JEE Main 2025 | త్వరలోనే జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌.. పరీక్ష సరళి, రిజిస్ట్రేషన్‌ ఇలా..!

JEE Main 2025 | త్వరలోనే జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌.. పరీక్ష సరళి, రిజిస్ట్రేషన్‌ ఇలా..!

జేఈఈ మెయిన్‌ పరీక్ష తేదీలు త్వరలోనే విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష సరళి, ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.

Published :22 Oct 2024 16:39 IST

JEE Main 2025 | ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలోని ప్రఖ్యాత విద్యా సంస్థల్లో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌(JEE Main 2025) పరీక్షకు సన్నద్ధమవుతోన్న విద్యార్థులకు అలర్ట్‌! జేఈఈ- 2025 పరీక్షకు సంబంధించి త్వరలోనే ఈ పరీక్షల షెడ్యూల్‌ విడుదల కానుంది. ఇందుకోసం ఎన్‌టీఏ ( NTA) అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు. ఆశావహులైన లక్షలాది మంది అభ్యర్థులు jeemain.nta.ac.in వెబ్‌సైట్‌లో ఈ పరీక్ష అప్‌డేట్స్‌ చెక్‌ చేసుకోవచ్చు. 

జేఈఈ మెయిన్‌, నీట్‌కు ప్రిపేర్‌ అవుతున్నారా? ఉచిత క్రాష్‌ కోర్సుకు దరఖాస్తు ఇలా..

పరీక్ష ప్యాట్రన్‌ ఇదే.. 

  • జేఈఈ మెయిన్‌ (JEE Main Exam) అనేది జాతీయస్థాయి ఇంజినీరింగ్‌  ప్రవేశ పరీక్ష. దీన్ని ఏటా రెండు సార్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) నిర్వహిస్తుంది. గతంలో ఏడాదిలో ఒకసారి మాత్రమే నిర్వహించే ఈ పరీక్షను గత రెండేళ్లుగా రెండుసార్లు (జనవరి, ఏప్రిల్‌) నిర్వహిస్తున్నారు. ఇంటర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టులు అభ్యసిస్తున్న విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఛాయిస్‌ ఎత్తివేత

జేఈఈ మెయిన్‌ పరీక్షల్లో గత మూడేళ్ల నుంచి సెక్షన్‌ బీలో కొనసాగుతున్న ఛాయిస్‌ను ఎత్తివేస్తూ ఇటీవల ఎన్‌టీఏ (NTA)అధికారులు నోటిఫికేషన్‌ జారీ చేశారు. జేఈఈ మెయిన్‌ (JEE Main Exam) ర్యాంకుల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 32 ఎన్‌ఐటీల్లో బీటెక్‌ సీట్లు భర్తీ చేస్తారు.  జేఈఈ మెయిన్‌లో 75 ప్రశ్నలు.. ఒక్కో దానికి 4 మార్కుల చొప్పున మొత్తం 300 మార్కులకు ప్రశ్నపత్రం ఇచ్చేవారు.  

మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల నుంచి 25 చొప్పున ప్రశ్నలు ఉండేవి. కొవిడ్‌ నేపథ్యంలో విద్యార్థులకు వెసులుబాటు ఇచ్చేందుకు ప్రతి సబ్జెక్టులో ఛాయిస్‌ ప్రశ్నలు ఇచ్చారు. జేఈఈ మెయిన్‌ 2021 నుంచి ఒక్కో సబ్జెక్టులో 30 చొప్పున మొత్తం 90 ప్రశ్నలు ఇస్తూ వచ్చారు. ప్రతి సబ్జెక్టులో ఏ, బీ సెక్షన్లు ఉండేవి. సెక్షన్‌ ఏలో 20 ప్రశ్నలకు మొత్తం జవాబులు రాయాలి. సెక్షన్‌ బీలో 10 ఇచ్చి అయిదు ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేలా ఛాయిస్‌ ఇస్తున్నారు. ఈసారి నుంచి ఆ ఛాయిస్‌ ఉండదని ఎన్‌టీఏ అధికారులు స్పష్టం చేశారు.

జేఈఈ మెయిన్‌ ప్రిపరేషన్‌కు చిట్కాలు ఇవిగో..

రిజిస్ట్రేషన్‌ ఇలా..

  • తొలుత jeemain.nta.ac.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
  • హోమ్‌ పేజీలో న్యూ రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి.
  • మీ పేరు, మొబైల్‌ నంబర్‌, ఈ- మెయిల్‌ అడ్రస్‌ వంటి సమాచారాన్ని ఎంటర్‌ చేయాలి
  • రిజిస్ట్రేషన్‌ పూర్తయ్యాక లాగిన్‌ క్రెడెన్షియల్స్‌ జెనరేట్‌ అవుతాయి. 
  • వాటి ఆధారంగా మీ వ్యక్తిగత, విద్యాసంబంధిత వివరాలతో అప్లికేషన్‌ పూర్తి చేయాలి.
  • మీ ఫొటో, సంతకం స్కాన్‌ చేసి అప్‌లోడ్‌ చేయాలి.
  • జేఈఈ మెయిన్‌ దరఖాస్తు రుసుం చెల్లించాక.. సబ్‌మిట్‌ బటన్‌పై క్లిక్‌ చేయాలి.
  • కన్ఫర్మేషన్‌ పేజీని డౌన్‌లోడ్‌ చేసి రిఫరెన్స్‌ కోసంమీ వద్ద ఉంచుకోండి.