GATE 2025 Results | అప్పుడు ‘నీట్’లో 57.. నేడు గేట్‌లో నంబర్ 1.. తెలుగు విద్యార్థి సత్తా
గేట్ ఫలితాల్లో (GATE 2025 Results) తెలుగు విద్యార్థి సత్తా చాటాడు. నెల్లూరు జిల్లాకు చెందిన నిఖిల్ చౌదరి డేటా సైన్స్, ఏఐ పేపర్‌లో ఆలిండియా నంబర్ వన్ ర్యాంకుతో మెరిశాడు.
By Education News Team
Published :19 Mar 2025 18:24 IST
https://results.eenadu.net/news.aspx?newsid=19032025-gate-2025-toppers
ఇంటర్నెట్ డెస్క్: దేశంలోని ఐఐటీలు సహా పలు ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్, పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ ఫలితాల్లో (GATE 2025 Results) తెలుగు విద్యార్థి సత్తా చాటాడు. డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ పేపర్‌లో శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆమంచర్లకు చెందిన డాక్టర్ సాదినేని నిఖిల్ చౌదరి ఆలిండియా ప్రథమ ర్యాంకుతో మెరిశారు. 100 మార్కులకు గాను 96.33 మార్కులు సాధించారు. గతంలో నీట్ పరీక్షలోనూ 57వ ర్యాంకుతో అదరగొట్టిన నిఖిల్.. ప్రస్తుతం నోయిడాలోని ఎక్స్‌పర్ట్‌డాక్స్ అనే సంస్థలో ఇన్ఫర్మాటిక్స్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. ఏఐలో ఎంటెక్ చేయాలన్న తన కలను సాకారం చేసుకోవాలన్న లక్ష్యం కోసం కసితో కష్టపడి చదివి మరోసారి అద్భుత విజయం సాధించిన నిఖిల్ గురించి క్లుప్తంగా..
జాబ్ చేస్తూ.. ప్రిపరేషన్ ఇలా..
లక్ష్యానికి కృషి తోడైతే అద్భుత విజయాలు సాధించొచ్చని మరోసారి రుజువు చేశాడు నిఖిల్ చౌదరి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)లో ఎంటెక్ చేయాలన్న గొప్ప ఆశయంతో ప్రిపేరేషన్ కొనసాగించాడు. ఈ ప్రయాణంలో ఉద్యోగాన్ని, తన వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక రోజూ నాలుగైదు గంటలు, సెలవు రోజుల్లో అయితే ఏడెనిమిది గంటలు కష్టపడి గేట్‌కు ప్రణాళికాబద్ధంగా తన ప్రిపరేషన్ కొనసాగించారు. గేట్‌లో అద్భుత విజయంతో ఏదైనా ప్రతిష్ఠాత్మక ఐఐటీలో ఎంటెక్ చేయాలన్న తన కలను సాకారం చేసుకున్నారు.
చిన్నప్పట్నుంచీ.. చదువుల్లో చురుకే..
చిన్నప్పట్నుంచే చదువుల్లో ముందుండే నిఖిల్ పది, ఇంటర్ విద్యను హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. పదోతరగతిలో 9.8 సీజీపీఏ, ఇంటర్‌లో 98.6 శాతం మార్కులతో రాణించాడు. 2017లో నీట్ పరీక్షలో 57వ ర్యాంకుతో మెరిశాడు. ఎయిమ్స్ ఎంట్రన్స్ పరీక్షలో 22వ ర్యాంకు సాధించి సత్తా చాటాడు. ప్రతిష్ఠాత్మక దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ అభ్యసించిన ఆయన.. 2024లో ఐఐటీ మద్రాస్ (IIT Madras) నుంచి డేటా సైన్స్‌లో ఆన్‌లైన్‌లో డిగ్రీ సైతం పూర్తి చేశాడు. నిఖిల్ చౌదరి తండ్రి సాదినేని శ్రీనివాసులు కందుకూరులోని ప్రకాశం ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తుండగా.. తల్లి బిందు మాధవి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్.