Improve Your Memory | జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలా? ఈ టిప్స్‌ ట్రై చేయండి!

Improve Your Memory | జ్ఞాపకశక్తిని పెంచుకోవడం ఎలా? ఈ టిప్స్‌ ట్రై చేయండి!

జ్ఞాపశక్తిని పెంచుకోవాలంటే పాటించాల్సిన కొన్ని సూచనలు ఇవే..

Published :28 Oct 2024 06:06 IST

Memory Improvement skills| ఇంటర్నెట్ డెస్క్‌: రోజూ మనం ఎన్నో చూస్తాం.. ఏవేవో చదువుతుంటాం.. అనేకమందితో మాట్లాడుతుంటాం. కానీ, అవన్నీ అంతగా గుర్తుండవు. చదువు విషయానికే వస్తే.. విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో కొందరు చదివింది జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని పరీక్షల్లో రాసి మంచి మార్కులు సాధిస్తే.. ఇంకొందరు ఎంత శ్రద్ధగా చదివినా పరీక్షల సమయానికి మరిచిపోతుంటారు. పరీక్షలు సరిగా రాయలేక తీవ్ర నిరాశకు గురవుతుంటారు. ఈ నేపథ్యంలో జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకోవడం ఎలా? ఇందుకోసం అసలేం చేయాలో నిపుణులు సూచించే కొన్ని పద్ధతులివే.. 

కంపెనీలే మీవైపు చూసేలా.. ఈ స్కిల్స్‌ నేర్చుకున్నారా?

  • మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. జీవనశైలి సరిగ్గా ఉండాలి. రాత్రి పదింటిలోపే పడుకుని, ఉదయం ఐదింటికల్లా నిద్రలేవాలి. నాణ్యమైన నిద్రతో ఆరోగ్యానికి మేలు జరుగుఉంది. మెదడులో జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడంతో పాటు సమాచారాన్ని గుర్తుంచుకోవడంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల తగినంత నిద్ర ఉండేలా చూసుకోండి. 
  • చురుగ్గా వినడం ప్రాక్టీసు చేయాలి. కేవలం కంటితో చూస్తూ చదవడం మాత్రమే కాకుండా చురుగ్గా వినడం అలవర్చుకోవాలి. చదివిన/విన్న సమాచారాన్ని విశ్లేషిస్తూ మీకు మీరే ప్రశ్నలు సంధించుకోవడం, ఒకదానికొకటి అనుసంధానించడం, సమ్మరీ తయారు చేసుకోవడం.. ఇలా ప్రాక్టీసు చేస్తే ఎప్పటికీ గుర్తుండే వీలుంటుంది.
  • మెమరీని పెంచుకోవడంలో విజువలైజేషన్‌ టెక్నిక్‌ చాలా ముఖ్యమైనది. మీరు చదివిన లేదా చూసిన వాటిలో ఏదైనా అంశాన్ని ఊహాత్మకంగా లేదా మెదడులో ఒక రూపాన్ని ఏర్పరచుకోవడం ద్వారా ఆ సమాచారం అవసరమైనప్పుడు వెంటనే గుర్తుకొస్తుంది. 
  • చదివిన దాన్ని ఎప్పటికప్పుడు రీకాల్‌ చేసుకోవాలి. కేవలం పరీక్షలోనే కాకుండా సాధారణ సమయాల్లోనూ ఈ ప్రక్రియను ఆచరించాలి. అలాగైతే.. ఆయా అంశాలపై పట్టు ఏర్పడుతుంది. 
  • సమాచారాన్ని అంశాల వారీగా చిన్న భాగాలుగా విభజించుకోండి. తద్వారా త్వరగా అర్థమవుతుంది. పరీక్షల సమయంలో/అవసరమైనప్పుడు సులభంగా రీకాల్‌ చేసుకోగలరు. 
  • రోజూ వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన డైట్‌ పాటించడం మరిచిపోవద్దు. వ్యాయామం మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది. సమాచారాన్ని రీకాల్‌ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. 
  • మీకు తెలిసిన/నేర్చుకున్న విషయాలను ఇతరులతో పంచుకోవడం, చర్చించడం అలవాటు చేసుకోండి. ఇది మీకు మరింతలా గుర్తుండేలా ఉపయోగపడుతుంది.