AFCAT result 2025 | ఏఎఫ్ క్యాట్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
భారత వైమానిక దళంలోని పలు విభాగాల్లో 336 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT)ఫలితాలు విడుదలయ్యాయి.
By Education News Team
Published :17 Mar 2025 16:12 IST
https://results.eenadu.net/news.aspx?newsid=17032025-afcat-result-2025
ఇంటర్నెట్ డెస్క్: భారత వైమానిక దళం(Indian Airforce)లోని పలు విభాగాల్లో 336 పోస్టుల భర్తీకి నిర్వహించిన ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్(AFCAT)ఫలితాలు విడుదలయ్యాయి. ఫిబ్రవరి 22, 23 తేదీల్లో ఈ నియామక పరీక్ష నిర్వహించగా.. తాజాగా ఫలితాలను ప్రకటించారు. అభ్యర్థులు ఏఎఫ్‌సీఏటీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. ఈ-మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాలి. అలాగే, అభ్యర్థులు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ పాస్‌వర్డ్ కోసం తమ ఈ-మెయిల్‌లోని ఇన్‌బాక్స్‌తో పాటు స్పామ్ ఫోల్డర్‌ను చెక్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
ఫలితాల కోసం క్లిక్ చేయండి
ఎయిర్‌ఫోర్స్‌లోని ఫ్లైయింగ్ బ్రాంచ్, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్, నాన్ టెక్నికల్) బ్రాంచ్‌ల్లో పలు ఉద్యోగ నియామకాలకు గతేడాది డిసెంబర్‌లో దరఖాస్తులు స్వీకరించిన విషయం తెలిసిందే. ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా ఫ్లైయింగ్ బ్రాంచ్‌లో 30 పోస్టులు, గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) 189, గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) 117 చొప్పున ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఎంపికైన వారికి 2026 జనవరి 1 నుంచి హైదరాబాద్‌లోని దుండిగల్‌లో ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ట్రైనింగ్ ప్రారంభం కానుంది. ఫ్లయింగ్ అండ్ గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్) విభాగాల వారికి 62 వారాలు.. గ్రౌండ్ డ్యూటీ (నాన్ టెక్నికల్) వారికి 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో రూ.56,100 చొప్పున చెల్లిస్తారు. ఈ ఉద్యోగాలకు ఎంపిక, శిక్షణ కోసం తగిన ఫిజికల్ ఫిట్‌నెస్ అవసరం.