Butterfly tapping technique | నిద్రలోనూ ఆలోచనలేనా? ఈ ‘బటర్‌ఫ్లై ట్యాపింగ్‌’ టెక్నిక్‌ ట్రై చేయండి!

Butterfly tapping technique | నిద్రలోనూ ఆలోచనలేనా?ఈ ‘బటర్‌ఫ్లై ట్యాపింగ్‌’ టెక్నిక్‌ ట్రై చేయండి!

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో విపరీతమైన ఒత్తిడి వల్ల నిద్రలో నాణ్యత లోపిస్తుంది. మరి రాత్రిళ్లు ఎలాంటి ఆలోచనలు వేధించకుండా నిద్రపోవాలంటే.. ఈ చిట్కా పాటిస్తే మేలంటున్నారు నిపుణులు.

Published :20 July 2024 08:00 IST

Butterfly tapping| ఇంటర్నెట్‌ డెస్క్‌:   పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులు, ఉద్యోగార్థుల్లో ఒత్తిడి సహజమే! దీంతో వారి నిద్రలో నాణ్యత లోపిస్తుంది. రాత్రిళ్లలో లైట్లు, గ్యాడ్జెట్లను స్విచాఫ్‌ చేసి నిద్రకు ఉపక్రమించినా కొన్నిసార్లు మెదడులో ఏవేవో ఆలోచనలు అలా మెదలుతూనే ఉంటాయి. ఈ సమస్యని అధిగమించేందుకు బటర్‌ఫ్లై ట్యాపింగ్‌ టెక్నిక్‌ అనుసరిస్తే మేలంటున్నారు సోమాటిక్‌ యాంగ్జాయిటీ నిపుణులు జోలీ స్లోవిస్‌. ఇంతకీ ఏమిటీ టెక్నిక్‌? ఎలా పనిచేస్తుందో చూద్దాం!

ఆలోచనల్లేని జీవనం వ్యర్థమే అంటారు పెద్దలు! అలాగని, రాత్రి నిద్రపోయాక కూడా మెదడును ఆలోచనలు తొలి చేస్తుంటే..  చాలా ఇబ్బందిగా ఉంటుంది కదూ! ప్రతి మనిషికీ నిద్ర (Sleep) చాలా అవసరం.  ఈ కాలంలో జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి వంటి సమస్యలు మనిషికి నిద్రను దూరం చేస్తున్నాయి. నిద్ర కరవైతే మనిషికి నీరసం, నిస్సత్తువ ఆవహిస్తాయి. ఏకాగ్రత లోపించి చురుకుదనాన్ని కోల్పోతారు. నిద్రలో మీ మెదడు పుట్టెడు ఆలోచనలతో నిండిపోయి ఆందోళనకు గురిచేస్తే.. బటర్‌ఫ్లై ట్యాపింగ్ (Butterfly tapping) టెక్నిక్‌ను ప్రయత్నించి చూడాలంటున్నారు కొందరు నిపుణులు. ఇందుకోసం మీ రెండు అర చేతుల్ని ఛాతిపై ఉంచి బొటనవేళ్లను ఓ కొక్కెం మాదిరిగా జోడించాలి. సీతాకోక చిలుక (బటర్‌ఫ్లై) ఆకారంలో చేతుల్ని ఉంచి ఛాతీపై ఎడమ, కుడి అరచేతులతో ప్రత్యామ్నాయంగా  అలా చరుస్తుండాలి. ఇలా ఒకట్రెండు నిమిషాల పాటు ఈ ప్రక్రియను చేయడం ద్వారా శరీరం రిలాక్సేషన్‌ మోడ్‌లోకి వెళ్లి.. మెదడులో ఆలోచనలు తగ్గి  త్వరగా నిద్రలోకి జారుకొనే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. 

సంగీతం విన్నా మంచిదే!

రాత్రిపూట మంచి నిద్ర కోసం బటర్‌ఫ్లై ట్యాపింగ్‌ టెక్నిక్‌ వినియోగంలో ఉందని.. కానీ ఇది అందరికీ పనిచేయకపోవచ్చని మరికొందరు నిపుణులు పేర్కొంటున్నారు. ఒత్తిడికి గురైతే నిద్ర పట్టడం చాలా కష్టమేనని.. నిద్రకు సరైన షెడ్యూల్‌ లేకపోవడం, నాణ్యమైన నిద్ర కరవవడంతో కొన్ని సందర్భాల్లో ఇది ఇన్సోమ్నియా (నిద్రలేమి)కి దారి తీయొచ్చని చెబుతున్నారు. అందువల్ల ఈ టెక్నిక్‌లో రిథమిటిక్‌ వైబ్రేషన్లతో శరీరం రిలాక్స్‌ మోడ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుందంటున్నారు. మనుషులు రోజులో కనీసం 7 నుంచి 8గంటల నాణ్యమైన నిద్ర ఉండేలా ప్లాన్‌ చేసుకోవాలని, ఇందుకోసం అవసరమైతే తమ జీవన శైలిలో కొన్ని సర్దుబాట్లు చేసుకుంటే మంచిదని సూచిస్తున్నారు. ఈ టెక్నిక్‌ను ట్రై చేయడం వల్ల ఎలాంటి హానికరం కాదని.. కాకపోతే మీలో ఒత్తిడికి గల కారణాలను తెలుసుకొని పరిష్కరించుకోవడమే ఉత్తమమని సూచిస్తున్నారు. అలాగే, నిద్రపోయేముందు మీకు ఇష్టమైన సంగీతం వినడం వంటి చర్యలూ మేలు చేస్తాయంటున్నారు. మీ చుట్టూ ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవడం ద్వారా నిద్రలో నాణ్యతను మెరుగుపరుచుకోవచ్చని సూచిస్తున్నారు.