Job Skills | 2025లో జాబ్ కొట్టాలంటే.. మీ రెజ్యూమ్‌లో ఈ స్కిల్స్ చేరాల్సిందే!
వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఐటీ రంగంలో భారీగా ఉద్యోగావకాశాలు వచ్చే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ తరుణంలో జాబ్ మార్కెట్‌కు అవసరమైన స్కిల్స్‌తో సంసిద్ధంగా ఉండటం తక్షణావసరం. కంపెనీలను ఆకట్టుకొనేలా మీ రెజ్యుమ్‌లో చేర్చాల్సిన కొన్ని స్కిల్స్ ఇవిగో!
By Education News Team
Published :13 Mar 2025 16:30 IST
https://results.eenadu.net/news.aspx?newsid=13032025-job-skills
New Skills in Job Market | ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఆర్థిక ఏడాదిలో ఐటీ రంగం(IT Sector)లో భారీగా ప్లేస్‌మెంట్స్(Placements) జరిగే అవకాశం ఉన్నట్లు పలు నివేదికలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎప్పటికప్పుడు మారుతోన్న జాబ్ మార్కెట్లో పరిస్థితులకనుగుణంగా మిమ్మల్ని మీరు అప్‌డేట్ చేసుకోవడం అత్యంత అవసరం. ఉద్యోగాలిచ్చే కంపెనీలు ప్రస్తుతం కేవలం విద్యార్హతల్నే కాదు.. సాంకేతిక నైపుణ్యాలున్నాయో, లేదో కూడా చూస్తున్నాయి. మరీ ముఖ్యంగా విధి నిర్వహణ సమయంలో ఉండాల్సిన స్వాభావికపరమైన స్కిల్స్‌నూ పరీక్షిస్తున్నాయి. అందువల్ల ఏ రంగంలోనైనా ఉద్యోగావకాశాల్ని అందిపుచ్చుకొనేందుకు ఇప్పట్నుంచే పూర్తిస్థాయి సన్నద్ధత అవసరం. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా కంపెనీల దృష్టిని మీవైపు ఆకర్షించేలా మీ రెజ్యుమ్‌లో చేర్చాల్సిన కొన్ని స్కిల్స్ ఇవిగో!
ఫ్రెషర్లకు గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది ఐటీలో నియామకాలు డబుల్!
- సాంకేతిక నైపుణ్యాలు ఉన్నాయా?: ఐటీ రంగంలో ఈ ఆర్థిక సంవత్సరంలో ఫ్రెషర్ల నియామకాలు పెరగనున్నట్లు టీమ్‌లిజ్ వంటి సంస్థలు అంచనా వేస్తున్నాయి. అందువల్ల, మార్కెట్ ట్రెండ్‌కు అనుగుణంగా ఉద్యోగార్థులు సాంకేతిక నైపుణ్యాలతో రెడీగా ఉండటం అత్యంత కీలకమైన అంశం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్‌డేటా, ఫిన్‌టెక్, మెషిన్ లెర్నింగ్, సాఫ్ట్‌వేర్ అండ్ అప్లికేషన్ డెవలప్‌మెంట్ వంటి కోర్సులనూ నేర్చుకుంటే రాబోయే కాలంలో మీ కెరీర్‌కు తిరుగుండదు. దీంతో పాటు చలాకీతనం, మార్పులకనుగుణంగా సంసిద్ధమయ్యే స్వభావం అలవర్చుకోవాలి. టెక్నాలజీ, వాణిజ్య రంగాల్లో శరవేగంగా వస్తోన్న మార్పుల్ని తట్టుకొనేందుకు ఈ నైపుణ్యం చాలా అవసరం.
- నిత్య విద్యార్థిగా ఉంటారా?: ఉన్నత విద్య పూర్తవ్వగానే జాబ్ వచ్చేస్తుందనుకొనే రోజులకు కాలం చెల్లింది. తగిన నైపుణ్యాల్లేకపోతే ఏళ్ల తరబడి చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం ఉండదు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటేనే ఏ రంగంలోనైనా నిలదొక్కుకోగలం. అందుకు నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. కొత్త విషయాలను నేర్చుకుంటూనే నిత్యనూతనత్వంతో ఉంటేనే కెరీర్‌లో ఉన్నత శిఖరాల్ని చేరుకోగలరు. వినూత్నంగా ఆలోచించే నైపుణ్యంతో కొత్త ఆవిష్కరణలు, సమస్య పరిష్కారంలో చురుగ్గా ఉంటూ పనిచేసే రంగంలో వృద్ధిని సాధించగలరు.
- విశ్లేషించే సామర్థ్యం మీకుందా?: విశ్లేషణతో కూడిన ఆలోచనా ధోరణి ఉంటే కంపెనీల్లో ఎదురయ్యే క్లిష్టమైన సమస్యల్ని పరిష్కరించగలరు. డేటా ఆధారిత నిర్ణయాలను సమర్థంగా తీసుకోగలరు. దీనికితోడు ప్రపంచంలో వస్తోన్న పోకడలకనుగుణంగా కొత్త విషయాలు నేర్చుకోవాలన్న ఉత్సుకత ఉండాలి. నిత్యనూతనంగా ఉంటూ, కొత్తగా ఆలోచించే నైపుణ్యాలున్నవారికే కంపెనీలు ఉద్యోగాల్లో పెద్దపీట వేస్తున్నాయి. అలాంటి మానవ వనరులకే ఎప్పుడైనా గిరాకీ ఉంటుంది. అందుకే మీ రెజ్యూమ్‌లో ఈ నైపుణ్యాల్ని జోడించండి.
- టీమ్‌ను నడిపించగలరా?: లైఫ్‌లో గెలవాలనే కదా అందరూ అనుకుంటారు. కానీ, అనుకున్న కలల్ని కొందరు మాత్రమే నిజం చేసుకోగలుగుతారు. మీ అభిప్రాయాన్ని ఎవరైనా తిరస్కరిస్తే వారిపట్ల కోపం/పగతో రగిలిపోతే కెరీర్‌లో ఎదగలేరు. మీ అభిప్రాయంతో ఏకీభవించనివారిపట్ల కోపం/ప్రతీకారేచ్ఛతో ఉంటే టీమ్‌ను ముందుకు నడిపించలేరు. నలుగురితో కలుపుగోలుగా వ్యవహరించే ధోరణి పెంపొందించుకుంటేనే టీమ్ లీడర్‌గా ఎదిగే ఛాన్స్ ఉంటుంది. నాయకత్వ పటిమ, సామాజిక పరిస్థితులను అంచనా వేసుకొని ముందుకు సాగగలిగే చొరవ ఉంటే మీరు టీమ్‌కు స్ఫూర్తిగా నిలవగలరు. వర్క్‌ప్లేస్‌లో సానుకూల దృక్పథాన్ని పెంపొందించడం ద్వారా సంస్థాగత విజయంలోనూ కీలక పాత్ర పోషించగలరు.
- అవకాశాల్ని అందిపుచ్చుకొనే లక్షణం ఉందా?: కెరీర్‌లో ఉన్నతస్థాయికి ఎదగాలనే కోరిక ఉంటే సరిపోదు. అందుకు కసి, నిరంతర పరిశ్రమతోడైతేనే సాధ్యం. చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని అధిగమించే తత్వాన్ని అలవర్చుకోండి. జీవితంలో ఎదగాలనే కోరికతో పాటు పట్టుదల, ఓపిక, పోటీతత్వం, కొత్త అవకాశాలను అందిపుచ్చుకొనే గుణాన్ని పెంపొందించుకోవాలి. ప్రేరణ, స్వీయ అవగాహన వంటివి వ్యక్తిగత మెరుగుదలకే కాదు.. అనుకున్నలక్ష్యాల్ని అందుకోవడంలో, మీ పనితీరును మెరుగుపరుచుకోవడంలోనూ ఉపయోగపడతాయి.
- వేరే కోణంలో ఆలోచిస్తారా?: ఏ విషయాన్నయినా సరే.. క్రిటికల్‌గా ఆలోచించాలి. తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్లన్నట్టుగా వ్యవహరిస్తే కెరీర్‌లో రాణించలేరు. ఏదైనా ఒక సమస్య ఎదురైనప్పుడు కేవలం మీ దృష్టితోనే కాకుండా అవతలి వారి దృష్టితోనూ ఆలోచించే గుణాన్ని అలవర్చుకోవాలి. అప్పుడే, సమస్య పరిష్కారం దిశగా ఆలోచించే సామర్థ్యం మీకు అలవడుతుంది. పోటీ ప్రపంచంలో కస్టమర్ల అంచనాలను, సంతృప్తి స్థాయిలను పెంచాలంటే సేవా దృక్పథమూ అత్యంత విలువైనది.