JEE Main 2026| జేఈఈ (మెయిన్‌) పరీక్ష తేదీలొచ్చేశాయ్‌.. మీ ఎగ్జామ్‌ ఏ నగరంలో?

JEE Main 2026| జేఈఈ (మెయిన్‌) పరీక్ష తేదీలొచ్చేశాయ్‌.. మీ ఎగ్జామ్‌ ఏ నగరంలో?

జేఈఈ మెయిన్‌(JEE Main 2026) పరీక్ష తేదీలను ఎన్‌టీఏ ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను సైతం విడుదల చేసింది.

Eenadu icon
By Education News Team Updated :08 Jan 2026 14:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌(JEE Main 2026) సెషన్‌-1 పరీక్ష తేదీలను ఎన్‌టీఏ(NTA) ప్రకటించింది. ఈ పరీక్షకు సంబంధించిన అడ్వాన్స్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పులను సైతం విడుదల చేసింది. జనవరి 21 నుంచి 29 వరకు జరిగే ఈ పరీక్షలకు మీ ఎగ్జామ్‌ సెంటర్‌ ఏ నగరంలో ఉందో ముందుగానే తెలుసుకొనేలా JEE Mains City Intimation Slip 2026ను ఎన్‌టీఏ గురువారం అందుబాటులోకి తీసుకొచ్చింది. అభ్యర్థులు తమ అప్లికేషన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌, సెక్యూరిటీ పిన్‌ ఎంటర్‌ చేసి వీటిని డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల కోసం క్లిక్ చేయండి

పరీక్షల షెడ్యూల్‌ ఇదే..

జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ -1 పరీక్షలు జరుగుతాయని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. మొదటి షిఫ్టు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; రెండో షిఫ్టు పరీక్ష మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు జరగనుంది. జనవరి 29న పేపర్‌ 2ఎ (బీఆర్క్‌) పేపర్‌ 2బి (బి.ప్లానింగ్‌), పేపర్‌ 2ఎ, 2బి (బీఆర్క్‌, బి.ప్లానింగ్‌ రెండూ కలిపి) ఒకే షిఫ్టులో జరగనున్నాయి. ఈ పరీక్ష ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు జరుగుతుందని పేర్కొంది.

జేఈఈ మెయిన్ సెషన్‌- 1 పరీక్షలు దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో, విదేశాల్లోని 15 నగరాల్లో నిర్వహించనున్నట్లు ఎన్టీఏ డైరెక్టర్‌ (ఎగ్జామ్స్‌) తెలిపారు. ఎగ్జామ్‌ సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల డౌన్‌లోడ్‌లో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే అభ్యర్థులు 011-40759000 నంబర్‌కు లేదా jeemain@nta.ac.in ద్వారా సంప్రదించవచ్చని సూచించారు. ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ తెలుసుకొనేందుకు తమ అధికారిక వెబ్‌సైట్‌ని చెక్‌ చేసుకోవాలని కోరారు.