College Life | కాలేజీలో నలుగురితో సరదాగా కలిసిపోవాలంటే..

College Life: కాలేజీలో నలుగురితో సరదాగా కలిసిపోవాలంటే..

కాలేజీలో కొత్తగా చేరేటప్పుడు బెరుకుతనం ఆవరిస్తుంది. దాన్నుంచి బయటపడి నలుగురితో కలిసి హాయిగా సాగిపోవాలంటే చిట్కాలివిగో..!

Published : 05 July 2024 07:00 IST

College Life | కాలేజీలు (Colleges) మొదలయ్యాయ్‌.. కొత్తగా చేరినప్పుడు కాస్త బెరుగ్గా ఉంటుంది. స్నేహితుల (Friends) సంగతి అటుంచి.. పరిచితులు కూడా చుట్టు పక్కల ఎక్కడా కనిపించక ఒంటరితనం ఆవరిస్తుంది. నలుగురితోనూ కలిసిపోవడం ఎలాగో తెలుసుకుంటే అంతగా ఇబ్బంది పడాల్సిన అవసరమే ఉండదు.

రిషి ఇంజినీరింగ్‌ కాలేజీలో కొత్తగా చేరబోతున్నాడు. మొహమాటం వల్ల నలుగురితోనూ కలవలేక.. అలాగని ఒంటరిగానూ ఉండలేని స్వభావం అతనిది. ఎంబీఏలో చేరిన సమన్విత పరిస్థితీ ఇలాగే ఉంది. తెలిసినవాళ్లూ, స్నేహితులూ లేకుండా కోర్సును కొనసాగించగలనా లేదా అని ఆలోచిస్తోంది. ఇలాంటి పరిస్థితిని అధిగమించాలంటే ఏం చేయాలో చూద్దాం!

చదవడానికి టైం చాలట్లేదా? ఇలా ట్రైచేసి చూడండి!

  • తోటి విద్యార్థులను పరిచయం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా కూర్చోకుండా క్యాంపస్‌లో జరిగే వివిధ కార్యక్రమాలకు హాజరవుతుండాలి. అవి ఫ్రెషర్స్‌ పార్టీ లేదా గెస్ట్‌ లెక్చర్‌ లాంటివి ఏవైనా కావొచ్చు.
  • కొన్ని ప్రత్యేక వేడుకల్లో భాగంగా కాలేజీలో సాంస్కృతిక కార్యక్రమాలూ జరుగుతుంటాయి. వీటిల్లో పాల్గొనడం ద్వారానూ నలుగురితో పరిచయం పెంచుకోవచ్చు.
  • సేవా కార్యక్రమాల్లో స్వచ్ఛందంగా పాల్గొనడం వల్ల కూడా పరిచయాలు పెరుగుతాయి. మొక్కలు నాటడం, పరిసరాలను శుభ్రం చేయడం, ఆరోగ్య శిబిరాలు ఏర్పాటుచేయడం లాంటివి క్యాంపస్‌లో జరుగుతుంటాయి. వీటిల్లో ఉత్సాహంగా పాల్గొంటే నలుగురితో కలిసి పనిచేయొచ్చు.
  • పుస్తకాలు చదివే అలవాటు ఉంటే తరగతులు పూర్తయిన తర్వాత లైబ్రరీకి వెళ్లొచ్చు. సబ్జెక్టుపరమైనవే కాకుండా.. ఆసక్తిని బట్టి వివిధ పుస్తకాలూ చదవొచ్చు. వాటిపైన మీ ఆలోచనలు, అభిప్రాయాలను ఇతరులతో పంచుకోవచ్చు కూడా.
  • స్కూల్లో చదివే రోజుల్లో మీరు ఛాంపియన్‌ అనుకోండి. ఆటస్థలమే పరిచయ వేదికగా మారిపోతుంది. కొత్తగా ఇతర కార్యక్రమాలు, వేడుకల కోసం ఎదురుచూడాల్సిన అవసరమే ఉండదు. నలుగురితో కలిసి ఆడే ఆటలు కొత్త పరిచయాలు, స్నేహాలకు మార్గం చూపుతాయి. అలాగే తెల్లవారుజామునే లేచి వ్యాయామాలు చేయడం వల్ల ఆరోగ్య స్పృహ ఉన్నవారితో పరిచయం ఏర్పడుతుంది.
  • క్యాంటీన్‌లో ఏదో ఒక మూల కూర్చుని భోజనం ముగించేయకుండా కొత్తవాళ్ల పక్కన కూర్చోవచ్చు. మెల్లగా మాటలూ కలపొచ్చు. ఈ పరిచయం ఆ తర్వాత చక్కని స్నేహంగానూ మారే అవకాశం లేకపోలేదు.
  • ‘నేను చిన్నప్పటి నుంచీ ఇంతే.. ఎవరితోనూ కలవలేను. కొత్తవాళ్లను చూస్తే కంగారుగా ఉంటుంది. నోట్లోంచి మాట రాదు’ అని ఆలోచిస్తూ కూర్చుంటే రోజులు అలాగే గడిచిపోతాయి. ఇక ఎప్పటికీ ఎవరితో స్వేచ్ఛగా ఉండలేరు. నలుగురిలో ఉన్నప్పుడు బెరుగ్గా.. అక్కడి నుంచి ఎప్పుడు బైటపడతామా అన్నట్టుగా కాకుండా. నవ్వుతూ పలకరించడం అలవాటు చేసుకుంటే పరిచయాలు అవే పెరుగుతాయి.
  • నిజానికి మనసుంటే మార్గాలెన్నో.. సానుకూల ఆలోచనలతో.. నలుగురితో కలిసే ఏ అవకాశాన్నీ వదులుకోకుండా ముందుకు సాగిపోవడమే మంచిది.