UPSC Civils final Results | యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌

UPSC Civils final Results | యూపీఎస్సీ సివిల్స్‌ తుది ఫలితాలు వచ్చేశాయ్‌

అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ (Civils) - 2024 తుది ఫలితాలు వచ్చేశాయి.

Eenadu icon
By Education News Team Published :22 Apr 2025 14:16 IST

UPSC CSE Results | దిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ (UPSC) నిర్వహించిన సివిల్స్‌ - 2024 తుది ఫలితాలు(UPSC Civils 2024 final Results) వచ్చేశాయి. ఫలితాలను యూపీఎస్సీ మంగళవారం మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు విద్యార్థులు సత్తా చాటారు. (UPSC Civils Final result 2024)

ఎంపికైన అభ్యర్థుల జాబితా కోసం క్లిక్‌ చేయండి

టాప్‌ 10 ర్యాంకర్లు వీరే..

శక్తి దూబే ప్రథమ ర్యాంకుతో సత్తా చాటగా.. హర్షిత గోయల్‌ (2), అర్చిత్‌ పరాగ్‌ (3), షా మార్గి చిరాగ్‌(4), ఆకాశ్‌ గార్గ్‌ (5), కోమల్‌ పునియా(6), ఆయుషీ బన్సల్‌(7), రాజ్‌కృష్ణ ఝా(8), ఆదిత్య విక్రమ్‌ అగర్వాల్‌ (9), మయాంక్‌ త్రిపాఠి(10) ర్యాంకుల్లో మెరిశారు.

సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీళ్లే.. 

సివిల్స్‌ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాల నుంచి సత్తా చాటిన విద్యార్థుల్లో ఇ.సాయి శివాని 11వ ర్యాంకుతో మెరవగా.. బన్నా వెంకటేశ్‌కు 15వ ర్యాంకు, అభిషేక్‌ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్‌కుమార్‌ రెడ్డి 62, సాయి చైతన్య జాదవ్‌ 68, ఎన్‌ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్‌ రెడ్డి 119, చల్లా పవన్‌ కల్యాణ్‌ 146, ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి 151, నెల్లూరు సాయితేజ 154, కొలిపాక శ్రీకృష్ణసాయి 190వ  ర్యాంకులతో అదరగొట్టారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించిన యూపీఎస్సీ.. ఇందులో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29వ తేదీ వరకు మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించింది. మెయిన్స్‌లో సత్తా చాటిన వారికి జనవరి 7 నుంచి ఏప్రిల్‌ 17వరకు దశల వారీగా పర్సనల్‌ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలను ప్రకటించింది. ఈ ఫలితాల్లో 1,009 మందిని ఐఏఎస్‌, ఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, సెంట్రల్‌ సర్వీసెస్‌ గ్రూప్‌ ఎ, గ్రూప్‌ బి సర్వీసులకు ఎంపిక చేయగా.. వీరిలో జనరల్‌ కేటగిరీలో 335 మంది, ఈడబ్ల్యూఎస్‌ నుంచి 109, ఓబీసీ నుంచి 318, ఎస్సీ కేటగిరీలో 160, ఎస్టీ కేటగిరీ నుంచి 87మంది చొప్పున ఉన్నారు. అలాగే, సివిల్‌ సర్వీసెస్‌ నిబంధనలను అనుసరించి 230మందిని రిజర్వు జాబితాలో ఉంచింది.

  • ఈ ఫలితాలకు సంబంధించి ఏదైనా సమాచారం కావాలనుకొనేవారి కోసం యూపీఎస్సీ క్యాంపస్‌లోని పరీక్షా హాల్ వద్ద కౌంటర్‌ను ఏర్పాటు చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది. 2024 సివిల్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు.. తమ పరీక్షలు, నియామకాలకు సంబంధించి ఏదైనా సమాచారం లేదా క్లారిటీ కావాలంటే పనిదినాల్లో ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల మధ్య స్వయంగా వచ్చి గానీ, 23385271, 23381125, 23098543 ఫోన్‌ నంబర్ల ద్వారా గానీ సంప్రదించవచ్చని సూచించింది.
  • సివిల్స్‌లో అభ్యర్థులు సాధించిన మార్కుల జాబితాను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు యూపీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.