NIFTEE 2026 Applications | ఫ్యాషన్‌ ప్రపంచం పిలుస్తోంది.. ‘నిఫ్ట్‌’ పరీక్షకు దరఖాస్తులు షురూ!

NIFTEE 2026 Applications | ఫ్యాషన్‌ ప్రపంచం పిలుస్తోంది.. ‘నిఫ్ట్‌’ పరీక్షకు దరఖాస్తులు షురూ!

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(NIFT) క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ, NLEA (లేటరల్‌ ఎంట్రీ), పీహెచ్‌డీ పోగ్రామ్‌లలో ప్రవేశాలకు ఎన్‌టీఏ (NTA) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

Eenadu icon
By Education News Team Updated : IST

NIFTEE 2026 Applications| నేటి ఆధునిక ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆకర్షణీయంగా, ప్రత్యేకంగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఫ్యాషన్‌ రంగంలో వస్తోన్న కొత్త ట్రెండ్స్‌ను అందిపుచ్చుకొనే దిశగా అడుగులు వేస్తున్నారు. దీంతో ఫ్యాషన్‌ కోర్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో 2026 - 27విద్యా సంవత్సరంలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(NIFT) క్యాంపస్‌ల్లో యూజీ, పీజీ, NLEA (లేటరల్‌ ఎంట్రీ), పీహెచ్‌డీ పోగ్రామ్‌లలో ప్రవేశాలకు ఎన్‌టీఏ (NTA) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన, ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం క్లిక్‌ చేయండి

నోటిఫికేషన్‌లోని కొన్ని ముఖ్యాంశాలివే..

  • నాలుగేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌, ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరేందుకు  10+2, తత్సమాన విద్యార్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దీంట్లో ఏడు రకాల కోర్సులు (ఫ్యాషన్‌ కమ్యూనికేషన్‌, యాక్సెసరీ డిజైన్‌, ఫ్యాషన్‌ డిజైన్‌, నిట్‌వేర్‌ డిజైన్‌, లెదర్‌ డిజైన్‌, టెక్స్‌టైల్‌ డిజైన్‌, ఫ్యాషన్‌ ఇంటీరియర్‌) అందుబాటులో ఉన్నాయి.
  • ఆసక్తి కలిగిన విద్యార్థులు జనవరి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈ ప్రవేశ పరీక్ష దేశ వ్యాప్తంగా ఫిబ్రవరి 8న జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కర్నూలు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం; హైదరాబాద్‌, వరంగల్‌ పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు.
  • దేశ వ్యాప్తంగా 100 నగరాల్లో కంప్యూటర్ ఆధారిత (CBT), పెన్ను, పేపర్‌ ఆధారితంగా పరీక్ష జరుగుతుంది. జనరల్‌ ఎబిలిటీ టెస్ట్‌ (GAT) కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష కాగా.. క్రియేటివ్‌ ఎబిలిటీ టెస్ట్‌ (CAT) పెన్ను, పేపర్‌ ఆధారితంగా ఉంటుంది. 
  • రెండేళ్ల మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌లో చేరేందుకు ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. ఇందులో మాస్టర్స్‌ ఆఫ్‌ డిజైన్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ మేనేజ్‌మెంట్‌, మాస్టర్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సులను అందిస్తున్నారు. సృజనాత్మకత, డిజైన్‌పై ఆసక్తి, ఊహలకు రూపమివ్వగలిగే నైపుణ్యం, స్కెచింగ్‌ ప్రావీణ్యం ఉన్నవారు ఈ కోర్సుల్లో చేరి రాణించే అవకాశం ఉంటుంది.
  • బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైనింగ్‌, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సుల్లో చేరాలనుకొనే అభ్యర్థుల వయసు అడ్మిషన్‌ సంవత్సరంలో ఆగస్టు 1 నాటికి 24 ఏళ్లు మించరాదు.
  • ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ కేటగిరీ వారికి ఐదేళ్ల పాటు వయో సడలింపు ఉంది. మాస్టర్స్‌ కోర్సులు, పీహెచ్‌డీ చేయాలనుకొనేవారికి మాత్రం ఎలాంటి వయో పరిమితి లేదు. 
  • ఈ పరీక్షకు సంబంధించిన సిలబస్; మార్కుల కేటాయింపు, వెయిటేజీ, తదితర పూర్తి వివరాల కోసం క్లిక్‌ చేయండి.