How to increase critical thinking | ఏమిటీ ‘క్రిటికల్‌ థింకింగ్‌’.. పెంచుకోవడమెలా?

Critical Thinking: ఏమిటీ ‘క్రిటికల్‌ థింకింగ్‌’.. పెంచుకోవడమెలా?

క్రిటికల్‌గా ఆలోచిస్తూ.. నిత్య నూతనంగా ఉండే అభ్యర్థులకే ప్రముఖ కంపెనీలు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ నైపుణ్యాలను అలవర్చుకోవడం చాలా అవసరం.

Published : 14 June 2024 21:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రిటికల్‌ థింకింగ్‌.. నేటి పోటీ ప్రపంచంలో మంచి జాబ్‌ రావాలంటే ఈ నైపుణ్యమే కీలకం. క్రిటికల్‌గా ఆలోచిస్తూ.. నిత్య నూతనంగా ఉండే అభ్యర్థులకే ప్రముఖ కంపెనీలు ఎర్ర తివాచీ పరిచి ఆహ్వానిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలేంటీ క్రిటికల్‌ థింకింగ్‌? ఈ నైపుణ్యం ఉన్నవారు ఎలా ఆలోచిస్తారు? దీన్ని అలవర్చుకొని రాణించడం ఎలా? 

మన వద్ద ఉండే సమాచారం ఆధారం చేసుకొని ఏదైనా అంశాన్ని లేదా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడాన్నే క్రిటికల్‌ థింకింగ్‌ అనొచ్చు. ఇందులో ఆబ్జెక్టివ్‌గా ఉండటం ఎంతో అవసరం. అంటే సమస్యను భావోద్వేగాలతో (ఎమోషనల్‌గా) కాకుండా తార్కికంగా డీల్‌ చేయడమన్నమాట. కంపెనీల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాలన్నింటికీ ఈ నైపుణ్యం కీలకం.

క్రిటికల్‌ థింకింగ్‌ అనేది క్రియేటివ్‌ థింకింగ్‌ కంటే భిన్నమైంది. సృజనాత్మకతలో మనం ఏదైనా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడమో, కొత్తగా ఆలోచించి దేన్నైనా సృష్టించడమో జరుగుతుంది. కానీ క్రిటికల్‌ థింకింగ్‌లో అలా కాదు. ఉన్న సమాచారాన్ని ఎంత సమర్థంగా అర్థం చేసుకున్నారు? దాన్నుంచి ఫలితాలనిచ్చే పరిష్కారాలు ఏమేరకు రాబట్టారనేదే ముఖ్యం. క్రిటికల్‌ థింకింగ్‌కు పరిశీలన, విశ్లేషణ, వివరణ, గణన, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం వంటివి అవసరం. ఇందుకోసం చాలా సాధన చేయాల్సి ఉంటుంది.

ఈ థింకింగ్‌ ఉన్నవారు ఇలా..

  • ఆలోచనల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు.
  • వాదన - ప్రతివాదనకు విలువనిస్తారు. 
  • సరైన పరిష్కారాన్ని గుర్తించి దాన్ని ఆచరణీయంగా మలుస్తారు.
  • రీజనింగ్‌లో లోపాలుంటే గుర్తిసారు.
  • సమస్యల పరిష్కారానికి క్రమపద్ధతిని పాటిస్తారు.
  • ఆలోచనలు, నమ్మకాలు, వాస్తవాల మధ్య తేడాను గుర్తిస్తారు.

క్రిటికల్‌ థింకింగ్‌ను పెంచుకోవడం ఎలా?

  • కనిపించేదంతా నమ్మి సరేననడం సరికాదు. ఒక విషయాన్ని ఒకటి కంటే ఎక్కువ కోణాల్లో చూడటంతో పాటు సాధన చేయాలి. ఏ వాదననైనా సమర్థించడానికి ఉన్న కారణాలు, రుజువులు ఏంటనేది చూడాలి.
  • కాస్త కష్టమైనా సరే.. మనం నమ్మేదంతా నిజం కాదనే విషయాన్ని అంగీకరించగలగాలి. సొంత ఆలోచనలు, అభిప్రాయాలను పక్కనపెట్టి పూర్తిగా లాజికల్‌గా థింక్‌ చేయడం నేర్చుకోవాలి.
  • కొత్త విషయాలను నేర్చుకోవడానికి తొలి మెట్టు ప్రశ్నించడమే. అందువల్ల సందర్భం ఏదైనా సరే.. సందేహం వస్తే ప్రశ్నించి విషయాలను పూర్తిగా తెలుసుకొనేందుకే ప్రయత్నించాలి. 
  • ఎక్కువ సమాచారం మన చేతిలో ఉంటేనే సరైన నిర్ణయానికి రాగలం. ఇందుకు పూర్తిస్థాయిలో రీసెర్చ్‌ అవసరం. అలాగే పనిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఇంకా మెరుగ్గా పరుచుకొనేందుకు అవకాశం ఉందేమో చూసుకోండి.
  • క్రిటికల్‌ థింకింగ్‌ నేర్చుకోవడానికి ఆన్‌లైన్‌లో చాలా కోర్సులు సైతం ఉన్నాయి. లాజిక్‌, క్రిటికల్‌ థింకింగ్‌, మైండ్‌వేర్‌ అంశాలపై పలు సంస్థలు క్లాసులు కూడా నిర్వహిస్తున్నాయి.