Useful Websites for Students | పాఠాల్లో డౌటా... ‘క్లిక్’ చేయండి!
టీచర్ చెప్పిన పాఠాలు అస్సలు అర్థం కావట్లేదు.. ఏం చేయాలి? సైన్స్‌లో నేను కొంచెం వీక్.. ఎలా గట్టెక్కాలి? ఇలా విద్యార్థుల మనసుల్లో సందేహాలు తీర్చే వెబ్‌సైట్లు ఇవిగో!
Published :17 July 2024 07:00 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17072024
Useful Websites for Students| టీచర్ చెప్పిన పాఠాలు అస్సలు అర్థం కావట్లేదు... ఏం చేయాలి? సైన్స్‌లో నేను కొంచెం వీక్... ఎలా గట్టెక్కాలి? లెక్కల్ని చూస్తేనే భయమేస్తోంది.... దాన్నుంచి బయటపడొచ్చా? ఇలా విద్యార్థుల మనసుల్లో ఎన్నో సందేహాలు... వాటన్నింటికీ పరిష్కారం చూపిస్తున్నాయి కొన్ని వెబ్‌సైట్లు. ఉచితంగానే పాఠాలు చెబుతూ, అనుమానాలన్నీ తీర్చేస్తున్నాయి!
కొంతమంది పిల్లలు ఇలా చెబితే అలా నేర్చుకుంటారు, మరికొందరేమో నిదానంగానే అర్థం చేసుకుంటారు. ఒక విద్యార్థి మ్యాథ్స్‌లో ముందుంటే, ఇంకొక స్టూడెంట్ సైన్స్‌లో ర్యాంకు తెచ్చుకోవచ్చు. అందుకే ఇవన్నీ గమనిస్తూనే తమ పిల్లలు బాగా చదువుకునేలా అమ్మానాన్నలు- బడిలో అర్థంకాని విషయాలూ, వెనకబడిన సబ్జెక్టులూ నేర్పించడానికి రోజూ ట్యూషన్లకూ పంపిస్తుంటారు. ఆ అవసరం లేకుండా ఇంట్లో నుంచి ఎక్కడికీ వెళ్లకుండానే బోలెడన్ని విషయాలు నేర్చుకోవచ్చు ఇప్పుడు. అందుకోసం ఉచితంగా పాఠాలు చెబుతూ విద్యార్థుల సందేహాల్ని నివృత్తి చేస్తున్నాయి ఈ వెబ్‌సైట్లు.
- ‘మ్యాగ్నెట్ బ్రెయిన్స్’ (Magnetbrains).. ఇంగ్లిష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉండే ఈ ఎడ్యుకేషనల్ వెబ్‌సైట్లో- పిల్లలకు కమ్మని కబుర్లతో ‘వన్, టూ, త్రీలు’ చెప్పడం దగ్గర్నుంచి 12వ తరగతిలో నేర్చుకునే ‘డీఎన్‌ఏ పాఠాలు’ వరకూ అన్నీ ఉంటాయి. రాష్ట్రాల సిలబస్‌లతోపాటూ సీబీఎస్‌ఈ పాఠాలన్నీ కనిపిస్తాయి. ఒక్కో తరగతీ, వాటి సబ్జెక్టులతో పూర్తి కోర్సుల వీడియోలూ ఉంటాయి. అంతేకాదు, ఇదివరకటి పరీక్షల ప్రశ్నాపత్రాలతోపాటూ వాటికి జవాబులూ చెప్పే వీడియో క్లాసుల్నీ ఇందులో చూడొచ్చు. ఇలా పాఠ్యాంశాలన్నింటినీ వివరంగా నేర్చుకోవచ్చు.
ఇంకా ఐఐటీ-జేఈఈ, నీట్ పోటీపరీక్షల శిక్షణా తరగతుల్నీ చూడొచ్చు. వేదిక్ మ్యాథ్స్, స్పోకెన్ ఇంగ్లిష్‌లనూ నేర్పిస్తారు. ఈ వెబ్‌సైట్‌కు సంబంధించిన యూట్యూబ్, ఇతర సోషల్ మీడియా వేదికల్లో ఉచిత పాఠాలతోపాటు, లైవ్ సందేహాల సెషన్లలోనూ పాల్గొనొచ్చు.
- ‘టిక్‌లింక్స్’ (Ticklinks)లో స్టడీమెటీరియల్ అందిస్తారు. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ విద్యార్థుల వరకూ ఎవరైనా ఈ వెబ్‌సైట్లో రిజిస్టర్ అవ్వొచ్చు. ఆయా తరగతిని బట్టి పాఠాలూ, వర్క్‌షీట్లూ, ఇతర యాక్టివిటీలూ ఉంటాయి. దీంట్లో కొత్త విషయాలు నేర్చుకుంటూనే అసైన్మెంట్లూ పూర్తిచేసేయొచ్చు. విద్యార్థుల్ని ప్రోత్సహించడానికి సమస్యలకు పరిష్కారం చూపే ఇన్నోవేటివ్ ప్రాజెక్టులతో ఎన్నెన్నో పోటీలూ, ప్రత్యేక ఈవెంట్లూ పెడుతుంటారు.
- అంతేకాదు, విద్యార్థులకు ఒక్కోసారి హోంవర్కులు చేస్తున్నప్పుడో, పరీక్షలకు సిద్ధమవుతున్నప్పుడో బోలెడన్ని సందేహాలొస్తుంటాయి కదా! వాటిని తీర్చడానికి పక్కన ఎవరైనా అందుబాటులో ఉంటే ఫర్వాలేదు కానీ, ఒకవేళ చెప్పేవాళ్లు లేకపోతే ఎలా... అలాంటప్పుడు ఉపయోగపడటానికి ‘ఫొటోమ్యాథ్ (photomath), టాపర్ (Toppr)’లాంటి వెబ్‌సైట్లూ ఉన్నాయి. ‘ఫొటోమ్యాథ్’ ద్వారా ఎంతటి కష్టమైన లెక్కకైనా సరే, ఇట్టే సమాధానం తెలుసుకోవచ్చు. ఆప్‌లానూ అందుబాటులో ఉన్న దీంట్లో- ప్రశ్న ఫొటోను తీసి అప్‌లోడ్‌చేసి పెట్టామంటే, క్షణాల్లో వివరంగా జవాబును చూపిస్తుందది. ‘టాపర్’లో అయితే లెక్కలతోపాటూ అన్ని సబ్జెక్టుల్లోని సందేహాల్నీ తెలుసుకోవచ్చు.
రోజూ ట్యూషన్‌కు వెళ్లడం వీలుకాక పోయినా, సబ్జెక్టుల్లో వచ్చే సందేహాలన్నీ తీర్చు కోవడానికైనా... ఎంచక్కా వీటిని ప్రయత్నించి చూడొచ్చు, ఏ ఖర్చూ లేకుండానే చదువులో ముందుకు దూసుకుపోవచ్చు!