JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

JEE Main 2026 | జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డులు ఎప్పుడంటే?

జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (JEE Main 2026) పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది.

Eenadu icon
By Education News Team Updated :08 Jan 2026 21:16 IST

ఇంటర్నెట్ డెస్క్‌: జేఈఈ మెయిన్‌ సెషన్‌-1 (JEE Main 2026) పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలను, సిటీ ఇంటిమేషన్‌ స్లిప్పుల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన అధికారులు.. తాజాగా అడ్మిట్‌ కార్డులను విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. జనవరి 21 నుంచి 29వరకు జరగనున్న ఈ పరీక్షలకు మూడు లేదా నాలుగు రోజుల ముందు మాత్రమే అడ్మిట్‌ కార్డుల్ని వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ కోసం అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. 

దేశవ్యాప్తంగా జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్‌ పేపర్‌ 1 పరీక్ష, 29న పేపర్‌ -2 పరీక్ష జరగనున్నాయి. రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. తొలి షిఫ్టు ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు; రెండో షిఫ్టు మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ అడ్మిట్‌ కార్డుల్ని ఆయా పరీక్ష తేదీలకు మూడు లేదా నాలుగు రోజుల ముందు విడుదల చేస్తారు. దీన్నిబట్టి జనవరి 21న జరిగే జేఈఈ మెయిన్‌ పరీక్షకు ఈ నెల 17 లేదా 18 తేదీల్లో అడ్మిట్‌ కార్డులు(JEE Main Admit Cards) విడుదలయ్యే అవకాశం ఉంది. 

గతేడాది జేఈఈ మెయిన్‌ పరీక్షలు(JEE Main 2025) జనవరి 22 నుంచి 30 వరకు జరిగిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కూడా జనవరి 22, 23, 24 తేదీల్లో నిర్వహించిన పరీక్షలకు జనవరి 18న అడ్మిట్‌ కార్డుల్ని విడుదల చేయగా..  జనవరి 28, 29, 30 తేదీల్లో పరీక్షలకు జనవరి 23న అడ్మిట్‌ కార్డుల్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీన్నిబట్టి ఈసారి కూడా దాదాపు అదే తరహాలో అడ్మిట్‌ కార్డులను విడుదల చేసే అవకాశం ఉంది.