JEE Main 2026 Preparation | జేఈఈ మెయిన్‌కు భారీగా దరఖాస్తులు.. ప్రిపరేషన్‌కు ఏడు సూత్రాలివిగో!

JEE Main 2026 Preparation | జేఈఈ మెయిన్‌కు భారీగా దరఖాస్తులు.. ప్రిపరేషన్‌కు ఏడు సూత్రాలివిగో!

జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) పరీక్షలకు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి.

Eenadu icon
By Education News Team Published :07 Dec 2025 3.27 PM IST

JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ (JEE Main 2026) పరీక్షలకు ఈసారి భారీగా దరఖాస్తులు వచ్చాయి. జాతీయ మీడియా కథనాలను బట్టి 2026 జనవరి సెషన్‌కు దాదాపు 14.5లక్షల మందికి పైగా రిజిస్ట్రేషన్‌ చేసుకున్నట్లు సమాచారం. దీంతో గతేడాది (13.11లక్షల మంది)తో పోలిస్తే ఈసారి పోటీ మరింత అధికంగా ఉండనుంది. దరఖాస్తుల సంఖ్యపై ఎన్‌టీఏ అధికారికంగా ఇంకా ప్రకటన చేయలేదు. అయితే, జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్‌ పరీక్షలు ప్రారంభం కానున్న వేళ ఉన్న ఈ కొద్ది రోజుల సమయం అభ్యర్థులకు అత్యంత కీలకంగా మారింది. చక్కటి ప్రణాళిక, కొన్ని మెలకువలు పాటిస్తే మెరుగ్గా రాణించవచ్చంటున్నారు నిపుణులు.

ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌.. ప్రాక్టీస్‌..

ఉన్న తక్కువ సమయంలో ప్రిపరేషనే అత్యంత కీలకం. మీ ప్రిపరేషన్‌లో జేఈఈ మెయిన్‌ మాక్‌ టెస్ట్‌లు, పాత ప్రశ్నపత్రాలు ఎంతో ఉపయోగపడతాయి. మాక్‌ టెస్టుల ద్వారా పరీక్ష సమయంలో ఉండే పరిస్థితులను అర్థం చేసుకోవచ్చు. మీ పెర్ఫామెన్స్‌ను అంచనా వేయడంతో పాటు ఎక్కడ పొరపాటు చేస్తున్నారో గుర్తించొచ్చు. అలాగే, పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్‌ చేయడం ద్వారా వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. ఇక నుంచి వీలైనన్ని ఎక్కువగా ప్రశ్నపత్రాలు సాల్వ్‌ చేయడం టార్గెట్‌గా పెట్టుకోండి.

టైం మేనేజ్‌మెంట్‌.. రివిజన్‌..

పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవారికి టైం మేనేజ్‌మెంట్‌, రివిజనే అత్యంత కీలకం. ఉన్న పరిమితమైన సమయంలోనే అటు థియరీ పార్ట్‌ చదవడం కొనసాగిస్తూనే.. ఇటు ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌ను ప్రాక్టీస్‌ చేసే అలవాటును మెరుగుపరుచుకోవాలి. మీ బలాలు, బలహీనతల ఆధారంగా సబ్జెక్టుల వారీ తగినంత సమయం కేటాయించండి. ఒకే అంశం లేదా సబ్జెక్టుపై ఎక్కువ సమయం గడపొద్దు. ఎప్పటికప్పుడు రివిజన్ చేసుకోవడం మరిచిపోవద్దు. మీ స్టడీ సెషన్‌లో చివరి 30 నిమిషాల సమయాన్ని ముఖ్యమైన కాన్సెప్టుల రివిజన్‌కు ఉపయోగిస్తే ప్రయోజనం ఉంటుంది.

స్టడీ ప్లానింగ్‌.. 

మీ ప్రిపరేషన్‌కు  సంబంధించి టైమ్‌టేబుల్‌ వేసుకుని ప్రతి సబ్జెక్టుకూ, చాప్టరుకూ నిర్ణీత సమయాన్ని కేటాయించుకోండి. ఆ టైమ్‌టేబుల్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ కచ్చితంగా పాటించేలా చూసుకోండి. మూడ్‌ బాలేదనో.. వినోద కార్యక్రమాల కోసమో చదవాల్సిన వాటిని వాయిదా వేసే ధోరణిని వీడండి. రోజువారీ లక్ష్యాలను సెట్‌ చేసుకొని తదనుగుణంగా మీ ప్రిపరేషన్‌ కొనసాగిస్తే ఉత్తమ ఫలితాలు సాధ్యమే.

నో టెన్షన్‌.. ఫోకస్ పెట్టండి

మీరు చదివే వాతావరణం ప్రశాంతంగా ఉండేలా చూసుకోండి. ఫోన్‌లు, సోషల్‌ మీడియా వంటివి మీ దృష్టిని మళ్లిస్తాయి. అందువల్ల చదివే సమయంలో వాటికి దూరంగా ఉండేలా మిమ్మల్ని మీరు నియంత్రించుకుంటూ ప్రిపరేషన్‌పైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టండి. అన్నింటి కంటే ఆత్మవిశ్వాసం ఎంతో ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు దరిచేరనివ్వొద్దు. సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. 

ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌..

చదివే క్రమంలో ఎన్నో సందేహాలు వస్తుంటాయి. అలాంటప్పుడు సీనియర్ల, లెక్చరర్ల, నిపుణుల సలహాలు తీసుకోవాలి. పునరుశ్చరణ, ప్రశ్నల సాధన, సందేహ నివృత్తి కోసం ఆన్‌లైన్‌ స్టడీ మెటీరియల్‌ను తెలివిగా ఉపయోగించుకొనే నేర్పు అలవాటు చేసుకోవాలి. ప్రతి సబ్జెక్టులోని ముఖ్యంశాలనూ నోటు పుస్తకంలో రాసుకుంటే మరింత ప్రయోజనం. 

ఈ పుస్తకాలతో మేలు..

ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను (NCERT Books) బాగా ప్రాక్టీస్‌ చేయండి. ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌కు సంబంధించిన కీలక కాన్సెప్టులను అర్థం చేసుకోవడంలో ఇవెంతో మేలు చేస్తాయి. వీటికి తోడు నిపుణులతో రూపొందించిన స్టడీ మెటీరియల్స్‌ను ఎంచుకోండి. ఉచితంగా లభించే ఆన్‌లైన్‌ లెర్నింగ్‌ ఫ్లాట్‌ఫాంలను సమర్థంగా ఉపయోగించుకోవడం అలవాటు చేసుకోండి.

కాస్త బ్రేక్‌ ఇస్తుండండి.. ఆరోగ్యం జాగ్రత్త!

ప్రిపరేషన్‌ సమయంలో కొందరు విద్యార్థులు తీవ్ర ఆందోళన, ఒత్తిళ్లకు గురవుతుంటారు. ఇలాంటప్పుడు మధ్యలో కాస్త విరామం తీసుకోవాలి. యోగా, ధ్యానం, వ్యాయామాలు చేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి ఉపశమనం పొందొచ్చు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకొనేలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోండి. తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి.