Parenting Alert | ‘గుడ్ జాబ్’ అంటే సరిపోతుందా?
పిల్లల్ని పదే పదే పొగిడే ఇలాంటి మాటలతో ముప్పే!
By Education News Team
Published :02 Feb 2024 19:58 IST
https://results.eenadu.net/news.aspx?newsid=020225
Parenting Alert | ఇంటర్నెట్ డెస్క్: పసి ప్రాయంలో పిల్లలు చేసే అల్లరి పనులకు తల్లిదండ్రులు తెగ మురిసిపోతారు. ఎదిగే క్రమంలో వారు చేసే గొప్ప పనుల గురించి కుటుంబ సభ్యులు, స్నేహితులతో చెప్పుకొని పొంగిపోతారు. ఒక బొమ్మ గీసో, మంచి మార్కులు సాధించో, స్కూల్‌లో ఏదైనా పోటీల్లో గెలిస్తేనో వారిని మరింతగా ప్రోత్సహించే ఉద్దేశంతో ‘గుడ్‌జాబ్’ అని ప్రశంసిస్తుంటారు చాలా మంది. కానీ, ఎంతో ప్రేమతో, ఇష్టంతో వారు పదే పదే చెప్పే ఇలాంటి మాటలు పిల్లల్ని ప్రోత్సహించడం మాట అటుంచితే.. నష్టం చేసే అవకాశాలే ఉంటాయని పేర్కొంటున్నారు ప్రఖ్యాత పిల్లల మానసిక నిపుణురాలు డాక్టర్ బెక్కీ కెన్నడీ. ‘ది టిమ్ ఫెర్రిస్ షో’లో తన వ్యక్తిగత అనుభవాలతో పాటు పేరెంటింగ్‌కు సంబంధించి ఆమె షేర్ చేసుకున్న విశేషాలివే..
- ‘గుడ్ జాబ్’ అని సింపుల్‌గా ప్రశంసిస్తే పిల్లలు హ్యాపీగా ఉంటారు కదా అని చాలా మంది పేరెంట్స్ భావించొచ్చు. కానీ ఈ రెండు పదాలు (Good Job) దీర్ఘకాలంలో నష్టం చేస్తాయి. పదే పదే మెచ్చుకోలు మాటలు పిల్లల్లో ఆత్మాభిమానాన్ని పెంపొందించే బదులు.. తాము చేసే పనిలో ప్రావీణ్యతను గుర్తించడం కన్నా.. ఇతరుల నుంచి ప్రశంసల్ని కోరుకొనేతత్వం పెరిగే ప్రమాదం ఉంటుంది.
- పిల్లల విజయాల్ని ప్రశంసించడం తల్లిదండ్రులకు బాగా అనిపిస్తుంది. కానీ, తరచూ ఇలాంటి పొగడ్తల మాటలతో పిల్లలు తమ విజయాలను చూసి తామే గర్వపడటం మానేసి.. ప్రశంసల కోసం శోధించేందుకు అలవాటు పడే అవకాశం ఉంది. అందుకోసం ఆరాటం, అన్వేషణ మొదలై.. ఒకవేళ అవి లభించకపోతే నిరాశకు గురికావొచ్చు.
- అందువల్ల, మీ పిల్లలు చేసే పనిని ప్రతిసారి గుడ్ జాబ్ అనడం కాకుండా.. వారేం చేశారో, ఆ పని చేసే క్రమంలో వారి అనుభవాలేంటో తల్లిదండ్రులుగా తెలుసుకొనే క్రమంలో వారిని ప్రోత్సహించేలా వ్యవహరించండి.
- ఒకసారి తన కుమార్తె పెయింటింగ్ చూపించిన క్షణాన్ని గుర్తు చేసుకున్న డాక్టర్ బెక్కీ కెన్నడీ.. ‘‘ఒకసారి నా కూతురు పెయింటింగ్ గీసింది. గుడ్ జాబ్ అనడానికి బదులుగా ఆమె గీసిన చిత్రం గురించి అడిగా. ఆ సందర్భం మా ఇద్దరి మధ్య ఊహించని రీతిలో అర్థవంతమైన చర్చకు దారితీసింది’’ అని చెప్పుకొచ్చారు.
- పిల్లలు చేసిన పని గురించి వారే స్వయంగా మాట్లాడేలా ప్రోత్సహిస్తే స్వీయ అవగాహన, ఆత్మ విశ్వాసం పెరుగుతాయి. సృజనాత్మకతతో కూడిన లోతైన అవగాహన ఏర్పడుతుంది. కొందరు తల్లిదండ్రులకు ఈ సలహా నచ్చకపోవచ్చు. అన్నింటికంటే గుడ్ జాబ్ అని టక్కున చెప్పయడం సులువే. పైగా సానుకూలమైన మాట కూడా. కానీ, ఇది మీ పిల్లలతో మీరు లోతుగా చర్చించే అవకాశాన్ని మాత్రం ఇవ్వదు.
- అందువల్ల ఒక్కమాటతో సరిపెట్టుకోకుండా.. పిల్లలు చేసే పనితో మీరూ కనెక్ట్ అవ్వండి. దానిపై ప్రశ్నలు అడగండి. పిల్లల ఆలోచనలు, వారు చేసే ప్రయత్నాల పట్ల మీరు నిజమైన ఉత్సాహం ప్రదర్శిస్తే వారిలో ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. గుడ్ జాబ్ వంటి చిన్న మాటల కన్నా ఈ ప్రయత్నం అత్యంత శక్తిమంతంగా పనిచేస్తుంది.
- పిల్లలు చేసే పని పట్ల వారే గర్వపడేలా ఎలా చేయాలో ప్రయత్నించండి. వారు చేసిన పని గురించో/ సాధించిన విజయం గురించో వారితో మాట్లాడి చూడండి.. మీకే ఆశ్చర్యం వేస్తుంది.