IIT Bombay Placements | ఐఐటీ బాంబే: 1,475 మందికి జాబ్‌ ఆఫర్లు.. 22 మందికి ₹కోటికి పైనే ప్యాకేజీ

IIT Bombay Placements | ఐఐటీ బాంబే: 1,475 మందికి జాబ్‌ ఆఫర్లు.. 22 మందికి ₹కోటికి పైనే ప్యాకేజీ

ఐఐటీ బాంబేలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు జాక్‌పాట్ కొట్టారు. 22 మంది రూ.కోటికి పైనే వార్షిక వేతనాలతో ఉద్యోగాలకు ఎంపికయ్యారు.

Published :03 Sep 2024 16:42 IST

IIT Bombay Placements | ముంబయి: దేశంలో ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ- బాంబే (IIT Bombay)లో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్లేస్‌మెంట్స్‌ నివేదిక విడుదలైంది. పలు జాతీయ, అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోసం మొత్తం 2,414 మంది విద్యార్థులు రిజిస్టర్‌ చేసుకోగా.. 1,979 మంది మాత్రమే ఈ ప్రక్రియలో క్రియాశీలంగా పాల్గొన్నారు. వీరిలో 1,475మంది ఆఫర్లను అంగీకరించినట్లు IIT Bombay వెల్లడించింది. విద్యార్థుల సగటు వార్షిక వేతనం రూ.23.50లక్షలు కాగా.. మధ్యస్థ వేతనం రూ.17.92లక్షలుగా ఉందని తెలిపింది. వీరిలో 22మంది విద్యార్థులు రూ.కోటి, అంతకుమించి వార్షిక వేతన ప్యాకేజీలతో ఉద్యోగాలకు అంగీకరించగా.. 78 మంది విదేశాల్లో ఉద్యోగ ఆఫర్లు పొందారని వెల్లడించింది. దాదాపు 364 కంపెనీలు 1,650 ఉద్యోగాలను ఆఫర్‌ చేయగా.. ఇంజినీరింగ్ అండ్‌ టెక్నాలజీ విభాగంలోనే భారీగా జాబ్‌ ఆఫర్లు (Job Offers) వచ్చినట్లు తెలిపింది.

జాబ్‌ మార్కెట్‌ను శాసించబోయే టాప్‌-15 AI స్కిల్స్‌ ఇవే..!

ఈ కోర్సుల్లోనే భారీగా జాబ్‌ ఆఫర్లు! 

కోర్సుల పరంగా వచ్చిన ఉద్యోగ ఆఫర్లను పరిశీలిస్తే.. బీటెక్‌లో ప్లేస్‌మెంట్స్‌ 83.39% ఉండగా.. ఎంటెక్‌ 83.5%, ఎంఎస్‌ రీసెర్చ్‌ 93.33%, డ్యూయల్‌ డిగ్రీ (బీటెక్‌ అండ్‌ ఎంటెక్‌) 79.16%, ఎమ్మెస్సీ 55.06% చొప్పున ఉన్నట్లు ఐఐటీ బాంబే పేర్కొంది. అలాగే, అత్యధికంగా 232 ఉద్యోగ ఆఫర్లతో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగం అగ్రస్థానంలో నిలవగా.. 230 ఉద్యోగ ఆఫర్లతో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్‌ విభాగం, 229 ఆఫర్లతో మెకానికల్ ఇంజినీరింగ్ రెండు, మూడో స్థానాల్లో నిలిచాయని తెలిపింది. జపాన్‌, తైవాన్‌, యూరప్‌, యూఏఈ, సింగపూర్‌, అమెరికా, నెదర్లాండ్స్‌, హాంకాంగ్‌ వంటి దేశాల్లో 78 మందికి ఉద్యోగ ఆఫర్లు వచ్చినట్లు పేర్కొంది. గతేడాది (65)తో పోలిస్తే ఈ సంఖ్య పెరిగినట్లు తెలిపింది. ఈ సెషన్‌లో కోర్ ఇంజినీరింగ్‌, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్, కన్సల్టింగ్, ఫైనాన్స్, బ్యాంకింగ్, హై-ఎండ్ టెక్నాలజీ, టెక్నికల్ సర్వీసెస్ వంటి బహుళ రంగాల నుంచి ఉద్యోగ ఆఫర్లు వచ్చాయని నివేదికలో తెలిపింది. 

ఈ 21 యూనివర్సిటీలు ఫేక్‌.. అవి ఇచ్చే డిగ్రీలు చెల్లవ్‌!

మరోవైపు, ఈ జాబ్‌ ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌కు నమోదు చేసుకున్న విద్యార్థులు, ఉద్యోగ ఆఫర్లు పొందినవారి సంఖ్యలో నెలకొన్న అంతరంపైనా ఐఐటీ బాంబే వివరణ ఇచ్చింది. రిజిస్టర్‌ చేసుకున్నప్పటికీ 435 మంది విద్యార్థులు MS/MTech/PhD, MBA వంటి ఉన్నత విద్యనభ్యసించేందుకు ఆసక్తి చూపించగా.. మరికొందరు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, సివిల్స్‌ సర్వీసెస్‌ను కెరీర్‌ ఆప్షన్‌గా ఎంచుకోవడంతో ప్లేస్‌మెంట్ డ్రైవ్‌లో పాల్గొనలేదని స్పష్టం చేసింది. ఉక్రెయిన్‌ యుద్ధం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనం వంటి పరిస్థితుల నేపథ్యంలో ఈసారి అంతర్జాతీయంగా రిక్రూటర్లు తక్కువగా ఉన్నట్లు ఉన్నట్లు పేర్కొంది.