాల విశ్లేషణ
నీట్‌కు సంబంధించిన గత పదేళ్ల ప్రశ్నపత్రాలను సేకరించండి. చాప్టర్ల వారీగా ఎలాంటి ప్రశ్నలు అడిగారో పరిశీలించండి. తద్వారా తరచూ ప్రశ్నలు అడిగిన టాపిక్స్ ఏంటో తెలుసుకొని.. అందుకనుగుణంగా మీ రివిజన్ కొనసాగించండి. తుది దశ ప్రిపరేషన్‌లో ఇవి మరింతగా ఉపయోగపడతాయి. గతేడాది నీట్ పరీక్ష ప్రశ్నపత్రాలను ట్రై చేయడం, నోట్స్ తీసుకోవడం వల్ల ఎంతో మేలుంటుంది.
టైం మేనేజ్‌మెంట్.. పొమడోరో టెక్నిక్
పరీక్షకు ఇంకా తక్కువ సమయమే మిగిలి ఉండటంతో సిలబస్ రివిజన్‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకోండి. ఉన్న సమయాన్ని సమర్థంగా ఉపయోగించాలంటే.. ముందుగా అధిక వెయిటేజీ ఉన్న సబ్జెక్టులపై ఫోకస్ పెట్టండి. ఈ సన్నద్ధతలో సమయపాలన(Time Management) అత్యంత కీలకం. పొమడోరో టెక్నిక్స్ (ఏమిటీ పొమడోరో టెక్నిక్?) విద్యార్థుల ఏకాగ్రతను పెంచడంతో పాటు రివిజన్ చేసే అంశాలు గుర్తుండేలా మేలుచేస్తాయి.
కొత్త టాపిక్స్ జోలికి వెళ్లొద్దు..
చివరి దశ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు కొత్త అంశాలపై దృష్టిపెట్టడం కన్నా ఇప్పటికే నేర్చుకున్న కాన్సెప్టుల్ని రివిజన్ చేయడం ఉత్తమం. ఈ సమయంలో కొత్త వాటిని చదవడం వల్ల గందరగోళానికి గురయ్యే అవకాశం ఉటుంది. ఆయా సబ్జెక్టులకు సంబంధించి ప్రాక్టీస్ పేపర్లను పరిష్కరించే సమయంలో ఏయే తప్పులు చేస్తున్నారో జాగ్రత్తగా రాసుకోండి. అలాంటివి మళ్లీ పునరావృతం కాకుండా ప్రిపరేషన్ సమయంలోనే ఒకసారి సమీక్షించుకుంటే మంచిది.
మాక్ టెస్టులూ కీలకమే..
మాక్ టెస్టులు.. ప్రిపరేషన్‌లో ఎంతో కీలక సాధనంగా ఉపయోగపడతాయి. పరీక్ష మోడల్ తెలియడంతో పాటు మీలో కచ్చితత్వం, వేగాన్ని పెంచే సాధనాలుగా పనికొస్తాయి. అందువల్ల ప్రతిరోజూ మాక్ టెస్టులు రాయడం ఇప్పటి నుంచైనా అలవాటు చేసుకోండి. ఉదయం పూట రివిజన్ పెట్టుకొని.. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య కాలంలో మాక్‌టెస్టులు ప్రయత్నించండి. నీట్ పరీక్ష సమయం కూడా ఇదే కావడం వల్ల మీరు కంఫర్ట్‌గా రాసేందుకు మీ మనస్సు అలవాటుపడుతుంది. తద్వారా పరీక్షపై భయం తగ్గడంతో పాటు మీకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పరీక్షకు వారం రోజుల ముందు మాత్రం మాక్ టెస్టులకు దూరంగా ఉండడం ఉత్తమం.
- ఈ కొద్ది రోజుల సమయంలో కనీసం 10 మాక్ టెస్టులైనా సాధన చేసేలా చూసుకోండి. ప్రతి మాక్ టెస్టులో ఒక్కో సబ్జెక్టుకూ ఎంత సమయం వెచ్చించాల్సి వస్తోంది? ఎన్ని సరైన సమాధానాలు, ఎన్ని తప్పు సమాధానాలు గుర్తించారో ఒక పేపర్‌పై రాసుకోండి. ఈ సమాచారం తర్వాత రాసే మాక్ టెస్టును మెరుగ్గా, మరింత నేర్పుతో రాసేందుకు దోహదపడుతుంది.
- ప్రతి మాక్ టెస్టులోనూ ఏ తరహా పొరపాట్లు చేస్తున్నారో గమనించండి. ఉదాహరణకు.. ప్రశ్నలోని సమాచారం సరిగా గమనించకపోవడం, ఆప్షన్లను పట్టించుకోకపోవడం, కొన్ని సందర్భాల్లో ఇచ్చిన స్టేట్‌మెంట్ల నుంచి సరైన దానికి బదులుగా తప్పుగా ఉన్న స్టేట్‌మెంట్ గుర్తించాలని అడిగితే తొందరలో సరైన స్టేట్‌మెంట్‌ను గుర్తించడం వంటి పొరపాట్లు చేయొద్దు.
- ఎన్‌సీఈఆర్‌టీ పాఠ్యాంశాలపై పూర్తిగా పట్టు సాధిస్తేనే నీట్- 2025లో గరిష్ఠ మార్కులతో మంచి ర్యాంకు తెచ్చుకునే అవకాశం ఉంటుంది.
- పరీక్ష కేంద్రానికి ఆందోళనతో వెళ్లొద్దు. అతిగా ఆలోచించి మీ మానసిక ప్రశాంతతను పాడుచేసుకోవద్దు.
- రిలాక్స్‌గా ఉంటూనే మీరు చేయాల్సిన పనులతో పాటు రివిజన్‌ను ఒత్తిడి లేకుండా పూర్తి చేయండి.
- పరీక్ష రోజుకు ఏమేం కావాలో ముందే సిద్ధం చేసుకోండి. ఆఖరి నిమిషంలో హడావుడి పడి అనవసర ఇబ్బందులకు అవకాశం ఇవ్వొద్దు.
- పరీక్షల సమయంలో కొందరు టెన్షన్‌తో సరిగా తినరు. నిద్రపోరు. అలాంటి పనులు మీ ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపిస్తాయి. తగిన నిద్ర ఉండేలా టైమ్‌టేబుల్ సిద్ధం చేసుకోండి.
- కాసేపు రిలాక్స్ అయ్యేందుకు టీవీ, ఫోన్, సోషల్ మీడియా జోలికి అస్సలు వెళ్లకండి. అటువైపు వెళ్లారంటే మీకు తెలియకుండానే విలువైన టైం వృథా అయిపోతుంది. ప్రిపరేషన్ సమయంలో మీ ధ్యాసంతా పరీక్షలపైనే ఉండేలా చూసుకోండి. ఆల్ ద బెస్ట్!