Inter exams | ఇంటర్‌ పరీక్షలు.. మార్కులు పెంచే మెలకువలివే..!

Inter exams | ఇంటర్‌ పరీక్షలు.. మార్కులు పెంచే మెలకువలివే..!

ఏపీలో ఇంటర్ పరీక్షలు ఇప్పటికే మొదలు కాగా.. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ఈ పరీక్షల సందడి ప్రారంభం కానుంది.

Eenadu icon
By Education News Team Updated :24 Feb 2026 20:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : ఏపీలో ఇంటర్ పరీక్షలు(Inter Exams 2026) ఇప్పటికే మొదలు కాగా.. తెలంగాణలో ఫిబ్రవరి 25 నుంచి ఈ పరీక్షల సందడి ప్రారంభం కానుంది. ఇప్పటికే హాల్‌టికెట్ల విడుదల సహా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తెలంగాణ ఇంటర్‌ బోర్డు అధికారులు.. విద్యార్థులంతా పరీక్ష కేంద్రాల వద్దకు నిర్ణీత సమయానికి ముందే చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు, ఈ పరీక్షల్లో తమ ప్రతిభను చాటేందుకు సర్వ సన్నద్ధతతో ఉన్న విద్యార్థులకు ఎగ్జామ్‌ హాలులో అనుసరించాల్సిన మెలకువలపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఇంటర్‌లో మంచి మార్కులు సాధించేలా నిపుణులు సూచిస్తున్న కొన్ని మెలకువలు ఇవే..!

  • పరీక్ష హాలులో ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ప్రశ్నపత్రం చేతికి అందాక ఆందోళన చెందకుండా ప్రశ్నలన్నింటినీ జాగ్రత్తగా చదవండి. వాటిలో మీకు బాగా తెలిసిన, సులువైన ప్రశ్నలకు ముందుగా సమాధానాలను రాయండి. తద్వారా మీ సమయం ఆదా కావడంతో పాటు మీలో ఆత్మవిశ్వాసమూ రెట్టింపవుతుంది.
  • మీరు రాసే సమాధానాల్లో ముఖ్యమైన పదాలు, ఫార్ములాలు, సబ్‌ హెడ్డింగ్‌లను హైలైట్‌ చేయండి. తద్వారా మీ పేపర్‌ని దిద్దే వ్యక్తికి అవి త్వరగా అర్థమవుతాయి. మీ పట్ల మంచి ఇంప్రెషన్‌ కలుగుతుంది.
  • పెద్ద పెద్ద సమాధానాలను అలా రాస్తూ పోవద్దు. వాటిని పేరాలుగా విభజించడం బెటర్‌. మధ్యలో సబ్‌ హెడ్డింగ్స్, బుల్లెట్‌ పాయింట్లు వంటివి ఇవ్వడం ద్వారా మీ పేపర్‌ ఎంతో ఆకర్షణీయంగా కనబడుతుంది. అవసరం ఉన్నచోట డయాగ్రమ్స్‌ గీయండి. మరీ ముఖ్యంగా సైన్స్‌, జాగ్రఫీ, ఎకనామిక్స్‌ వంటి సబ్జెక్టుల్లో చిత్రపటాలు గీయడం ద్వారా మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది.
  • సమాధానాలు సూటిగా ఉండేలా చూసుకోండి. ప్రశ్నకు సంబంధంలేని అంశాల జోలికి పోవద్దు. సుదీర్ఘమైన పేరాగ్రాఫ్‌లుగా రాయడం కన్నా ముఖ్యమైన అంశాలపైనే ఫోకస్‌ పెట్టండి చాలు. అడిగిన ప్రశ్నకు ఎన్ని మార్కులో చూసుకొని దానికనుగుణంగా సమాధానాల నిడివి ఉండేలా జాగ్రత్త వహించండి.
  • ఒకదానికింద ఒకటి ఇరికించి రాయొద్దు. ప్రతి సమాధానం కింద ఒకట్రెండు లైన్లు ఖాళీ ఉంచండి.  వీలైతే ప్రతి ఆన్సర్‌ని కొత్త పేజీలో రాసేందుకు ప్రయత్నించండి. తద్వారా మీ సమాధాన పత్రం నీట్‌గా కనబడుతుంది. అనవసరంగా పెన్నుతో కొట్టివేయడాలు, ఇరికించి రాయడం వంటివి మీ సమాధానపత్రాన్ని దిద్దేవారికి చిరాకు తెప్పిస్తాయి.
  • మీ పరీక్షను ముగించే ముందు రివిజన్‌ కోసం కొంత సమయం ఉండేలా చూసుకోండి. మీ రోల్‌ నంబర్‌, జవాబు పత్రాల్లో రాసిన ప్రశ్నల నంబర్‌ సరిగా ఉన్నాయో, లేదో చెక్ చేసుకోవడం, అక్షర, అన్వయ దోషాలను సరిచేసేందుకు ఈ టైం బాగా ఉపయోగపడుతుంది.