essential skills for employment I కొలువు కొట్టాలంటే..  ఈ నైపుణ్యాల్ని ఒడిసిపట్టాల్సిందే..!

Employment Skills : కొలువు కొట్టాలంటే.. ఈ నైపుణ్యాలు కావాల్సిందే..!!

ఉద్యోగం సాధించాలంటే కేవలం విద్యార్హతలుంటే చాలదు.. నైపుణ్యాలే కీలకంగా మారాయి. కొన్ని నైపుణ్యాలు ఉంటేనే ఉద్యోగం సులువుగా సాధించవచ్చంటున్నారు నిపుణులు.

Published : 26 May 2024 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: కాలం మారింది. కేవలం పుస్తకాలు బట్టిపట్టి చదివితే సరిపోదు.. మార్కెట్‌కు తగిన స్కిల్స్‌ నేర్చుకుంటేనే మంచి కెరీర్‌. ఐటీ రంగం కొత్త పుంతలు తొక్కుతున్న వేళ ఈ పోటీ ప్రపంచంలో నైపుణ్యాల్లేకపోతే కొలువులు కొట్టడం అసాధ్యం. ఉద్యోగం వచ్చినా ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ కాకపోతే అందులో నిలదొక్కుకోవడమూ కష్టమే. అందుకే ఉద్యోగార్హతలకు తగిన నైపుణ్యాలను నేర్చుకొని వాటిపై పట్టు పెంచుకోవాలంటున్నారు నిపుణులు. హార్డ్‌, సాఫ్ట్‌ స్కిల్స్‌లో ఏదో ఒక్కటే ఉంటే చాలదు.. ఈ రెంటినీ ఒడిసిపడితేనే కొలువులు సాధించవచ్చంటున్నారు. ఆ నైపుణ్యాలివే..

  • భావ వ్యక్తీకరణ: విషయం ఏదైనా అవతలి వ్యక్తికి సూటిగా, స్పష్టంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఏవైనా ప్రాజెక్టులపై ఇతరులతో చర్చించాల్సి ఉన్నప్పుడు మీలోని భావాలను, మీరు చెప్పాలనుకున్నది ఆ వ్యక్తికి అర్థం కాకపోతే.. లాభం మాట అటుంచితే నష్టమే ఎక్కువ. అందుకే కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ బాగా ఉన్న అభ్యర్థుల వైపే రిక్రూటర్లు మొగ్గుచూపుతుంటారు. అందరితో కలిసి మాట్లాడటం, ఆలోచనల్ని పంచుకోవడం ద్వారా ఈ నైపుణ్యాల్ని సాధించవచ్చు.
  • క్రియేటివిటీ: కొత్తగా, సృజనాత్మకంగా ఆలోచించే వారికే మార్కెట్లో డిమాండ్‌ ఎక్కువ. ఏ పని చేసినా మనం లేకపోతే ఇంకెవరూ ఇంత సమర్థంగా చేయలేరనిపించేలా ఉండాలి. మూస పద్ధతుల్లో కాకుండా వినూత్న ఆలోచనలతో ప్రాజెక్టులను స్మార్ట్‌గా పూర్తి చేసేవారికి ఉండే ఆ గుర్తింపే వేరు. అందుకే, అనునిత్యం ఉత్సాహంగా, సృజనాత్మకతతో ఆలోచించే దృక్పథాన్ని అలవర్చుకోవాలి.
  • సమస్య పరిష్కారం: ఉద్యోగ సాధనకు అత్యంత అవసరమైన స్కిల్‌ ఇది. విధులను నిర్వర్తించే క్రమంలో పరిస్థితుల్ని అంచనా వేయడం తెలియాలి. సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించే నైపుణ్యంతో పాటు  పనిలో ఎదురయ్యే అడ్డంకుల్ని తొలగించుకొని ముందుకెళ్లే నేర్పు, సహనం అలవర్చుకోండి. 
  • విశ్లేషించే నేర్పు:  ఏదైనా ప్రాజెక్టు లేదా పనిని సమర్థంగా పూర్తి చేయగలిగే నైపుణ్యం మీకు ఉందో లేదో రిక్రూటర్లు పరిశీలిస్తారు.  అనుకున్న ప్రణాళిక ప్రకారం నిర్మాణాలు పూర్తిచేయాలంటే కావాల్సింది విశ్లేషణా నైపుణ్యమే. పనుల్లో నాణ్యతను పరీక్షించడం, అవసరమైన మార్పులు చేర్పులు చేయడం వంటివి జరగాలంటే ఈ నైపుణ్యమే కీలకం. 
  • కంప్యూటర్‌ పరిజ్ఞానం: మీరు ఏ రంగంలో పనిచేస్తున్నా సరే.. కంప్యూటర్‌ పరిజ్ఞానం తప్పనిసరి. ప్రోగ్రామింగ్‌, కోడింగ్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ వంటి అంశాలు తెలిసుండాలి. కంప్యూటర్‌ స్కిల్స్‌ ఉన్న అభ్యర్థులకే రిక్రూటర్లు అధిక ప్రాధాన్యమిస్తున్నారు. 
  • కలిసి పనిచేసేతత్వం : నలుగురితో కలిసి మెలిసి పనిచేసే నైపుణ్యం లేకపోతే ఉద్యోగంలో నిలదొక్కుకోవడం కష్టమే.  బృంద సభ్యుడిగా అందరితో కలివిడిగా పనిచేస్తూనే..  నాయకత్వ బాధ్యతలిస్తే టీమ్‌ను సమర్థంగా నడిపించడమూ తెలియాలి.  కొత్త ప్రాజెక్టులు,  డిజైన్లను పూర్తి చేయడంలో టీమ్‌ వర్క్‌ ఎంతో కీలకం గనక ఈ నైపుణ్యం ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది. 
  • కొత్త కొత్తగా: నిత్యం కొత్తదనంగా ఉండాలి. కొత్త విషయాల్ని నేర్చుకుంటూనే.. ఎలాంటి  పరిస్థితులకైనా తట్టుకొని నిలబడగలిగే నైపుణ్యం అవసరం. ప్రపంచం మారుతున్న వేళ భిన్నమైన పరిస్థితుల్లో పనిచేయడం నేర్చుకోవాలి. కొత్త వాటికి అలవాటుపడే తత్వం అలవర్చుకోకపోతే ముందుకెళ్లలేరు.
  • ఒత్తిడిని తట్టుకోగలరా?: వచ్చే ప్రాజెక్టుల్లో సవాళ్లతో కూడినవే ఎక్కువగా ఉంటాయి. దీంతో ఎంతో ఒత్తిడికి గురికావాల్సి ఉంటుంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ మీరు సమర్థంగా పూర్తి చేసిన కొన్ని ప్రాజెక్టుల్ని రెజ్యుమేలో చేర్చడం మీకు అదనపు ప్రయోజనం. ఒత్తిడిని జయించి పనిచేసే నేర్పు మీకు మంచి గుర్తింపు ఇవ్వడంతో పాటు మీ కెరీర్‌ను  మరింత మెరుగ్గా చేస్తుంది. 
  • నిర్ణయాలు తీసుకోవడం రావాలి: ముఖ్యమైన విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకోవాలి. ప్రతిదానికీ అనవసరంగా కంగారుపడటం, ఆందోళనకు గురవడం వంటివి మీ అసమర్థతకు సంకేతంగా నిలుస్తాయి. అందుకే ప్రతిదీ తర్కించి, లాభనష్టాలు బేరీజు వేసి సమయస్ఫూర్తితో వ్యవహరించే నైపుణ్యం అలవర్చుకోవాలి. 
  • సమయపాలన: ఉన్న కొద్ది సమయాన్నే సమర్థంగా వినియోగించుకోవడం తెలియాలి.  ప్రాధాన్యతా క్రమంలో పనులు పూర్తి చేసుకుంటూ అనుకున్న సమయానికే లక్ష్యాల్ని చేరుకొనేలా ప్రణాళికను డిజైన్‌ చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు.

విద్యా సమాచారం