Time Management: కాలం ఇట్టే కరిగిపోతోందా? టైం మేనేజ్‌మెంట్‌కు చిట్కాలివిగో!
మనకు ఉన్న సమయాన్ని చక్కని ప్రణాళికతో వినియోగించుకుంటే కెరీర్‌లో విజయం సాధించడం కష్టమేమీ కాదంటున్నారు నిపుణులు.. సమయాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు కొన్ని మెలకువలు మీకోసం..
Published : 24 June 2024 06:40 IST
https://results.eenadu.net/news.aspx?newsid=24062024
ఇంటర్నెట్ డెస్క్: రోజులో అందరికీ ఉండేది 24 గంటలే.. ఆ టైంను ఎలా ఉపయోగించుకున్నామనేదే ఏ పనికైనా కీలకం. చాలా మంది విద్యార్థులు/ఉద్యోగార్థులూ తమ ప్రిపరేషన్‌కు టైం సరిపోవడం లేదని తరచూ చెబుతుంటారు. కానీ, కొందరికే ఆ టైం ఎందుకు సరిపోతుంది? వాళ్లు ఎలా పరీక్షల్లో విజయం సాధిస్తున్నారు? చాలా మందికి ఎందుకు సరిపోవడం లేదు? ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఈ కింద పేర్కొన్న మెలకువల్ని తెలుసుకోవాల్సిందే..!
- కచ్చితమైన ప్లాన్: ఈ డిజిటల్ యుగంలో ప్రణాళిక లేకుండా ముందుకెళ్లడం చాలా కష్టం. ఏయే సబ్జెక్టులు చదవాలి, ఎప్పుడు చదవాలి, ఎంతసేపు చదవాలనే విషయాల్లో క్లారిటీ ఉండాలి. ఉదాహరణకు రోజూ మూడు సబ్జెక్టుల్లో మూడు అధ్యాయాలను చదవాలని ప్లాన్ వేసుకున్నారనుకుందాం.. దాని ప్రకారం అవి చదివేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని మర్నాటికి వాయిదా వేయకూడదు. ఎందుకంటే మర్నాడు ఏమేం చదవాలనేదానికీ మీ దగ్గర ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. ఈరోజు ప్లాన్ తప్పడం ద్వారా రేపటి ప్లాన్ పాడవకూడదు. అందువల్ల ఏరోజు చదవాల్సిన వాటిని ఆ రోజే పూర్తిచేయడం ఎంతో అవసరం. ఇలా చేస్తే సమయం సరిపోకపోవడం, వృథా కావడం లాంటి సమస్యలు తలెత్తవు.
- ప్రతి నిమిషమూ విలువైందే..: సమయం ఎంతో విలువైంది. అనవసరంగా కాలాన్ని వృథా చేస్తే నష్టపోయేది మనమే. తెలిసిచేసినా, తెలియక చేసినా.. వృథా అయిన కాలాన్ని తిరిగి పొందలేం కదా. ముఖ్యంగా విద్యార్థి దశలో దీనికి మరింత ప్రాధాన్యం ఉంటుంది. నిర్దేశిత లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రతి నిమిషమూ అమూల్యమైందే. ఈ విషయాన్ని గుర్తించడమే టైం మేనేజ్‌మెంట్‌కు తొలి అడుగు. చిన్నచిన్న పనులకు సమయం వృథా అవుతుందని భావిస్తే.. కుటుంబ సభ్యుల సాయం తీసుకోవచ్చు. ఉదాహరణకు అసైన్‌మెంట్లను ప్రూఫ్ రీడింగ్ చేయడాన్ని వారికి అప్పగించొచ్చు. ఆ సమయంలో మీరు మరో ముఖ్యమైన అధ్యాయం చదువుకోవచ్చు.
- ఏకాగ్రత కోల్పోవద్దు..: కొంతమంది విద్యార్థులు ఒక్క అధ్యాయాన్ని చదవడానికి కూడా గంటలకొద్దీ సమయాన్ని తీసుకుంటారు. ఎందుకంటే ఒకవైపు చదువుతూనే.. మరోపక్క మొబైల్ ఫోన్లో స్నేహితులతో చాటింగ్ చేస్తుంటారు. కంప్యూటర్/మొబైల్/ట్యాబ్ వంటి పరికరాలపై చదువుతున్నప్పుడు వాటిలో వేరే వెబ్‌సైట్/మెసేజ్ వంటివి ఓపెన్ కావడం వల్ల ఏకాగ్రత దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. దీంతో వేగంగా చదవడంలో ఆటంకం ఏర్పడుతుంది. అందువల్ల, చదివేటప్పుడు సెల్‌ఫోన్‌ను స్విచాఫ్ చేయడం, మరో వెబ్‌సైట్ చూడకపోవడం వంటివి చేస్తే మంచిది. మీ దృష్టిని ఒక్క పని మీద మాత్రమే కేంద్రీకరించాలి.
- తరచూ చదివే ప్రదేశాలు మార్చొద్దు..: సమయ పాలనలో మీరు చదువుకునే చోటుకూ ప్రాధాన్యం ఉంటుంది. గాలి, వెలుతురుతో నిశ్శబ్దంగా ఉండే చోటును ఎంపిక చేసుకోండి. అక్కడ కూర్చుని ఎక్కువ గంటలపాటు చదివినా ఎలాంటి ఇబ్బందీ లేకుండా ఉండేలా చూసుకోవాలి. మంచం లేదా సోఫా మీద కూర్చుని చదివితే నిద్ర రావచ్చు. చదవడానికి కుర్చీ, టేబుల్‌ను ఉపయోగిస్తే మంచిది. ఎదురుగా గడియారాన్ని అమర్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏ సబ్జెక్టుకు ఎంత సమయాన్ని వినియోగిస్తున్నారో స్పష్టంగా తెలుస్తుంది. చదివేటప్పుడు ముఖ్యమైన పాయింట్లను హైలైట్ చేయడానికి వీలుగా పెన్ను/మార్కర్ లాంటివి అందుబాటులో పెట్టుకోవాలి. అవసరమయ్యే వస్తువుల కోసం పదేపదే వేరే గదిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా చూసుకోండి. చదివే చోటును తరచూ మార్చొద్దు. రోజూ ఒకేచోట కూర్చుని చదవడం వల్ల.. అక్కడికి వెళ్లగానే చదవాలనే మూడ్‌లోకి వెళ్లిపోతారు. ఇతర విషయాలేవీ మీకు గుర్తుకు రావు.
- ఏం చదవాలో ముందు ప్లాన్: ఏమేం చదవాలో ప్లాన్ చేసుకొనే ముందు నెల, వారం, రోజులవారీగా దాన్ని విభజించుకుంటే మంచిది. దీంతో ఏరోజు పనుల్ని ఆ రోజే పూర్తిచేయగలుగుతారు. ఒకరోజు అనుకున్నట్టుగా చేయలేకపోయినా.. ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలుగుతారు. మీకు ఉన్న పనుల్ని అతి ముఖ్యమైనవి, ముఖ్యమైనవి, ప్రస్తుతం చేయకపోయినా ఎలాంటి ఇబ్బందీలేని.. ఇలా వాటి స్వభావాన్ని బట్టి విభజించుకోండి. ఇలా చేయడం వల్ల ప్రతి పనికీ కొంత సమయాన్ని కేటాయించగలుగుతారు.
- నిద్రపోయే సమయంలో మార్పులొద్దు: సమయ పాలన పాటించడంలో నిద్రకూ ప్రాధాన్యముంటుంది. కొందరు విద్యార్థులు అర్ధరాత్రి వరకూ చదివి ఉదయాన్నే నిద్ర లేస్తారు. లేదా మధ్యాహ్నం వరకూ నిద్రపోతూనే ఉంటారు. ఇలా నిద్రించే సమయాలు మారడం వల్ల దాని ప్రభావం చదువు మీదా పడుతుంది. నిద్రా సమయాలను కచ్చితంగా పాటిస్తే చదవడానికి వేసుకున్న ప్రణాళికనూ తప్పకుండా పాటించగలుగుతారు. సమయం వృథా అయ్యే సమస్యే ఉండదు. అలాగే తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. సుమారు ఆరేడు గంటలపాటు నిద్రపోతే శారీరకంగా తగిన విశ్రాంతిని పొందుతారు. దాంతో మర్నాడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది.