CBSE Counseling Services | పరీక్షల ఒత్తిడా?.. సీబీఎస్‌ఈ ఉచిత టెలీ కౌన్సెలింగ్ సర్వీస్
పది, 12వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వినూత్న కార్యక్రమం చేపట్టింది.
By Education News Team
Published :06 Jan 2026 20:21 IST
https://results.eenadu.net/news.aspx?newsid=612025cbse
ఇంటర్నెట్ డెస్క్: పది, 12వ తరగతి పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థుల శ్రేయస్సే లక్ష్యంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) వినూత్న కార్యక్రమం చేపట్టింది. విద్యార్థుల కోసం సైకో-సోషల్ కౌన్సెలింగ్ సర్వీసుల(Psycho-Social Counseling Services)ను ప్రారంభించింది. ఫిబ్రవరి 17 నుంచి మొదలయ్యే వార్షిక పరీక్షలకు విద్యార్థులు ప్రిపరేషన్ కొనసాగిస్తున్న ఈ కీలక సమయంలో వారిలో ఒత్తిడి, భావోద్వేగ సంబంధిత సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టింది. థియరీ పరీక్షల్లో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, సమతుల్యతను పెంపొందించి మానసిక ఆందోళనను నియంత్రించేలా జనవరి 6 నుంచి జూన్ 1వరకు తొలి విడత ఉచిత కౌన్సెలింగ్ సర్వీసులను ప్రారంభించినట్లు తెలిపింది.
విద్యార్థులకు 24*7 టోల్‌ఫ్రీ ఐవీఆర్‌ఎస్ (1800-11-8004)ని అందుబాటులోకి తీసుకొచ్చింది. హింది, ఇంగ్లిష్ భాషల్లో నిరంతరం ఇది విద్యార్థులకు మార్గదర్శనం చేసేలా సేవలందించనుంది. ఒత్తిడి లేని ప్రిపరేషన్, సమయాన్ని సమర్థవంతంగా వినియోగించడం, ఒత్తిడి నియంత్రణతో పాటు తరచూ అడిగే ప్రశ్నలకు ప్రతిస్పందనలు, అవసరమైనప్పుడు విద్యార్థులకు ఉపయోగపడే సమాచారాన్ని అందించడంలో ఆచరణాత్మక మార్గదర్శకత్వాన్ని అందించనున్నట్లు సీబీఎస్‌ఈ తెలిపింది.
టెలీ కౌన్సెలింగ్ సర్వీస్‌ను సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇది ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు ఉదయం 9.30గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు పనిచేయనుంది. 73మంది శిక్షణ కలిగిన ప్రొఫెషనల్స్ (సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలకు చెందిన ప్రిన్సిపల్స్, కౌన్సెలర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్స్, అర్హత కలిగిన సైకాలజిస్టులు) ఇందులో భాగంగా ఉంటారు. వీరిలో 61మంది కౌన్సెలర్లు భారత్‌లో ఉండగా.. 12 మంది కౌన్సెలర్టు జపాన్, నేపాల్, ఖతార్, ఒమన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి సేవలందిస్తారు. ఒత్తిడి నియంత్రణ, సమర్థమంతమైన అధ్యయన పద్ధతులతో పాటు భావోద్వేగ సంబంధిత అంశాలపై ఎంతో ఆసక్తికరంగా, సులభమైన రీతిలో రూపొందించిన సమాచారాన్ని సీబీఎస్‌ఈ తన అధికారిక వెబ్‌సైట్‌లో ఉంచినట్లు ఓ ప్రకటనలో తెలిపింది.